ఆరుగాలం సేద్యంBack to list

ఆరుగాలం సేద్యం

హేమంత కాలంలో ప్రారంభమై,అభినందనల వర్షంలో తడిచి,విమర్శల గ్రీష్మ తాపానికి ఎదురొడ్డి,శరత్కాల వెన్నెల్లో వీక్షకులకి విందు చేసి,ఆకురాలే శిశిరం నుండి,సరికొత్త ఆలోచనల వసంతాన్ని విరబూయిస్తూ సాగిస్తున్న ఈ సేద్యానికి ఆరువసంతాలు.ఈ ఆరు సంవత్సరాల్లో ఈ క్షేత్రంలో పండించిన పంటలు ఎన్నో.

 2010 జనవరి 14 నుండి నేటి వరకు ఆరు సంవత్సరాల పాటు గ్రామాభివృద్దిలో, గ్రామ వారసత్వ సంపదని పరిరక్షించి వాటి విశేషాలని భావితరాలకి అందించటంలో సఫలీక్రుతులమయ్యాం అని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. పలు అభివృద్ధి పనులకి, అలాగే గ్రామంలో అవసరాలని ఈ మాధ్యమం ద్వారా తెలియచెయ్యగా చాలామంది ప్రవాసీయులు స్పందించి తమ వితరణని అందించారు.ఎప్పటికప్పుడు గ్రామంలో జరిగే విశేషాలని, వార్తలని ఈ వెబ్సైట్ ద్వారా తక్షణమే అందరికీ చేరేట్లు చేస్తున్నాం. గ్రామం నుండి 100 ఏళ్ల క్రితం విదేశాలకి తరలిపోయిన శిల్పసంపదని ఈ మాధ్యమం ద్వారానే మళ్ళీ అందరికీ చూపించగలిగాము. కాల గర్భంలో కలిసిపోయిన మన గ్రామ విశిష్టతని తెలియచేసే ఎన్నో విలువైన పుస్తకాలని ఈ బుక్స్ రూపంలో భద్రపరిచాం. ఘంటసాల చరిత్ర పుస్తకాన్ని మళ్ళీ పునర్ముద్రించి చరిత్ర పరిశోధకులకు ఒక దిక్సూచిగా ఉపయోగపడేట్లు చెయ్యగలిగాం. రాష్ట్రం విడిపోయాక ప్రభుత్వం చేపట్టిన బుద్ధ ఆరామాల అభివృద్ధి ప్రాజెక్ట్ లో మన ఘంటసాల.net కూడా తన వంతు సమాచారాన్ని అందించింది. జలధీశ్వరాలయ అభివృద్దిలో , ఆ ఆలయానికి మరింత ప్రాచుర్యం కల్పించటంలో వెబ్సైటు పాత్ర ఎన్నదగినది. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కి మద్దతుగా స్వచ్ఛ ఘంటసాల కార్యక్రమానికి ఆర్ధికంగా. నైతికంగా మద్దతు తెలియచేసి కార్యక్రమ విజయానికి దోహదపడటం జరిగినది.

మేము ఈ వెబ్సైట్ ని ప్రారంభించినపుడు అందరం అప్పుడప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నాం. చాలామంది ఈ వయసులో ఇవన్ని ఎందుకు అని వారించినా, కేవలం మా సమయాన్ని, ఆలోచనల్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టి ఈ వెబ్ సైట్ ప్రారంభించాం.ఆర్ధికంగా పెట్టుబడి ప్రవాస ఘంటసాల వాసులే అందించారు.గడచిన సంవత్సరం నుండి గ్రామంలో నివసించే పెద్దలకి కూడా ఈ మాధ్యమం బాగా దగ్గరైనది. ప్రతి రోజూ వారు కూడా ఇంటర్నెట్ చూస్తూ మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తున్నారు.కొన్ని విశేషాలని,వార్తలని నేరుగా వారే అందిస్తున్నారు.ఈ వెబ్సైట్ లో విన్నపాలని చూసి కొంతమంది దాతలు నేరుగా తమ వితరణని అందిస్తుండగా కొంతమంది దాతలు మాత్రం మనఘంటసాల టీమ్ వారి వ్యక్తిగత బాంక్ అకౌంట్ కి పంపించటం జరుగుతోంది. ఆ తరువాత మనఘంటసాల టీమ్ ఆయా సంస్థలకి, వ్యక్తులకి ఆ డబ్బుని అందించటం జరుగుతోంది.ఇలా ఆరు సంవత్సరాల్లో మేము అందించిన సేవలకి సరైన నివేదిక అంటూ లేకుండా పోయింది. అందుకే ఈ మనఘంటసాల.net సేవలని మరింత విస్తృతంగా చెయ్యాలనే ఉద్దేశంతో , గ్రామస్తుల సూచన మేరకు మన ఘంటసాల ట్రస్ట్ గా మార్చి ఎన్ జి ఓ గా రిజిస్ట్రేషన్ చెయ్యాలని భావించాము.

తద్వారా ఈ ట్రస్ట్ పేరుమీద ఒక బాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇకపై వచ్చే విరాళాలని గ్రామంలో అభివృద్ధి పనులకి వినియోగించటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక రూపంలో ఆడిట్ ని ప్రకటించటం జరుగుతుంది.ఇందులో సభ్యులుగా ఎక్కువమంది గ్రామంలో నివసిస్తూ గ్రామాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్న వారిని నియమించుకోవటం ద్వారా ఈ ట్రస్ట్ సేవలని మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చు.
చాలా ట్రస్ట్ లని ఛారిటబుల్ ట్రస్ట్ గా పిలవటం మనం చూస్తున్నాం.ఛారిటీ అనే పదం వాడకూడదు అని మేము నిర్ణయించుకున్నాం.ఇందుకు కారణం గొర్రెపాటి విద్యాట్రస్ట్ స్థాపకులు శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు నాతో చెప్పిన ఒక మాట."మనం మనుషులున్న సమాజంలో బతుకుతున్నాం కాబట్టే డబ్బులు సంపాదించగలుగుతున్నాం. అదే మనం ఒక దీవిలో మనుషుల్లేని చోట ఉంటే డబ్బులు సంపాదించగలిగేవాళ్ళం కాదు.మనకి డబ్బులు సంపాదించే అవకాశం ఇచ్చింది సమాజం.ఆ అవకాశం ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వటం మన భాద్యత.ఈ భాధ్యతని ఛారిటీ అని పిలవకూడదు.ఇది కేవలం మన సంపదని మనకిచ్చిన సమాజంతో కలిసి పంచుకోవటం మాత్రమే."ఈ స్ఫూర్తి తోనే ఈ ట్రస్ట్ కి ఛారిటబుల్ అనే పదం వాడకుండా మనఘంటసాల ట్రస్ట్ అనే పేరు పెట్టాలని నిర్ణయించాం. ఈ సంవత్సరం దాదాపు 66 శాతం మంది కొత్త పాఠకులు ఉన్నారు. 7500 మంది 11000 సార్లు ఈ వెబ్ సైట్ ని దర్శించారు. ఫేస్ బుక్ లో ఫాలోయర్స్ సంఖ్య గత సంవత్సరం 700 ఉండగా ఈ సంవత్సరం 1100 కి చేరుకుంది.ఎప్పటిలాగే వెబ్ సైట్ ని దర్శించిన వాళ్ళలో ఇండియాదే అగ్ర స్థానం.తరువాతి స్థానాల్లో అమెరికా,ఆస్ట్రేలియా ఉన్నాయి.ఇక ఈ సంవత్సరం ఎక్కువమంది చదివిన కధనం మన ఊరి శ్రీమంతుడు.మన గ్రామం వారే కాకుండా తానా సంపాదకులు జంపాల చౌదరి గారు ఈ కధనాన్ని చదివి ప్రత్యేకంగా అభినందించటంతో పాటు తన ఫేస్బుక్ లో షేర్ చెయ్యటం ద్వారా మరింతమందికి చేరేలా చేశారు. సంవత్సరాంతంలో రవితేజ హోటల్ నారాయణ గారితో చేసిన ఇంటర్వ్యూ అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టికల్.మొదట నా దృక్పధం నుండే ఆయన అనుభవాలు రాద్దాం అనుకున్నాను. కాని ఆయనతో మాట్లాడాక, ఇదొక ఇంటర్వ్యూ గా వేస్తేనే బావుంటుందనిపించింది.ఇది చదివిన చాలామంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ అభినందించారు.ఇక మెసేజ్ లకి లెక్కలేదు.భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూ లు చెయ్యవచ్చు అనే నమ్మకాన్ని ఈ కధనం ఇచ్చింది.గత మూడు సంవత్సరాలుగా నేను విదేశాల్లో ఉండటం వల్ల సంక్రాంతికి ఊరు రాలేకపోయాను. ఈ ఆరవ వార్షికోత్సవ సమయానికి గ్రామంలో ఉండటం, ఈ వెబ్ సైట్ కి స్ఫూర్తి అయిన శ్రీ పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం చాలా సంతోషంగా ఉంది.
ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళతామని తెలియచేస్తూ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. 
 
Dated : 12.01.2015

 

This text will be replaced