రవితేజ టిఫిన్ సెంటర్ Back to list

రవితేజ హోటల్ గుర్తుందా ? 1990 వ దశకంలోనే MLA దోశ MP దోశ అంటూ హడావుడి చేసిన నారాయణ గుర్తున్నారా? రవితేజ చికెన్ సెంటర్ , రవితేజ వైన్స్ అంటూ ఆనతి కాలంలోనే ఘంటసాల గ్రామంలో తారాజువ్వలా నింగికెగసి అంతే తొందరగా నేలను తాకిన అయినపూడి నారాయణ ఇప్పుడెక్కడున్నారు? రవితేజ హోటల్ కనుమరుగవటానికి కారణాలు ఏమిటి? స్థాపించిన కొద్ది నెలల్లోనే అత్యంత ప్రాచుర్యం పొంది, గ్రామ ప్రజల మనసును గెలుచుకున్న టిఫిన్ సెంటర్ ఎందుకు మూతబడింది? అసలు ఇప్పుడు నారాయణ ఏం చేస్తున్నారు? రవితేజ నారాయణ తో మనఘంటసాల ఎడిటర్ రాజేష్ వేమూరి ప్రత్యేక ఇంటర్వ్యూ ..

            వెబ్ సైట్ మొదలైన ఆరు సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా వెలువడుతున్న ఒక వ్యక్తి ఇంటర్వ్యూ

రాజేష్ వేమూరి : నమస్కారం నారాయణ గారు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు ?
బావున్నానండి, గత 15 ఏళ్లుగా విశాఖ పట్నంలో ఫుడ్ బిజినెస్ లో ఉన్నాను 11 అవుట్ లెట్స్ ఉన్నాయి. రత్నవారి వంటిల్లు పేరుతో దాదాపు సిటీ లో అన్ని ప్రాంతాల్లో ఫుడ్ పార్సెల్ సెంటర్స్ ఉన్నాయి. 
రాజేష్ వేమూరి :అసలు మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ? 
నేను పుట్టి పెరిగిందంతా ఘంటసాలలోనే. నాన్న అయినపూడి దశరధరామయ్య, అమ్మ విమలమ్మ.నాకు ఇద్దరు అన్నయ్యలు,ఒక అక్క. సాయి అన్నయ్య ఘంటసాలలో ఉండేవారు, బ్రహ్మయ్య అన్నయ్య విజయవాడలో ఉంటారు. అక్క వెంకట రత్నమ్మ కుటుంబం కూడా విజయవాడలో ఉంటారు. స్కూల్ వరకు అక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వటంతో మా నాన్న బందరు శీలం నాగేశ్వరరావు ఐ టి ఐ కాలేజిలో చేర్పించారు. అప్పట్లో ఐ టి ఐ చదివితే ఉద్యోగం వచ్చేది అని అది చదివించారు. అదయ్యాక ఊర్లో పేపర్ చదివే అలవాటున్న ఒకే ఒక వ్యక్తీ చిట్టియ్య గారు విశాఖపట్నంలో ఉద్యోగాలున్నాయి  మీ వాడిని వెళ్ళమని మా నాన్నగారికి చెప్పటంతో బలవంతంగానే 1982 డిసెంబర్ లో విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ చికెన్ సెంటర్ తో పాటు ఉద్యోగాలతో పాటు ఫౌల్ట్రీ బిజినెస్ చేశాను.
 
రాజేష్ వేమూరి : వివాహం గురించి ?
నా శ్రీమతి శైలజ నాకు మేనమామ కూతురే. నేను విశాఖపట్నం వెళ్ళింది వాళ్ళ ఇంటికే. అక్కడే మా పరిచయం జరిగింది. బంధువులే అయినా ఒకరకంగా మాది ప్రేమ వివాహం. నాకు ఇద్దరు అబ్బాయిలు.  
రాజేష్ వేమూరి : 1982లో వెళ్ళిపోయిన మీరు మళ్ళీ 1996 లో తిరిగి గ్రామానికి వచ్చారు కదా.  
అవును , రత్న చికెన్ సెంటర్ పేరుతో విశాఖపట్నంలో కొన్ని రోజులు బిజినెస్ చేసినా ఏదీ కలిసి రాలేదు.అంతా నష్టపోయి ఊర్లో వ్యవసాయం చేసుకుందామని కుటుంబంతో సహా వచ్చేశాను. 
రాజేష్ వేమూరి : అసలు ఈ హోటల్ నేపధ్యం ఏమిటి, ఘంటసాలలో రవితేజ పేరుతో హోటల్ పెట్టి హడావుడి చేసారు. కొన్ని రోజులకి మళ్లీ కనపడకుండా వెళ్ళిపోయారు?
నేను గ్రామానికి వచ్చి ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నపుడు మూల్పూరి చెన్నారావు అనే ఆయన నన్ను ఆదుకున్నాడు. ఇద్దరి భాగస్వామ్యంతో హోటల్ పెడదామని అనుకున్నాం. నాకు చేసిన సహాయాన్ని గౌరవిస్తూ వాళ్ళ అబ్బాయి పేరు రవి మా అబ్బాయి పేరులో చివరి రెండు అక్షరాలు తేజ ని కలిపి రవితేజ హోటల్ అని పేరు పెట్టాను.
రాజేష్ వేమూరి : తరువాత చికెన్ సెంటర్, వైన్స్ కూడా పెట్టారు కదా. 
అవును హోటల్ బాగా కలిసి వచ్చింది. నాకు ఏదైనా ప్రచారం చెయ్యటం అంటే బాగా ఆసక్తి, రకరకాల ప్రకటనలతో కస్టమర్లని ఆకట్టుకునే వాడిని.MLA దోశ MP దోశ అని అప్పటిదాకా గ్రామస్తులకి పరిచయం లేని పేర్లని తీసుకొచ్చింది నేనే. హోటల్ బాగా కలిసి రావటంతో అదే పేరుతో చికెన్ సెంటర్ పెట్టాను. తరువాత భాగస్వామిగా రవితేజ వైన్స్.
 
 
రాజేష్ వేమూరి : ఒక్కసారిగా 1998 నాటికి ఎందుకు బిజినెస్ తగ్గిపోయింది
దానికి నా స్వయంకృతమే కారణం. హోటల్ , చికెన్ సెంటర్ తరువాత వైన్స్ బిజినెస్ లోకి రాగానే ఎక్కడలేని ఓవర్ కాన్ఫిడెన్సు వచ్చేసింది. ఇక నేనే కింగ్ అనే గర్వం మొదలైంది. ఆ సమయంలో తాగుడుకి అలవాటు పడ్డాను.వచ్చిన డబ్బంతా తాగుడికి విలాసాలకి ఖర్చు పెట్టేయటంతో వ్యాపారం మీద ఆసక్తి తగ్గింది. 3 సంవత్సరాల్లోనే మళ్ళీ 0 కి వచ్చేశాను. 
రాజేష్ వేమూరి : మరి ఆ తరువాత ?
ఇక ఊర్లో ఉండటం అనవసరం అని మా ఆవిడకి విజయవాడ ఆర్ టి సి లో కండక్టర్ గా జాబు రావటంతో అక్కడికి వెళ్ళిపోయాం. దాదాపు సంవత్సరంపాటు నేను ఏమి పని చెయ్యకుండా తన సంపాదనతోనే ఇల్లు గడిపాం. ఆ సమయంలోనే నాకు తాగుడు వల్ల తీవ్రమైన అస్వస్థత వచ్చింది. విజయవాడ నాగార్జున హాస్పిటల్ లో పెడితే అసలు బతకనని చెప్పారు. అప్పుడు మా ఆవిడ నూజివీడులో చర్చికి తీసికెళ్ళింది. ఆ ప్రార్ధనల వల్ల నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చింది. 1999 డిసెంబర్ 7 న ఇక జీవితంలో మందు తాగనని ప్రమాణం చేశాను. 
రాజేష్ వేమూరి : చర్చికి వెళుతుంటారా ?
తప్పకుండా, మా ఆవిడ ఎప్పటినుండో వెళ్ళేది. నాకు మాత్రం ఆ సంఘటన తరువాత క్రీస్తు పైన నమ్మకం వచ్చింది. నా కార్ వెనక “నేను క్రీస్తు సైనికుడిని” అని రాసుకున్నా. 
రాజేష్ వేమూరి : మళ్ళీ విశాఖపట్నం ఎందుకు వెళ్ళిపోయారు.
మా ఆవిడ అలా ఉద్యోగం చెయ్యటం , నేను ఖాళీగా కూర్చుని ఏమీ చెయ్యలేకపోవటం నాకు సిగ్గుగా అనిపించింది. ఇక చావో రేవో తేల్చుకుందాం అని మా ఆవిడని ఉద్యోగం మాన్పించి పిల్లలతో సహా విశాఖపట్నం లో మా మామగారింటికి వెళ్లి ఆయనకి నమస్కారం పెట్టి కొన్నాళ్ళు నేను వీళ్ళని పోషించలేను, మీరు చూసుకోండి అని చెప్పి ఒంటరిగా ఒక కొండప్రాంతంలో కి వెళ్ళిపోయాను. అక్కడే రోజువారీ ఏదో పని చేసుకుంటూ వచ్చిన నాలుగు డబ్బులతో వంట చేసుకుని తినేవాడిని. 
రాజేష్ వేమూరి : అలా ఎంతకాలం ఉన్నారు ?
దాదాపు సంవత్సరం పైనే. చికెన్ కొట్టి సైకిల్ మీద అమ్మేవాడిని. అలా కష్టపడి 30000 దాచాను. 2001 డిసెంబర్ లో మళ్ళీ చికెన్ షాపు ఒకటి పార్టనర్ గా తీసుకున్నాను. అదీ చాలా కాలం నడవలేదు. 10 రూపాయల మార్జిన్ సేల్ అని బోర్డు పెట్టగానే జనాలు క్యూ లో నిలబడి కొన్నారు. ఆ మార్జిన్ సేల్ అనే స్కీం జనాలకి కొత్తగా అనిపించింది. 
రాజేష్ వేమూరి : అసలు ఈ ప్రచారం స్కిల్స్ ఎలా వచ్చాయి మీకు
నాకు ప్రకటనల రంగంలోకి వెళ్ళాలని చిన్నపటినుండి ఆసక్తి ఉండేది. మా కుటుంబ నేపధ్యం అందుకు సహకరించలేదు.అందుకే తెలుగులో క్యాప్షన్లు రాస్తుంటా, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ కి కూడా అప్పుడప్పుడు ప్రకటనలకి క్యాప్షన్లు రాస్తుంటా. పొలిటికల్ పంచ్ లు, ప్రకటనలకి చాలామంది నాకు కాల్ చేస్తుంటారు, మంచి క్యాచీగా ఉండే పదాలు చెప్పమని. ఘంటసాలలో దివంగతులైన గొర్రెపాటి మధు స్మారకార్ధం దిమ్మ కడుతున్నపుడు అక్కడ కాప్షన్ చెప్పింది కూడా నేనే. ఇప్పటికీ ఆ దిమ్మ మీద ఆ పదాలు ఉన్నాయి.  
 
రాజేష్ వేమూరి : చికెన్ షాపు బిజినెస్ ఎలా నడిచింది?
అలా ఒక అవుట్ లేట్ సక్సెస్ అవగానే మరో 22 షాపులు తెరిచాను. త్వరలోనే షాపులన్నీ సక్సెస్ అయ్యాయి. మళ్ళీ మా ఆవిడని పిల్లల్ని తెచ్చుకుని ఇల్లు తీసుకుని కొత్త జీవితం మొదలుపెట్టా. 
రాజేష్ వేమూరి : అసలు ఈ వంటిల్లు ఆలోచన ఎలా వచ్చింది. 
అలా చికెన్ బిజినెస్ లో ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకేదైనా చేద్దాం అనిపించింది. అలా చికెన్ షాపులన్నీ లీజుకి ఇచ్చేసి , గాజువాకలో రత్న వారి వంటిల్లు పెరుతో స్వీట్స్ అమ్మే షాపు తెరిచాను. మన పాతకాలం వంటిల్లుని తలపించేలా సెట్ వేసి బాగా పెట్టాను. కాని నాకు అందులో మెళకువలు తెలియక చాలా కాలం అది నడవలేదు. నాకు స్వీట్స్ తయారు చెయ్యటం మీద అవగాహన లేకపోవటంతో చాలా కాలం ఇబ్బంది పడి ఇక దాన్ని మూసేసి ఎక్కడైనా ఉద్యోగం చేసి పని నేర్చుకుందామని హైదరాబాదులో మా దూరపు బంధువు శ్రీ జాస్తి బలరామయ్య గారు నడుపుతున్న అభిరుచి స్వీట్స్ కి వెళ్ళాను. అక్కడ శ్రీ జాస్తి బలరామయ్య గారు ఉద్యోగం ఏమి వద్దు అని వాళ్ళ కార్ఖానాలో నెల రోజులపాటు అసలు స్వీట్స్ ఎలా తయారు చెయ్యాలో అనే దానిమీద అవగాహన కల్పించారు.ఇక ఆ అనుభవంతో వెనక్కి వచ్చి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టాను. కుమ్మరి పాలెంలో మరో షాపు ఓపెన్ చేశాను. ఇక అక్కడినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రత్న వారి వంటిల్లు పేరుతో 10 షాపులు, రత్న వారి అత్తవారిల్లు పేరుతో ఒక అవుట్ లేట్ ఉన్నాయి. 
రాజేష్ వేమూరి : అసలు ఈ రత్న వారి వంటిల్లు పేరు ఏమిటి ? 
నేను సూపర్ స్టార్ కృష్ణ ఫాన్ ని,బుర్రిపాలెం బుల్లోడు సినిమా రిలీజ్ , నా ఇంటర్ ఎగ్జామ్ ఒకే రోజు. ఎగ్జామ్ మానేసి సినిమాకి వెళ్ళిపోయా. అంత పిచ్చి కృష్ణ అంటే. నా అభిమాన నటుడి అమ్మ పేరు ఘట్టమనేని నాగరత్నమ్మ. ఆవిడ పేరు మీద రత్న వారి వంటిల్లు అని పెట్టాను. అదే నాకు కలిసొచ్చింది.
 
 
రాజేష్ వేమూరి : ఘంటసాల లో ఉన్నపుడు లైఫ్ స్టైల్ బావుండేది కదా, అలాంటి స్థితినుండి రోజువారీ సంపాదనకి పడిపోవటం ఎలా అనిపించింది?
నేను ఇంతకుముందు కూడా బాగా దెబ్బతిని ఘంటసాలకి వచ్చేశాను. కాని ఘంటసాల తర్వాత జీవితం మాత్రం నాకు నేనుగా వేసుకున్న శిక్ష. ఏదైనా సాధించాకే మళ్ళీ నా భార్యా పిల్లల్ని కలవాలనుకున్నాను. అందుకే నేను ఒంటరిగా ఉన్న ఆ 18 నెలలు అసలు వాళ్ళని చూడలేదు.
రాజేష్ వేమూరి : జీవితంలో ఇన్ని ఎత్తుపల్లాలు చూశారు కదా, ఈ అనుభవాలు ఏమి నేర్పాయి ?
క్రమశిక్షణ లేని జీవితం , ఆర్ధిక క్రమశిక్షణ లేని వ్యాపారం రాణించలేవు. తాగుడు మనిషిని అధపాతాళానికి తొక్కేస్తుంది. వయసులో ఉన్నపుడు మనకి అవేమి తెలియవు.అంతా మనదే కరెక్ట్ అనిపిస్తుంది.జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఆ ఒక్క స్థితిలో క్రమశిక్షణతో ఉంటే ఎవరైనా ముందుకి వెళ్ళగలుగుతారు.
రాజేష్ వేమూరి : మీ జయాపజయాలకి కారణం ?
అన్నిటికీ నేనే, ఎవర్నీ ఎవరూ పాడు చెయ్యలేరు, బాగు చెయ్యనూ లేరు. బలహీనతల్ని అణుచుకోలేక పోవటం వ్యక్తిగా నా వైఫల్యం. ఆ అనుభవంతో కసిగా పని చేసి అనుకున్నది సాధించగలగటం నా విజయం.
రాజేష్ వేమూరి : ఘంటసాల గ్రామం మీరు పుట్టిన ఊరు, అలాగే మీరు దెబ్బ తిన్నది కూడా అక్కడే,ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది గ్రామం అంటే. 
ఘంటసాల నాకు జన్మనిచ్చిన ఊరు, నాకు ఘంటసాల అంటే ఇష్టం కాదు ప్రాణం. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అక్కడే మా పొలంలోనే సమాధి చేశాము. మా నాన్నకి ఇప్పుడు 99 ఏళ్ళు, ఘంటసాల లోనే ఉంటారు. మా వదిన ఆయన్ని కన్నతండ్రి లాగే చూస్తుంది. మా సాయి అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. తనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఎంత ఖర్చుపెట్టి అయినా బతికించుకోవాలనుకున్నా. దురదృష్టవశాత్తు అన్నయ్యని కోల్పోయాను. నన్ను తీవ్రంగా బాధపెట్టిన సంఘటనల్లో సాయి అన్నయ్య మరణం కూడా ఒకటి. ప్రతి నెలా ఘంటసాల వస్తుంటాను. ఊర్లో 2 ఎకరాల పొలం ఉంది. మా అయినపూడి వారి కుటుంబం అంతా అక్కడే ఉంది.
రాజేష్ వేమూరి : జీవితపు చివరి మజిలీ ఘంటసాలలోనేనా 
అలా అని చెప్పలేను నాకు దువ్వాడ లో 500 గజాల స్థలం ఉంది. అక్కడ వృద్దాశ్రమం నిర్మించి ఒక 20 మందిని అందులో నా సొంత ఖర్చులతో చూసుకోవాలని కోరిక. ఆ 20 మందిలో 10 మంది మాత్రం మా ఊరు వాళ్ళకి కేటాయించాను. నేను నా శ్రీమతి చివరి రోజులు అక్కడే గడపాలని అనుకున్నాం. 
రాజేష్ వేమూరి : మరి మీ వ్యాపారాలు 
నాకు ఇప్పుడు 52 ఏళ్ళు, 2018 డిసెంబర్ నాటికి రిటైర్ అవుదాం అనుకుంటున్నా. మా పిల్లల్ని ఇందులోకి తీసుకొద్దామని అనుకున్నా కాని పెద్దవాడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సంవత్సరమే వాడికి పెళ్లి అయింది. కొన్నాళ్ళు ఎంజాయ్ చెయ్యాలని నేనే బలవంతపెట్టలేదు. చిన్నవాడిని పబ్లిక్ సర్వీస్ లో చూడాలని కోరిక. మొన్నే ప్రిలిమ్స్ రాసాడు. 
రాజేష్ వేమూరి : మీకు విశాఖపట్నంలో స్థానికంగా కూడా పరపతి ఎక్కువే కదా? షాపుల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా చేస్తుంటారా? 
నేను ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తాను. 2018 వేడుకలు నిర్వహించి ఇక రిటైర్ అవుదాం అనిపించింది.ఇక్కడ స్థానిక పోలీసులు అందరూ నేనంటే బావుంటారు. వారి అమరవీరుల దినోత్సవాలకి ప్రకటనలు , ఫండ్స్ ఇస్తుంటాను. స్థానికంగా కొంతమందికి తాగుడు మాన్పించటానికి నన్ను కౌన్సిలింగ్ ఇమ్మని తీసుకెళ్తూ ఉంటారు. అలా మా చుట్టుపక్కల బస్తీల్లో చాలామంది చేత తాగుడు మాన్పించాను. నా షాపుల్లో కొన్ని వికలాంగుల చేత,నా దగ్గర పనిచేసే వాళ్ళతోనే ప్రారంభోత్సవం చేయిస్తుంటాను.అలా చెయ్యటం వల్ల వాళ్ళకి కలిగే సంతోషం కంటే నాకు కలిగే మానసిక సంతృప్తి ఎక్కువ. మరికొన్ని మాత్రం స్థానిక రాజకీయ నాయకులు ప్రారంభించారు. ఒక్క షాపు మాత్రం ఘంటసాల నుండి వచ్చి అయినపూడి భాను చేశాడు.
 
Next Part Click Here

This text will be replaced