వందేళ్ల పంచాయితీ -2021Back to list

దేశానికి స్వాతంత్రం రాకముందు ముందు నుండి గ్రామ పరిపాలనా వ్యవస్థ ఉంది.దీనిని మొదట్లో పంచాయితీ బోర్డ్ అని పిలిచేవారు. దానికి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఉండేవారు. 18. 04.1918 న ప్రారంభమైన పంచాయితీ బోర్డుకి తోలి చైర్మన్ వేమూరి వెంకయ్య గారు, వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకయ్య గారు. 1934 వరకు 16 సంవత్సరాల పాటు ఈ ఎన్నిక ఏకగ్రీవమే.అప్పట్లో ఘంటసాల పాలెం కూడా ఒకే పంచాయితీ కింద ఉండేది. 1934 లో ఘంటసాల పాలెం వారికి అవకాశం కల్పించే విషయంలో ఆ గ్రామానికి చెందిన వేమూరి నాగయ్య గారిని చైర్మన్ గా ఎన్నుకున్నారు.ఆ కాలంలో నే ముఠా తగాదాలు జరిగి పాలెం వారు వేరే పంచాయితీ కావాలంటూ కోర్టుకెక్కడంతో ఘంటసాల పాలెం పంచాయితీ వేరు పడింది. ఘంటసాల పంచాయితీ వేరు పడ్డాక తోలి సర్పంచ్ గొర్రెపాటి వెంకట్రామయ్య గారు.1947 లో స్వాతంత్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికలో గెలిచిన వ్యక్తి వేమూరి గోపాల కృష్ణయ్య గారు. తదనంతరం తుమ్మల వెంకట్రామయ్య గారు (వర్లు గారి మామగారు).తరువాత గొర్రెపాటి మహా లక్షమ్మ గారు ,ఈవిడ సర్పంచ్ గా ఉన్న సమయంలోనే దేవరకోట ప్రెసిడెంట్ గా వీరి మేనమామ గారు, ఘంటసాల పాలెం ప్రెసిడెంట్ గా వీరి తమ్ముడైన వేమూరి వెంకట కృష్ణారావు గారు పనిచెయ్యటం విశేషం. ఇక 1959 నుండి 1964 దాకా పనిచేసిన దోనేపూడి సీతారామయ్య గారి కాలం స్వర్ణయుగం అనే చెప్పాలి.పక్కా రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాల ఏర్పాటు ఈయన హయాంలోనే జరిగాయి. గ్రామానికి విద్యుత్తు ,టెలిఫోను, టెలిగ్రాం సౌకర్యాలు వచ్చింది ఈ కాలంలోనే. అందుకే పంచాయితీ భవనానికి దోనేపూడి సీతారామయ్య భవన్ అనే పేరు ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎన్నికైన గొర్రెపాటి బుల్లెయ్య చౌదరి గారు 10 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడ్డాక దీర్ఘ కాలం పని చేసిన రికార్డ్ ఈయనదే. తరువాత ఎన్నికైన బండి లక్ష్మీ నారాయణ గారిది మరో రికార్డు. అతి తక్కువ కాలం పదవిలో ఉన్నది ఈయనే, కేవలం 15 నెలల పాటు మాత్రమె ఆ పదవిలో ఉన్నారు. 1981 లో ఎన్నికైన వేమూరి నాంచారయ్య గారు ఏడు సంవత్సరాలు ఈ పదవిని నిర్వహించారు. ఈయన హయాంలోనే మంచినీళ్ళ టాంక్ కి అంకురార్పణ జరిగింది. బోరు నీళ్ళ కోసం ఊరు దాటి వెళ్ళాల్సిన పరిస్తితులనుండి రక్షిత మంచినీటి పధకం ద్వారా ఇంటింటికి మంచినీళ్ళ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.1918 నుండి 1988 దాకా పనిచేసిన 14 మంది సర్పంచ్ లు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. 1988 లో శ్రీ సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1988 నుండి 1995 వరకు గ్రామానికి సర్పంచ్ గా ఆయన సేవలందించారు. సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారి హయాంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు, మంచినీళ్ళ టాంక్ ప్రారంభోత్సవం, పంచాయితీ వజ్రోత్సవాలు. 1993 నాటికి పంచాయితీ ఏర్పడి 75 సంవత్సరాలు కావటంతో ఆ వేడుకలని వైభవంగా నిర్వహించారు. అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ రాజీవ్ శర్మ ముఖ్య అతిధిగా జలధీశ్వరాలయం ముందు ఆవరణలో ఈ వేడుకలు నిర్వహించారు. అప్పట్లోనే పంచాయితీ సావనీర్ ని ముద్రించారు.అప్పటిదాకా జరిగిన అభివృద్ధి కార్య క్రమాల ఛాయా చిత్రాలతో పాటు గ్రామాభివృద్ది కమిటీ కృషిని కూడా అందులో వివరించారు. గ్రామంలో ఉన్న షాపుల వారంతా ఆ సావనేర్ ముద్రణకి ప్రకటనల రూపంలో విరాళాలు ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ వేడుకలకి సంభందించిన శిలా ఫలకం జలధీశ్వరాలయం ముందున్న మండపంలోనే ఉండేది. ఇటీవల దేవాలయ అభివృద్దిలో భాగంగా మండపంతోపాటు ఆ ఫలకాన్ని కూడా తొలగించారు.1995 నుండి 2001 దాకా నాంచారయ్య గారి కుమారుడు వేమూరి పండుబాబు గారు సర్పంచ్ గా పని చేశారు. తరువాత ఈ స్థానం రిజర్వు కావటంతో వెనుకబడిన వర్గాలనుండి శ్రీ పాల మారమ్మ గారు సర్పంచి గా ఎన్నికయ్యారు.ఈవిడ హయాంలో అంతర్గత రహదారులు , సిమెంటు బెంచీల ఏర్పాటు జరిగింది. 2001 నుండి 2006 వరకు ఈవిడ ఆ పదవిలో ఉన్నారు. ఇక గ్రామంలో అత్యధిక జనాభా కలిగి కూడా అధికారానికి నోచుకోని పద్మ శాలీల వర్గం నుండి 2006 లో శ్రీ అందె జగదీశ్ ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈయన హయాం లోనే కూరగాయల మార్కెట్, నూతన పంచాయితీ భవనం ముందు మహనీయుల విగ్రహాల ఏర్పాటు జరిగాయి. ఇంతకుముందు పంచాయితీ జలదీశ్వరాలయం ముందు ఉన్న మండపం పై అంతస్తులో ఉండేది.ఇప్పుడు ఆలయం వెనుక నూతన భవనం నిర్మించి అందులోకి మార్చారు. 01.08.2013 నుండి 02.08.2018 వరకు శ్రీమతి కౌతరపు నాగరత్నం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే మన మన పంచాయితీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 18-04-2018 నాటికి పంచాయితీ ఏర్పడి 100 ఏళ్ళు పూర్తయ్యాయి. 02. 08. 2018 నుండి 16. 02. 2021 వరకు పంచాయితి స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉంది. రిజర్వేషన్ ప్రాతిపదికన ఈసారి ST సామాజిక వర్గానికి సర్పంచ్ పదవి కేటాయించబడింది. ఇప్పుడు ఎన్నిక కాబోయే సర్పంచ్ మన గ్రామానికి 16 వ సర్పంచ్ అవుతారు. మొత్తం 14 వార్డులున్న పంచాయితీలో మెజారిటీ వార్డు మెంబర్లు ప్రతిపాదించిన వ్యక్తి ఉప సర్పంచ్ అవుతారు.
 
 
Date : 10.02.2021

This text will be replaced