ఘంటసాల గ్రామం తెలుగు నేలమీద ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో తొలినాటిది. అశోకుడు కట్టించిన బౌద్ధస్తూపాలలో ఘంటసాల బౌద్ధస్తూపం కూడా ఒకటి. 1820లో ఘంటసాలలోని ఘోటకదిబ్బలో ఒక రైతు దున్నుతుంటే 60 శిల్పాలు బయట పడ్దాయనీ, పాండిచ్చేరి నుండి ఫ్రెంచి ఏజెంటు వచ్చి 5 వేల రూపాయలిచ్చి వాటిని తరలించుకు పోయాడనీ, అవి పారిస్ లోని గుయ్‘మెట్ మ్యూజియంకు చేరాయని చెప్తారు. బోస్టన్‘లో అతి ముఖ్యమైన ఘంటసాల శిల్పం ఉన్నట్టు డగ్లర్ బారెట్ వ్రాశాడు.
1871లో అప్పటి కృష్ణాకలెక్టర్ బాస్పెల్ బ్రిటిష్ అధికారులకు ఘంటసాలలో అపూర్వ శిల్ప సంపద ఉన్నదని తెలిపాడు. 1906లో పురావస్తు శాఖ సూపరింటెండెంట్ అలెగ్జాందర్ రే లంజదిబ్బను తవ్వించి, అది పూడుకు పోయిన బౌద్ధస్తూపంగా ప్రకటించాడు.
బౌద్ధ యుగంలో ఓడరేవు పట్టణంగానూ, నౌకా వాణిజ్య పట్టణంగానూ ఉన్న ఘంటసాలలో బౌద్ధస్తూపం కూడా ఉండటం ఒక ప్రత్యేకత. ఇప్పుడక్కడ సముద్రం లేదు. నౌకా వాణిజ్య కేంద్రం అవశేషాలు కూడా లేవు.
2010లో భారతీయ పురావస్తు సర్వేక్షణ సూపరెంటెండింగ్ ఇంజనీర్ కీశే. జితేంద్రదాస్ గారి చొరవతో లంజదిబ్బలో దాగిన బౌద్ధ స్తూపం అవశేషాలను పునర్నిర్మించి, పూర్వపు బౌద్ధ స్తూపం ఆకారాన్ని తెచ్చారు. ఇది అమరావతి స్తూపం ఆకారంలోనే అంతకన్నా చిన్నపరిమాణంలో ఉంటుమ్ది. ఘంటసాల పునర్నిర్మిత బౌద్ధ స్తూపాన్ని ఈ ఫొటోలలో మీరు చూడవచ్చు. జితేంద్రదాసుగారు ఈ బౌద్ధ స్తూపం ప్రారంభోత్సవంలో ఆరోజున నన్ను కూడా అతిథిగా ఆహ్వానించారు.
ఘంటసాల హైస్కూలుకు సమీపంలో ఘోటకం దిబ్బ అనే చోట ఇంకో స్తూపం కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ గుబురు మొక్కల మొలిచిఆ స్తూపాన్ని కప్పేశాయి. పాములున్నాయి అందులోకి పోకండి బాబూ...అని వారించారు అక్కడ చుట్టుపక్కల పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళు. ఆ గుబురు మొక్కల మధ్య స్తూపం ఆనవాళ్ళు కనిపించాయి. ఆ ఫోటోను కూడా చూడవచ్చు. డా. ఈమని శివనాగిరెడ్డిగారితో కలిసి వెళ్ళటం వలన ఘంతసాలలో అడుగడుగునా బౌద్ధం ఆనవాళ్ళు వెదికి చూసే అవకాశం కలిగింది. గొర్రెపాటి రామకృష్న గారు ఆ వూరి పెద్ద...మాతో కలిసి తిరిగి అన్నీ దగ్గరుండి చూపించారు.వారికి ధన్యవాదాలు.
డా. జి వి పూర్ణచందు
రచయిత, పరిశోధకుడు, కాలమిష్టు
సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, సత్నాం టవర్స్, బకింగ్‘హాంపేట పోష్టాఫీస్ ఎదురుగా,
తెదీ ః ౧౩.౦౧.౨౦౧౬