ఘంటసాల కు చెందిన తెలుగు పండితులు , జ్యోతిష్య విద్వాన్ చింతలపాటి లక్ష్మి నరసింహ శాస్త్రి గారి ( చింతలపాటి శాస్త్రి గారు ) సోదరుడు చింతలపాటి గోపాలకృష్ణ మూర్తి గారు (1926-1992 ) ఘంటసాలగ్రామంలో 1944 నాటికే ఫోటోస్టుడియో ప్రారంభించారు.ఆనాటి ప్రముఖులను ఎందరినో ఫోటోలో నింపారు.ఆ రోజుల్లోనే ఇంగ్లండు, జర్మనీ దేశాల కెమెరాలను తెప్పించి ఎంతో ఆసక్తితో ఫోటోలు తీసేవారు. డార్క్ రూంలో ద్రావకాలలో ఫోటోలను కడిగి ప్రింట్ వేసేవారు. భిన్న భంగిమలలో ఫోటో చిత్రీకరణలో కృష్ణమూర్తి గారు మద్రాసు పర్యంతం పేరుపొందారు. ఫోటోగ్రఫీతోపాటు చేతిచిత్రాల రచనలో ఆయన సిద్ధహస్తులని పూర్వీకులు చెప్పేవారు. ఆరోజుల్లో ఈ పరిసరాల్లో ఇటువంటి చిత్రకారులు లేరని చెబుతారు. ఫొటోగ్రఫీమీద ఆసక్తితో ఆయన స్వంత ధనాన్ని ఎంతో ఖర్చుచేసి అపరూపమైన చిత్రాలను సృష్టించారు. కానీ తరువాతవారికి వాటిపై శ్రద్ధలేక వాటిని భద్రపరచలేదు. ఆయన్ను కదిలిస్తే ముందుగా ఆయన ప్రస్తావించు అంశం ఎదటివ్యక్తిని ఫొటోగ్రాఫిక్ గా పరిశీలించి సలహాలివ్వటం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఆయన ఆకళించుకునేవారు .తరువాత 1947 లో ఆయన విజయవాడకు మకాంమారారు. అక్కడ వినోదా స్టూడియో స్థాపించారు. ఎందరో ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు గురువుగా వ్యవహరించారు. చనిపోయేవరకు ఆయన ఫొటోగ్రఫీ వృత్తిలోనే జీవించారు. ఆయనలోని కళాత్మకదృష్టి ఆయనను ఆ రోజుల్లోనే ఒకగొప్ప ఫోటోగ్రాఫర్ గా నిలబెట్టింది. అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ల దినోత్సవ సందర్భంగా తొలితరం ఫొటోగ్రాఫర్ గురువుగా చింతలపాటి గోపాలకృష్ణమూర్తిగారిని స్మరించుకోవటంలో ఘంటసాల గడ్డ సాంస్కృతిక వారసత్వం గోచరిస్తుంది.
Dated : 19.08.2020