ముప్పై ఏళ్ల పాటు అమెరికా ఆసుపత్రుల్లో వైద్యం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేసి అలసిపోయిన ఆ చేతులు సొంతూర్లో ఎడ్లు పరిగెత్తుతుంటే చప్పట్లు కొడతాయి. ఊర్లో కి వచ్చినపుడు చిన్ననాటి స్నేహితుడు కనపడగానే ఏరా ఎంకయ్యా ఎవసాయం ఎట్టా ఉందిరా అనే పలకరింపు అప్పటిదాకా అమెరికన్ యాస లో మాట్లాడే ఆంగ్ల భాష నుండి పదహారణాల తెలుగు లోకి మారిపోతుంది. ఆనందం అమెరికాలో ఎక్కడుంది అబ్బాయ్, ఇదిగో ఈ పొలం గట్ల మీద పాడి ఆవుల మధ్యన , ఆప్యాయంగా పలకరించే మట్టి మనుషుల మధ్య ఉంది అంటూ ప్రతి చిన్న విషయం లోనూ ఆనందాన్ని వెతుక్కునే మనిషి డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ గారు. అంతర్జాతీయ తెలుగు సమాజంలో అత్యున్నత సంస్థ తానా కి అధ్యక్షుడుగా పని చేసిన తర్వాత కూడా ఫ్లైట్ లో తన పక్కన కూర్చున్న వ్యక్తికి నా పేరు నవనీత కృష్ణ అండీ మాది ఘంటసాల, మీది ఏ ఊరు అని అడిగి స్వయంగా పరిచయం చేసుకునే నిగర్వి.
పాడుతా తీయగా కార్యక్రమమ్ లో హరిశ్చంద్ర పద్యాలు అద్భుతంగా పాడిన సుగంధిని అనే గాయని ని చూసి, ఊర్లో ఉన్న తన స్నేహితుడికి కాల్ చేసి, రాంబాబూ చక్కగా పద్యాలు పాడింది ఆ పాప వివరాలు కనుక్కో ఈసారి తానా సభలకి తీసుకొచ్చి పాడించాలి అని చెప్పారు. సొంత ఊరు అన్నా గ్రామీణ క్రీడలన్నా అమితమైన ప్రేమ.
నేను మొదటిసారి దుబాయ్ లో నందమూరి బాలకృష్ణ గారిని కలిసినప్పుడు, మాది ఘంటసాల గ్రామం అని చెప్పగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న , నవనీత కృష్ణ గారు ఎలా ఉన్నారు ? రెండవసారి కలిసినప్పుడు కూడా అయన మొదటి ప్రశ్న, నవనీత గారి ఆరోగ్యం ఎలా ఉంది ? ఈ మధ్య రావటం లేదా ఆయన ?
బాలకృష్ణ అమెరికా వెళ్ళినపుడు బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి విరాళాలు సేకరించి ఆ ఆసుపత్రికి అన్ని విధాలా తన సహకారాన్ని అందించారు.డాలస్ లో తెలుగుదేశం పార్టీ స్థాపనకి అక్కడి పార్టీ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలిచారు. రాజకీయాల్లో మంచి వాళ్ళు ఉండాలి అని తపించారు. కోడెల చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డారు , నాకు విషయం తెలిస్తే ఫస్ట్ క్లాస్ లో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి సాంత్వన పొందేవరకు తనతో అట్టిపెట్టుకునే వాడినని వాపోయారు. రాజకీయాల మీద ఆసక్తి తో ప్రజలకి సేవ చేయాలనీ తపించారు. డబ్బిచ్చి పదవులు, టికెట్లు కొనుక్కునే సంస్కృతిలో ఇమడలేక ఆ ఆలోచనని విరమించుకున్నారు.
ఎప్పటికైనా సమాజానికి సేవ చెయ్యాలి మనం మన ఊరికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశం తో 40 ఏళ్ల పాటు అమెరికా లో నివసించినా తన సమకాలీకులంతా అక్కడ దేశ సభ్యత్వాన్ని తీసుకున్నా సరే తాను మాత్రం ఇండియన్ సిటిజెన్ అని చెప్పుకోవటానికే ఇష్టపడ్డారు.
గొర్రెపాటి విద్యా ట్రస్ట్ ద్వారా వారి అన్నయ్య గొర్రెపాటి రంగనాధబాబు చేస్తున్న సామాజిక సేవలో తానూ పాలు పంచుకోవటమే కాకుండా తన వంతుగా కూడా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేశారు. లక్ష్మణుడైనా రాముడి మాట కాదన్నాడేమో కాని అన్నయ్య మాట జవదాటని వ్యక్తి. ఎవరైనా వచ్చి ఏదైనా చెయ్యాలని అడిగితే అన్నయ్య కి ఓ మాట చెప్దాం అనేవారు. మనుమలు మనమరాళ్ళు ఉన్న వయసులో కూడా అన్నయ్యా ఫలానా వారు వచ్చి అడిగారు చేద్దామా అంటూ ఆయనకో మాట చెప్పి కాని ముందుకు వెళ్ళేవారు కాదు.
1975 లో వైద్య విద్య పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు ఇండియాలో ప్రాక్టీస్ చేసి ఇక్కడున్న అరకొర సౌకర్యాలతో మెరుగైన వైద్యం సాధ్యం కాదని గ్రహించి అప్పటికే అమెరికాలో స్థిరపడిన సోదరుల దగ్గరకే వెళ్ళిపోయారు. తాను ఏ సౌకర్యాలు లేవని దేశాన్ని విడిచి వెళ్ళారో అదే సౌకర్యాలని ఇక్కడ కల్పించాలనే తాపత్రయంతో ఆరోగ్యం సహకరించక పోయినా గత ఏడాది మిత్రులతో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి శ్రీకారం చుట్టారు. చివరికి ఆ కల నెరవేరకుండానే అక్టోబర్ 24 న అమెరికాలో కన్నుమూశారు.
కొంతమంది సార్ధక నామధేయులు ఉంటారు. మరికొందరు తమ పేరుకే సార్ధకత చేకూరుస్తారు. నవనీత కృష్ణ అని తల్లిదండ్రులు ఆలోచించి పెట్టారో లేదో తెలియదు కానీ నిజంగా వెన్నలాంటి మనసున్న మనిషి డాక్టర్ నవనీత కృష్ణ గారు.