చరిత్ర పరిరక్షణలో ఐదేళ్ళుBack to list

 
  చరిత్ర పరిరక్షణలో ఐదేళ్ళు

 నేటికి వెబ్ సైట్ ప్రారంభించి ఐదేళ్ళు గడిచాయి. ఐదేళ్ళ క్రితం నా తోటి మిత్రులంతా వారి వితరణని పెట్టుబడిగా పెడితే నేను నా సమయాన్ని, ఆలోచనల్ని పెట్టుబడిగా పెట్టి ఈ వెబ్ సైట్ ని ప్రారంభించాం.ఈ పెట్టుబడికి ప్రతిఫలం ఉండదని మాకు తెలుసు. శ్రీ గొర్రెపాటి రవి సుధాకర్ నాకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వటంతో పాటు వెబ్ సైట్ నిర్మాణంలో వెన్ను దన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆర్ధికంగా పెట్టుబడి అందరి దగ్గరా ఉంది, కాని నా దగ్గర సమయం అనే పెట్టుబడి లేదు. ఈ ఐదేళ్ళలో నా కెరీర్ లో, వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ వెబ్ సైట్ అనుకున్నపుడు నాకు 26 సంవత్సరాలు. పెద్దగా భాధ్యతలు , సంసారం లేని బ్రహ్మ చారిని. ఈ వయసులో మనిషికి అవసరమైన ఆర్ధిక వికాసం గురించి ఆలోచించకుండా వీడికి ఈ ఊరికి ఉపకారి బిరుదులేమిటి అని నా శ్రేయోభిలాషులంతా ఆందోళన పడ్డారు. దేవుడు దగ్గరకి వెళ్లి ఒక్కసారి దణ్ణం పెట్టుకున్న వాళ్ళంతా ఆ దేవుడి నుండి ప్రతిఫలం పొందుతున్నారు. కాని అలాంటి కొన్ని వేలమంది తరపున రోజూ దేవుడికి పూజ చేసే పూజారి మాత్రం అక్కడే ఉండిపోతాడు, నువ్వు ఆ పూజారివి మాత్రం కావద్దు అని వేమూరి విశ్వేశ్వరరావు గారు చెప్పిన మాట నా మనసుకు హత్తుకుపోయింది. అందుకే సామాజిక భాద్యతతో పాటు నా వ్యక్తిగత భాధ్యతని , లక్ష్యాన్ని మరిచిపోలేదు. 3 సంవత్సరాలుగా నేను మన దేశంలోనే లేను. ఎప్పుడూ ఉద్యోగ నిమిత్తం పలు దేశాలకి తిరగటమే సరిపోతోంది. అయినా నాకున్న సమయంలోనే వెబ్ సైట్ తో పాటు దానికి సమాంతరంగా ఫేస్బుక్ పేజీని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. 2010 నుండి 2012 దాకా ఫేస్బుక్ పేజీ పెద్దగా పాపులర్ కాలేదు. ఆ సమయంలో వార్తలన్నీ వెబ్ సైట్ ద్వారానే అందరికీ చేరేవి. 2012 నుండి ఫేస్బుక్ పేజి బాగా పాపులర్ అవ్వటం మొదలైంది. వెబ్సైట్ తో పోలిస్తే ఫేస్ బుక్ పేజీని నిర్వహించటం చాలా సులువు. అంతే కాదు ఫేస్ బుక్ లో ఖాతా ఉన్నవాళ్ళంతా ఆ వార్తని వెంటనే చూడగలరు కూడా. ఈ సంవత్సరం శ్రీ గొర్రెపాటి సురేష్ మరియు సోదరుడు ప్రదీప్ తుమ్మల ఫేస్బుక్ పేజీ నిర్వహణలో భాగ స్వాములయ్యారు. ప్రతి రోజు వార్తా పత్రికల క్లిప్పింగ్స్ ని పోస్ట్ చేసేది ప్రదీప్ తుమ్మల. గ్రామంలో జరిగే కార్యక్రమాల విశేషాలని ఎప్పటికప్పుడు సురేష్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాకు శ్రీను స్టూడియో నుండే అన్ని ఫోటోలు వస్తున్నాయి. గ్రామంలో ఏదన్నా కార్యక్రమం ఉన్నా శ్రీనునే నాకు అన్ని ఫోటోలు పంపుతున్నాడు. కొంతమంది ఔత్సాహికులు వాట్స్ అప్ ద్వారా కూడా ఫోటోలు పంపుతున్నారు. సమయం ఉన్నపుడు అవన్నీ వెబ్ సైట్ లో పెడుతున్నాను. 700 మందికి ఫేస్ బుక్  పేజీ ద్వారా తక్షణమే సమాచారం అందుతోంది. ఫేస్ బుక్ అకౌంట్ ఉన్నవారు ఈ పేజీని లైక్ చెయ్యండి.  www.facebook.com/GhantasalaVillage


వార్తలు, ఫోటోలు ఎప్పటికప్పుడు పేజీలో అప్లోడ్ అయిపోతున్నాయి. వాట్స్ అప్ , ఫేస్బుక్ లు మన వారికి పరిచయం లేని కాలంలో ఈ వెబ్ సైట్ ఆలోచన రూపు దాల్చింది. 2010 నాటికి ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు ఇంకా పల్లెల్ని చేరలేదు. అప్పట్లో ఒక్కో ఫోటో కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. వెబ్సైట్ పెట్టిన కొత్తలో మిత్రుడు కిరణ్ ఫోటోలని తీసినా వాటిని పంపించటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది. ఈ ఐదేళ్ళలో సామాజిక మాధ్యమాల్లో చాలా మార్పులు వచ్చాయి. స్మార్ట్ మొబైల్ విప్లవం ఈ ఐదేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది.  ఇప్పుడు గ్రామంలో చాలామందికి ఫేస్బుక్ ఉంది. వార్తలని వెబ్ సైట్ లో పెట్టేలోపుగానే వారి వారి ఫేస్బుక్ గోడలపై ప్రత్యక్షమవుతున్నాయి. మధ్యలో మొబైల్ ఆప్ కోసం కూడా ప్రయత్నించాం. కాని దానికి తగ్గ నిధులు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ప్రతి వారం స్వాతి పత్రికలో జలదీశ్వరాలయం గురించి రాసినపుడల్లా ఈ వెబ్ సైట్ గురించి రాయటంతో ఈ సంవత్సరం వీక్షకుల తాకిడి పెరిగింది. ఇంతకుముందు దాకా కేవలం మన గ్రామస్తులే వెబ్ సైట్ ని చూసే వారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల వారూ తరచుగా వెబ్ సైట్ ని చూస్తున్నారు. గూగుల్ లో ఎక్కువమంది జలదీశ్వరాలయం కోసమే వెతికారు. వాటిల్లో కొన్ని పదాలు ఇవి. 
way to jaladheeswara temple near vijayawada
story of ghantasala village, jaladheeswara swamy temple.
jaladheeswara swamy ghantasala
ghantasala jaladheeswara temple
 
జలధీశ్వరాలయం రోజూ వచ్చే భక్తులతో కిట కిట లాడుతోంది. దూర ప్రాంతాల నుండి మోపిదేవికి వచ్చే భక్తుల్లో 90 శాతం మంది మన గ్రామాన్ని కూడా సందర్శిస్తున్నారు. త్వరలోనే మన ఊరు కూడా కాణిపాకం స్థాయి పుణ్యక్షేత్రం కాగలదని నా గట్టి నమ్మకం.



ఐదేళ్ళ క్రితం వెబ్ సైట్ ప్రారంభోత్సవానికి పెట్టిన హోర్డింగ్ 
 
 ఇక ఈ సంవత్సరం ఎక్కువమంది చదివిన ఆర్టికల్ బడ్డీ నాగయ్య. ఆ ఆర్టికల్ ని కొత్తపల్లి గ్రామంలో ఉన్న మా బంధువు నాగయ్య కి చూపించారట. అది చదివి ఎంతో సంబరపడిపోయిన నాగయ్య , నేను ఎప్పుడు ఇండియా వస్తానా అని ఎదురు చూస్తున్నాడని ఆ ఆర్టికల్ చూపించిన వ్యక్తి చెప్పాడు. కాని దురదృష్టవశాత్తు నేను ఇండియా వెళ్ళే లోపే నాగయ్య చనిపోయాడు. ఆ ఆర్టికల్ రాయటానికి ముందు కాని రాసిన తర్వాత కాని నేను నాగయ్యని కలవలేదు, మాట్లాడలేదు. జూన్ లో నేను ఇండియా వెళ్ళినపుడు కొడాలి నుండి ఘంటసాల వెళ్ళే దారిలో కొత్తపల్లి మలుపులో ఉండాల్సిన నాగయ్య బడ్డీ లేదు. ఖాళీగా కనిపించిన ఆ స్థలం నా మనసులోనూ ఏదో వెలితిని నింపింది. ఈ సంవత్సరం నేను మరిచిపోలేని సంఘటనల్లో ఇది ముఖ్యమైనది.
 
ఈ సంవత్సరం వార్తల్లో ఎక్కువమంది చదివింది బుద్ధ ప్రతిమ లభ్యం. ఎప్పటిలాగే వెబ్ సైట్ ని సందర్శించిన వారిలో ఇండియా తరువాత స్థానం అమెరికాదే. తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా , లండన్ ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం వీక్షకుల సంఖ్య 5553. 67 శాతం మంది కొత్త వీక్షకులే ఉండటం చెప్పుకోదగ్గ అంశం. 
 
 ఈ మాధ్యమం మరింత మందికి చేరువ కావాలని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 

Dated - 14.01.2015

 

This text will be replaced