​బడ్డీ నాగయ్య ​Back to list

​బడ్డీ నాగయ్య ​

మన గ్రామం తర్వాత నాకు అదే స్థాయి అనుబంధం ఉన్న గ్రామం, పొరుగున ఉన్న  కొత్తపల్లి. మా అమ్మగారిది అదే ఊరు కావటం, చిన్నపటినుండి ప్రతి ఆదివారం సెలవు వస్తే అమ్మమ్మ వాళ్ళింటికి పరిగెత్తటం ఆ ఊరుతో నా అనుభందాన్ని మరింత బలపడేట్టు చేసింది. చిన్నపుడు ఎన్నో ఆదివారాల ఆటవిడుపులు, కోతి కొమ్మచ్చి, శివాలయంలో ఆడుకున్న పొగడ చెట్టు నీడ, కింద పడితే ఏరుకున్న పొగడపూలు,1990 లో తుఫానుకి ఆ చెట్టు పడిపోతే ఆ వంగిన కొమ్మ మీద ఊగిన ఉయ్యాల. పూజారి జగం గారి మంచి నీళ్ళ పంపు, గరువు పొలంలో మామయ్య కోసిపెడితే తిన్న ముంజి కాయలు, అవి తిన్నాక కడుపు నెప్పి వస్తే అమ్మమ్మ నెయ్యి వేసి తినిపించిన కొత్తావకాయ అన్నం, గేదలతోపాటు చెరువులో దిగి ఆడిన స్నానాలు, మూల పొలం కోసం ఈదిన కోడు, నీళ్ళు ఎక్కువగా ఉన్నపుడు కోడు దాటించిన డ్రాపు, మామిడి కాయల్లో నంజుకున్న ఉప్పు కారం, మరమరాల్ అంటూ మధ్యాహ్నం మూడింటికి కేక వినపడగానే పావలా ఇచ్చి కొనుక్కున్న మరమరాల ఉండలు, పాల ఐస్, చీమ చింతకాయలు, శ్రావణ మాసం వీరలంకమ్మ సంబరానికి ఊరంతా తిరగటం, వళ్ళంతా పసుపు రాసుకుంటే అమ్మమ్మ రుద్ది రుద్ది చేయించిన స్నానం, అవిసి పుల్లలతో కట్టుకున్న పొదరిల్లు, చింత పిక్కలతో ఆడిన అచ్చంగాయలు ఈ గ్రామం నాకందించిన అపురూప బాల్య స్మృతులు. పైన చెప్పినవేవీ నేను మన గ్రామంలో చెయ్యలేదు. పల్లెటూరు లో పెరిగిన చాలా మందికి ఉండే ఈ బాల్య స్మృతులన్నీ నాకు కొత్తపల్లి తోనే పెనవేసుకుని ఉన్నాయి. ఒక్క స్కూల్ చదువుని మినహాయిస్తే నా మిగతా బాల్యం అంతా కొత్తపల్లిలోనే గడిచింది.  ఎప్పుడూ పెద్దగా వార్తల్లో, వివాదాల్లో కనిపించని, వినిపించని ప్రశాంతమైన గ్రామం కొత్తపల్లి. అక్కడి మనుషుల భోళాతనం, కల్మషం లేని ఆ పలకరింపులు, ఆ ఊరి ఆడపడుచులకి ఆ గ్రామస్తులు ఇచ్చే ప్రేమ ఆప్యాయత నిజంగా మాటల్లో వర్ణించలేనిది.
 
దాదాపు ఆ గ్రామంలో అందరూ నాకు మామయ్య వరసే. ప్రతి వారం నేను అక్కడికి వెళ్ళినా సరే ఏరా అల్లుడూ ఎప్పుడొచ్చావ్ అనే పలకరింపులు సర్వ సాధారణం. మన ఊరు ఆడబిడ్డ కొడుకు అని వాళ్ళు చూపించే ఆప్యాయత, అమ్మ చెయ్యి పట్టుకుని బస్సు ఎక్కటానికి రోడ్డు మీదకి వచ్చేలోపు గడప గడపకి ఆపి అమ్మాజీ వెళ్లి పోతున్నావా అంటూ మా అమ్మకి వినిపించే పలకరింపులు, ఎన్నేళ్ళు గడిచినా నా మనోఫలకం నుండి చెదరని జ్ఞాపకాలు. మన గ్రామానికి కొత్తపల్లికి వివాహ సంభందాలు ఎక్కువే. ఎక్కువ శాతం మంది అక్కడ ఆడపిల్లలనే మన వాళ్ళు చేసుకున్నారు. మన ఊరి అమ్మాయిలని కొత్తపల్లి ఇవ్వటం తక్కువే. ఆ గ్రామంలో నా చిన్నప్పటి మిత్రులంతా, కొందరు గ్రామంలో, మరికొందరు వేరే చోట స్థిరపడినా, పెద్దగా టచ్ లో లేకపోయినా ఎదురుపడినప్పుడు మాత్రం ఆ దూరం కనిపించదు, అదే ప్రేమ అదే ఆప్యాయతతో కూడిన పరామర్శ. గ్రామ పొలిమేరలో ఉండే తుమ్మల గోపాలకృష్ణయ్య భవనం ఈ గ్రామంలో కెల్లా పెద్ద భవంతి. ఇప్పటికీ అది మునసబు గారి బిల్డింగ్ అనే పిలుస్తారు. ఆయన మరణించి ఇన్నేళ్ళు గడిచినా ఆయన పుట్టిన రోజునే ఆ స్కూల్ వార్షికోత్సవంగా జరపటం ఆ గ్రామస్తులకి ఆయన మీద ఉన్న గౌరవాన్ని తెలియచేస్తుంది. ఈ ఊరులో నేను మర్చిపోలేనివి రెండు ఉన్నాయి. ఒకటి భుజంగం బడ్డీ, రెండు నాగయ్య బడ్డీ. కొడాలి వైపు వెళ్ళాలంటే బస్సు కోసం భుజంగరావు బడ్డీ దగ్గర నిలబడాలి, ఘంటసాల వెళ్ళాలంటే నాగయ్య బడ్డీ దగ్గర నిలబడాలి. ఇప్పట్లాగా ఇన్ని ఆటోలు ఉండేవి కాదు. ఆర్ టి సి బస్సు ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళటమే. లేదా పాల వాను వచ్చే టైముకి నిలబడాలి. నాకు ఊహ తెలిసేటప్పటికే నాగయ్య కి హోటల్ ఉండేది. ఊర్లో వాళ్ళంతా పొద్దునే టీ తాగటానికి అక్కడే చేరే వాళ్ళు. బస్సు కోసం నిలబడే వాళ్ళంతా ఆ హోటల్ ముందో లేక లోపలో కూర్చునేవాళ్ళు. నాగయ్య ఇల్లు మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక పూరి పాకలో ఉండేది. మంచికైనా, చెడుకైనా పిలిస్తే వచ్చేసేవాడు. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ తలలో నాలుకలా ఉండేవాడు, నాకు తెలిసాకే నాగయ్య ఇల్లు పూరి పాక నుండి చిన్న సైజు డాబాకి మారింది. అగ్ర వర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నా, నాగయ్య అందరి మనిషిగానే ఉండేవాడు. అందరూ నాగయ్యని తమవాడిగానే భావించేవారు. ఎక్కడా వివాదాల్లో తల దూర్చేవాడు కాదు. అలా అని తన పనేదో తానూ చేసుకుపోయే రకమూ కాదు. ఊర్లో జరిగే విషయాల నుండి దేశ రాజకీయాల పైన చర్చల వరకు నాగయ్య బడ్డీ నే అందరికీ అడ్డా. నేను హైదరాబాద్ వచ్చేసాక కొత్తపల్లి వెళ్ళటం తగ్గింది. బస్సులో కాకుండా మోటార్ బైక్ మీద కొత్తపల్లి వెళ్ళటంతో నాగయ్యని చూడటమూ తగ్గింది. దాదాపు 10 ఏళ్ల తరువాత 2010 లో అనుకుంటా, కొత్తపల్లిలో ఉండే మా బంధువుల అమ్మాయి పెళ్ళి హైదరాబాదులో జరుగుతుంటే వెళ్ళాను. నాకు ఖచ్చితంగా నాగయ్య ఆ పెళ్ళికి వస్తాడని తెలుసు. ఎందుకంటే ఆ కుటుంబానికి నాగయ్యకి ఉన్న అనుభంధం అలాంటిది. నేను ఫంక్షన్ హాలులో అడుగు పెట్టగానే ఎదురైన మా బంధువుని అడిగిన మొదటి ప్రశ్న, నాగయ్య ఎక్కడున్నాడు అని. నన్ను తీసికెళ్ళి మరీ నాగయ్యకి చూపించాడు ఆయన. కాని నాగయ్య నన్ను గుర్తుపట్టలేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం నా రూపానికి, ఇప్పటికీ పోలిక లేకపోవటం, చాలా సంవత్సరాల తర్వాత చూడటంతో నన్ను నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.కాని నాగయ్య అలాగే ఉన్నాడు, హోటల్ లో ఎప్పుడూ లుంగీ తో కనిపించే నాగయ్యని  తెల్లటి షర్ట్ , పాంట్ తో చూశాక అతని జీవన విధానంలో వచ్చిన మార్పు కూడా కనిపించింది. కాని అతని వ్యక్తిత్వం మారలేదు,పలకరింపులో స్వచ్ఛత తగ్గలేదు. ఎదుటి వాళ్ళు ఎంత చొరవ ఇచ్చినా తన హద్దుల్ని ఎప్పుడూ నాగయ్య దాటలేదు. కొన్నాళ్లకి ఫేస్ బుక్ లో నాకొక రిక్వెస్ట్ వచ్చింది. దేవనబోయిన నరేంద్ర పేరుతో వచ్చిన ఆ రిక్వెస్ట్ ని అక్సేప్ట్ చేసేముందు నువ్వెవరని అడిగాను. నేను నాగయ్య గారి అబ్బాయిని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటికే  తను బి ఫార్మసీ పూర్తి చేసి లెక్చరర్ గా కొన్నాళ్ళు చేశాక ఇప్పుడు ప్రిన్సిపాల్ గా చేస్తున్నాను అని చెప్పాడు. నాకు అప్పటిదాకా నాగయ్య పిల్లల గురించి తెలియదు. ఈ విషయం విన్నాక చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. పట్టుమని 1000 మంది కూడా లేని ఓ కుగ్రామంలో చిన్న హోటల్ నడిపే ఓ వ్యక్తి తన పిల్లల భవిష్యత్తుని ఇంత అందంగా తీర్చిదిద్దాడు అంటే ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవమ్ పదింతలు అయ్యింది. వ్యక్తిగతమైన, కేవలం కులం ప్రాతిపదికగా గల వృత్తుల నుంచి ఉద్యోగ వ్యవస్థవేపు క్రమంగా పరిణామం చెందుతున్న సమాజాన్ని నాగయ్య బాగా గమనించాడు. ఎదుగూ బొదుగూ లేని గ్రామీణ జీవనం, చేతికీ నోటికీ దారి వెదుక్కుంటూ జీవించే గంగిరెద్దు జీవితం నుంచి బయటకి చూశాడు. చదువురాని ఈ ఇంటిపెద్ద కేవలం మంచి జీవితం వేపు మోర సారించిన తరుణమది.  ఆతృతగా, ఆశగా లక్ష్యం వేపే దృష్టి . వాళ్ల పిల్లలు ఏం కావాలో వాళ్ల మనస్సుల్లో లక్ష్యాలున్నాయి. మంచి ఉద్యోగం, మంచి ఆదాయాన్నిచ్చే, తమ కుటుంబ సరళిని మార్చేసే విముక్తి. దానికి ఒకటేదారి,  చదువు , మంచి ఉద్యోగం. ఈ దశగానే ఇప్పుడిప్పుడు కుటుంబాలన్నీ ప్రయాణం చేస్తున్నాయి. మంచి జీవితానికి మార్గం మంచి ఉద్యోగం. మంచి ఉద్యోగానికి పెట్టుబడి -మంచి చదువు. మంచి చదువంటే? భుక్తి నిచ్చేదే కాదు. తమ తరువాతి తరాలకి కూడా మార్గాన్ని ఏర్పరిచేది . ఊర్లో ఉన్న నాలుగెకరాలు వ్యవసాయం చేసుకుంటే చాల్లే , మనకెందుకు చదువులు అంటూ విన్పించిన ముతక మాటలని నాగయ్య ఎన్నడూ లెక్క చెయ్యలేదు. కనీసం ఆ దిశగా తన పిల్లల్ని ఆలోచించనివ్వలేదు. తన హోటల్ కి వచ్చేవాళ్ళ భిన్నదృక్పధాల ఆలోచనల్నుండే తన కొడుకు లక్ష్యానికి మార్గం వేశాడు. ఫలితం,  ఈ మధ్య నరేంద్ర ఆంధ్రా యునివర్సిటీ నుండి అందుకున్న డాక్టరేట్. తాను డాక్టరేట్ తీసుకుంటూ, ఆ కార్యక్రమానికి హాజరైన తన తండ్రితో దిగిన ఒక ఫోటో నన్ను ఈ వ్యాసం రాయటానికి ప్రేరణ నిచ్చింది.
 
ఒక తండ్రిగా నాగయ్య ఎలాంటి అనుభూతికి లోనయ్యాడో తలుచుకుంటే, నేనెరిగిన మనిషిగా నాకూ సంతోషం వేసింది. కొడుకు తెచ్చిన గౌరవంతో నిన్నటి వరకు నాగయ్య గా పిలవబడ్డ వ్యక్తి చదువుకున్న సమాజంలో ఇవాళ నాగేశ్వరరావుగా గుర్తించబడ్డాడు. నాగయ్య ఆలోచనలు ఆ హోటల్ వరకే ఆగిపోయి ఉంటే ఇవాల్టి డాక్టర్ నరేంద్ర నిన్నటికి నారయ్య గా అదే ఊర్లో ఉండిపోయేవాడేమో. 
 
 
మన చుట్టూ ఉన్న సమాజంలో నాగయ్య లాంటి తండ్రులు, నరేంద్ర లాంటి కొడుకులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి గర్విద్దాం. మనమెరిగిన వాళ్ళుగా మరింతమందికి స్ఫూర్తి ఇచ్చే దిశగా గ్రామీణ వర్గాలన్నీ ప్రయాణించాలని కోరుకుందాం. అసలు ఈ కధనానికి బడ్డీ నాగయ్య అనే పేరు పెట్టటానికి కూడా చాలా ఆలోచించాను. కాని మనందరికీ పరిచయం అయిన నాగయ్య తనని అలా పిలవటంలోనే ఆనందం ఉందంటాడు. 
 
 
dated : 16.02.2014
 

This text will be replaced