ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే - 2Back to list

 

 తుమ్మల వేణుగోపాలరావు గారు

( గతవారం తరువాయి )

1982 లో నేను నైట్ కాలేజి ఇంజనీరింగ్ ఎంట్రన్సు రాసి ఆంధ్రా యూనివర్సిటిలో సీట్ వచ్చినపుడు ఆయన ప్రిన్సిపాల్ గా ఉన్నారు. మొత్తం క్లాసు లో 40 మంది ఉంటే మొదటి సంవత్సరం Engineering Mechanics అనే సబ్జెక్టు లో 32 మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళలో నేనూ ఒకడిని.ఒక రోజు వేణుగోపాల రావు గారి దగ్గరకి వెళ్లి ఇలా ఫెయిల్ అయ్యాము అని చెప్పాను. అప్పుడు అయన ఆ సబ్జెక్టు నాకు టీచ్ చేస్తాను అన్నారు. ఇదే విషయాన్ని మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు కూడా చెప్పమని అడగమనటం తో మళ్లీ వారిని కలిసి అదే విషయం చెప్పాను.అప్పుడాయన నరసింహారావు గారు అనే మరో లెక్చరర్ తో మాట్లాడి అందరికి ట్యూషన్ పెట్టించారు. మళ్లీ తర్వాత ఎగ్జాం కి నాతో పాటు 28 మంది పాస్ అయ్యారు.

అయన complaint box విధానాన్ని ప్రవేశపెట్టారని ఇదివరకే చెప్పుకున్నాం కదా.అప్పుడు ఒక విద్యార్ధి ఒక కంప్లైంట్ ని ఇలా రాసాడు.మీరు పెద్ద కబుర్లు చెప్తారు కదా ,ఈ సంవత్సరం సంక్రాంతి 15 వ తారీఖున వచ్చింది కాలేజికేమో 14 వ తారీఖు సెలవు ఇచ్చారు దీనిని మీరు మార్చగలరా అని. దానికి అయన ఇలా సమాధానం రాసారు. నోటీసులు ఏమీ శిలా శాసనాలు కావు. వాటిని మనం ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు అని 15 వ తేది ని సెలవు గా ప్రకటించారు.

మా ఇంజినీరింగ్ అయ్యాక Farewell కి ఆయన్నిఅతిధి గా  పిలిచి ఉపన్యసించ వలసినది గా కోరాము.ఆరోజు అయన చెప్పిన మాటలు మా అందరికి జీవితం లో ఎంతో ఉపయోగపడ్డాయి. డబ్బు ఖర్చు పెట్టే విషయం లో అయన చెప్పిన ఒక సలహా , ఏదైనా వస్తువు లేకపోతే మనకి జరగదు అనుకుంటేనే ఆ వస్తువు ని కొనాలి.రేపు ధర పెరుగుతుందనో లేక మన దగ్గర డబ్బు ఉందనో అవసరం లేకపోయినా ఆ వస్తువు ని కొనటం సరి కాదు. నేనూ ఇప్పటికీ అదే సూత్రాన్ని పాటిస్తున్నా. 2008 లో నేనూ నా సతీమణి ఇండియా వచ్చినపుడు ఆయన్ని చూడటానికి వెళ్ళాం. అప్పటికే ఆల్జీమర్స్ వల్ల ఆయనకి జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. అయినా సరే వాళ్ళ అమ్మాయి పద్మిని చెప్పగానే నన్ను గుర్తు పట్టారు.
 
నాలాంటి ఎంతో మందికి మార్గదర్శి గా నిలిచిన శ్రీ తుమ్మల వేణుగోపాలరావు గారి ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తూ..వారి సతీమణి కృష్ణక్క కి వారి కుమార్తెలు పద్మిని,నళిని లకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నాను. నా తుది శ్వాస వరకు ఆయనతో గడిపిన క్షణాలు,అయన అందించిన ప్రోత్సాహం,
ఆ జ్ఞాపకాలు, ఎప్పటికీ పదిలమే.....
 
(సమాప్తం)
 
రచయిత గురించి : ఘంటసాల పాలెం గ్రామస్తులైన శ్రీ కొల్లూరి వెంకట కృష్ణారావు గారు గారు గతం లో విశాఖపట్నం BHPV సంస్థ లో మెకానికల్ ఇంజినీర్ గా పని చేశారు.ప్రస్తుతం అమెరికా లో లూసియానా రాష్ట్రం లో Quality Manager గా పని చేస్తున్నారు.