ఘంటసాల బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామం, ఇది మనం చాలా కాలంగా వింటున్న మాట. కాని గ్రామం అభివృద్ధి చెందుతున్న మాటలో నిజం ఎంతో గాని, ఖచ్చితంగా మన గ్రామం చాలా విషయాలలో మాత్రం అభివృద్ధి బాగా చెందుతోంది. ఈ విషయాలు నేను నా కంటి తో చూసినవి, విన్నవి.
1. సంక్రాంతికి నేను మన గ్రామం వెళ్ళాను, కనుమ రోజు చికెన్ కొందామని మన గ్రామం లోని సత్రం సెంటర్ కి వెళ్ళాను, అప్పుడు టైం ఉదయం 7:30. మన గ్రామం లో హైస్కూల్ లో నాతొ చదివిన ఒక ఫ్రెండ్ కలిసి కాసేపు మాట్లాడిన తరువాత ఒక 50 rs ఇవ్వమన్నాడు. నేను ఇవ్వడానికి రెడీ అవుతుండగా మన గ్రామం కి చెందిన ఒక పెద్దాయన వొద్దు అని వారించాడు. నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, అప్పుడు కారణం ఏంటి అని ఆ పెద్దాయనని అడిగా. అయన ఈ టైములో ఇక్కడకి ఎందుకు వచ్చావ్, ఈ టైం లో మన గ్రామానికి చెందినా చాలా మంది కుర్రాళ్ళు మందుకు అలవాటు పడి త్రాగడానికి డబ్బు లేక ఇలా కనపడిన వాళ్ళని అడుగుతూ ఇలా వెంట పడుతున్నారు. వారిలో చాలామంది మనతో పాటు మన గ్రామం లో హై స్కూల్ లో చదివిన వారే. ఆ క్షణం నాకు అనిపించింది ఘంటసాల బాగా అభివృద్ధి చెందింది అని!!!
2. మన గ్రామ పెద్ద గొట్టిపాటి బ్రహ్మయ్య గారి చలువ మన గ్రామంలో హైస్కూల్. ఎందరో గొప్పవాళ్ళు చదివిన స్కూల్. కొత్తగా ఆ స్కూల్ కి కాంపౌండ్ వాల్ కట్టారు, కడుతున్న కాంట్రాక్టర్ నాకు తెలిసిన వాళ్ళు కావటం వాళ్ళ మా నాన్న గారిని ఒకసారి రమ్మన్నారు. నాన్న నేను కలిసి వెళ్ళాం, నాన్న ఎంట్రన్స్ గేటు దగ్గరే ఆగి, నేను లోపలి రాను నువ్వు వెళ్ళు అన్నారు. కారణం ఏంటి అంటే నేను ఉండగా ఈ స్కూల్ ని మల్లెపువ్వు లాగా చూసుకున్నా , ఇప్పుడు ఉన్న స్టేజి లో నేను చూడలేను అన్నారు. నేను చూడటానికి లోనికి వెళ్ళాను. నేను, మీరు ఎవరూ నమ్మలేని నిజం. మన గ్రామం లోని హైస్కూల్ లో ఒక ధాన్యం బస్తా కి సరిపడిన మందు బాటిల్స్ ఉన్నాయ్. ఇదే హైస్కూల్ లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గోపాల క్రిష్నయ్య గారు ఈ మద్య హైస్కూల్ కి వచ్చి చూసి కంట నీరు పెట్టారు అట!! ఆ క్షణం నాకు అనిపించింది ఘంటసాల బాగా అభివృద్ధి చెందింది అని!!!
3. విశ్వ విఖ్యాత నటసార్వబౌమ ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ మనగ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు అదే విగ్రహం దగ్గరలో ఒక బెల్ట్ షాప్ ఉంది, మన గ్రామానికి చెందిన కుర్రాళ్ళు ఆ బెల్ట్ షాప్ లో మందు తాగి ఎన్టీఆర్ విగ్రహం కింద కుర్చుని దారిన వెళ్తున్న పెద్దమనుషులని అనరాని మాటలు అంటుంటే ఆ పెద్దమనుషులు తలలు వంచుకుని వెళ్లి నన్ను వాడు ఇలా అన్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కంట నీరు పెట్టుకుంటున్నారు. ఇది కూడా మన గ్రామం అభివృద్ధి లో భాగమే అందామా?
ఇది నేను ఒకరిని విమర్శించడానికి రాయడం లేదు, ఇది జరుగుతున్న సత్యం, దీనికి ఎవరు కారణం అని అందరు ఆలోచించాలి. గ్రామంలో అందరు కష్టపడి అభివృద్ధి చేస్తున్న జలదీశ్వరాలయం ఉన్న మన గ్రామం లో అభివృద్ధి ముసుగులో పెడదారి పడుతున్న నాగరిక సమాజం ని మార్చడానికి ఇంకే దేవుడు దిగి రావాలో? ఎందుకంటే జలదీశ్వరుని చల్లని చూపు రావటానికి వీలు లేకుండా మనమే కొత్త నిర్మాణాల పేరుతొ మన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని అక్రమిస్తున్నాం.