"భూ" కైలాస్Back to list

 

"భూ" కైలాస్

మీ అంచనా ప్రకారం మన ఊరిలో గజం స్థలం ఎంత ఉంటుందనుకుంటున్నారు? మీ మనసులో అంకె వందల్లో ఉంటే మీరు తప్పులో కాలేసినట్లే..ఇక మీకు ఊర్లో ఇంటి స్థలం వందల్లో దొరకదు.ఈ మధ్య మన గ్రామం లో ఇళ్ళ స్థలాలకి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది.ఒకప్పుడు గజం మూడు వందలకి మించని స్థలాలు ఇప్పుడు వెయ్యి పెడితే కానీ దొరకటం లేదు.అత్యంత ఖరీదైన ప్రాంతంగా పడమట బజారు మొదటి స్థానం లో నిలిస్తే,ఒకప్పుడు వైభవం గా వెలిగిన తూర్పు వీధి ఆఖరు స్థానం లో ఉంది. రోడ్డుకి దగ్గరగా ఇల్లు ఉండాలనే కోరిక ప్రజల్లో బలీయంగా ఉండటంతో సెంటర్ కి దగ్గరగా ఉండే స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఇక మ్యూజియం చుట్టుపక్కల రెండు వందల మీటర్ల లోపు పురావస్తు శాఖ అనుమతి లేకుండా నిర్మాణాలు చేయకూడదు అనే నిభందన ఉండటంతో స్థలాలకి డిమాండ్ ఉన్నా పర్మిషన్ తెచ్చుకోగలిగిన వాళ్ళు మాత్రమే ధైర్యంగా కొంటున్నారు.ఇప్పటిదాకా మన ఊర్లో పలికిన అత్యంత ఖరీదైన ప్రదేశం ధర, గజం 2000 రూపాయలు.ఇది హైదరాబాదు ,విజయవాడ నగరాల శివారు ప్రాంతాల ధరతో సమానం. అత్యంత కనిష్ట ధర, గజం 400 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న 170 గజాల స్థలాన్ని తుమ్మల వెంకటేశ్వరరావు గజం వెయ్యి చొప్పున కొనుగోలు చేసి సంచలనం సృష్టించటంతో ప్రారంభమైన ఈ భూ కైలాస్, భూముల ధరలు కైలాసం కి చేరుకున్నాయని చెప్పకనే చెప్పింది.

గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ధరలు చదరపు గజానికి ఈ విధంగా ఉన్నాయి.
 
పడమట వీధి  - 1000 to 2000
తూర్పు వీధి    - 400 t0 550
మ్యూజియం పరిసర ప్రాంతాలు - 600 to 1000
సత్రం సెంటర్ - 1500 to 2000
రామయ్య కొట్టు సెంటర్ - 1500 t0 1800
రామా నగరం రోడ్ - 600 to 1000
(పైన ఇవ్వబడిన ధరలు కేవలం అంచనా మరియు ఇంతకుముందు ముందు జరిగిన లావాదేవిల ననుసరించి ప్రకటించటం జరిగింది. వీటిల్లో కొన్ని ఆ స్థలంలో ఉన్న పాత ఇంటితో సహా కూడా లభిస్తాయి.)
 
స్వాతి బలరాం కొనుగోలు చేసిన స్థలం 
వడ్లమూడి వారి రామాలయం పక్కనున్న బసవకోటిలింగం గారి 500 గజాల స్థలం అత్యధిక ధర రెండు వేల రూపాయలు గజం చొప్పున చెల్లించి స్వాతి పత్రిక బలరాం కొనుగోలు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు కోటి రూపాయల వ్యయం తో నిర్మించనున్నఆయన కలల సౌధం మన ఊరికే తలమానికం కానుంది. సినిమా హాలు ఎప్పట్నుంచో రంగనాధ బాబు గారు కొంటారనే వార్తలు నిజం అయ్యాయి. 2500 చదరపు గజాల ఆ స్థలంలో ఆయన కూడా ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నారనేది వినవచ్చిన వార్త. ఇప్పటికే సినిమా హాల్ బిల్డింగ్ ని కూల్చి వేసి స్థలం చదును చేయటం మొదలు పెట్టారు.ఇప్పటికే పూర్తైన అయినపూడి విజయకుమార్ గారి ఇల్లు,గ్రామం లో కెల్లా అత్యంత ఖరీదైన భవనం.నిర్మాణం లో ఉన్న వేమూరి చెన్నారావు గారి ఇల్లు ఇంకా నిర్మాణం మొదలు కానీ "స్వాతి" బలరాం గారి ఇల్లు,ఖరీదైన ఇళ్ళ జాబితా లో స్థానం పొందేందుకు  పోటీ పడుతున్నాయి.
 

ఊరికి దూరంగా సెటిల్ అయిన వాళ్ళకి సొంత ఊర్లో ఇల్లు కట్టాలనే బలీయమైన కోరిక ప్రబలటంతో ఒక్కసారిగా ఈ డిమాండ్ ఏర్పడిందని విశ్లేషకుల అంచనా. ఒకరకంగా తెలంగాణా అంశం కూడా దీనికి దోహదం చేసినట్లే. ఎప్పటికైనా మన ఊరు మనదే అనే భావన ఈ తరం యువకుల్లో బాగా పెరిగింది, రిటైర్మెంట్ వరకు ఉద్యోగరీత్యా పలు ఊర్లలో పని చేసిన ఉద్యోగస్తులు అంతా విరమణ అనంతరం ఊర్లోనే ప్రశాంతంగా జీవనం గడపాలని ఉద్దేశ్యం తో సకల సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకుంటున్నారు. సొంత ఊరికి వచ్చినప్పుడు కూడా సిటిలో లానే సౌకర్యంగా నివసించటానికి అవసరమైన అన్నీ హంగులతో బిల్డింగులు వెలుస్తున్నాయి.ఊర్లో ఉండే తమ తల్లిదండ్రులకి ఇల్లు సౌకర్యంగా ఉండాలి, అలాగే తాము వచ్చినప్పుడు పిల్లలతో సౌకర్యంగా ఉండేలా ఇల్లు కట్టించుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు మేడల్లో కానీ కన్పించని AC ఇప్పుడు చిన్న డాబాల్లో కూడా కనిపిస్తుంది.

 కనుమరుగవనున్న మండువా లోగిలి

 ఇంకొన్నాళ్ళకి పూరిల్లు అసలు మన ఊర్లో కన్పించకపోవచ్చు. తాటాకు కొట్టించి వాటిని ఇంటికి చేర్చి కూలి ఇచ్చి పైకప్పు కుట్టించే సరికి ఖర్చు తడిసి మోపెడవటంతో దానికి బదులు సిమెంట్ రేకులు ఒక్కసారి వేస్తే సరిపోతుంది. మండువా ఇళ్ళు ఇప్పుడు వేళ్ళ మీద లేక్కపెట్టచ్చు.వాటన్నిటి స్థానంలో ఎవరి స్థాయికి తగ్గట్లు వారు డాబాలు నిర్మించుకుంటున్నారు.మన ఊరు మ్యూజియంలో పూరిల్లు, మండువా ఇల్లు, బంగాళా పెంకుటిల్లు, నమూనాలని తయారు చేసి పెడితే బావుంటుందేమో అని నా ఆలోచన.ఎప్పుడైనా మన ఊరు వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు ఊర్లో ఇలాంటి ఇళ్ళు ఉండేవి అని ముందు తరాలకి చెప్పవచ్చు...

 

ఫోటోలు : మొవ్వ కిరణ్ కుమార్

 
Dated:20.04.2012