అభినవ కర్ణుడు మూల్పూరి వెంకట్రావుBack to list

 

అభినవ కర్ణుడు-ప్రతి ఏడాది రూ.30లక్షలు విరాళాలు ఇస్తున్న ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావు

సౌజన్యం : www.tnilive.com

 

Mulpuri-FEవిద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంతరించుకున్నఆదర్శ వ్యక్తి డాక్టర్ మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్ద జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

జీవన ప్రస్థానం ఇది:
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 31 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ. 30 లక్షల రూపాయలకుపైగా ) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్ధులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 9 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Mulpuri-4

Mulpuri-5

బాల్యం-విద్యాభ్యాసం:
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో ఈసీఈ విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు:
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

అంతా మేధావులే:
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.
Mulpuri-6

ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత:
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.
Mulpuri-3ఫోటో రైటప్: 1994 జూన్ లో అన్నపూర్ణ స్టూడియోలో టాప్ హీరో చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎన్.టి.ఆర్, బాలయ్యలతో డాక్టర్.మూల్పూరి వెంకట్రావు

 

 

 

 

పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ:

* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.

* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.

ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం.

Dated : 19.03.2015