అరుదైన వ్యక్తిత్వం - శ్రీ గొర్రెపాటి Back to list

అరుదైన వ్యక్తిత్వం - శ్రీ గొర్రెపాటి వెంకటనరసింహరావు మాస్టారు

గ్రామానికి వెబ్సైట్ రూపొందించే క్రమంలో నేను చాలా మందిని కలుసుకున్నాను. వారిలో స్వాతంత్ర సమరయోధులున్నారు, సామాన్య రైతులున్నారు , కాకలు తీరిన కమ్యూనిస్టులున్నారు, విద్యావంతులు , చరిత్రకారులు ఎంతో మంది వాళ్ళ అనుభవాలు వివరించారు. వారి అనుభవాలు వివరిస్తున్నపుడు వాళ్లందరితో పాటు వారి కాలంలోకి ప్రయాణించాను. ఒక్కొక్కరిది ఒక్కో వ్యక్తిత్వం, ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచనా ధోరణి. వాళ్ళ అనుభవాలు నాకు కొన్ని సార్లు పాఠాలు కూడా అయ్యాయి. వారి వ్యక్తిత్వం నా ఆలోచనా విధానాన్ని మార్చేసిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం నేను ఇటీవల దివంగతులైన శ్రీ గొర్రెపాటి నరసింహారావు మాస్టారుని కలిసినప్పుడు ఆయన అనుభవాలు చెప్తూ ఓ సంఘటన గురించి వివరించారు.

గ్రామంలో శ్రీ గొర్రెపాటి వెంకట నరసింహారావు గారు శ్రీ వేమూరి వెంకట నరసింహారావు గారు ఆప్తమిత్రులు. వీరిద్దరిని షార్ట్ కట్ లో GVNR - VVNR అని పిలిచేవారట.చిన్నప్పటినుండి కలిసి చదువుకున్నారు, కలిసే ఆడుకున్నారు. ఆర్ధిక సమస్యల వల్ల GVNR ఫిఫ్త్ ఫారం వరకే చదువుకుని గవర్నమెంట్ టీచర్ గా గ్రామంలోనే స్థిరపడ్డారు.తరువాతి కాలంలో వేమూరి వెంకట నరసింహారావు గారు ఇంగ్లీష్ మాధ్యమం లో పట్టభద్రులయ్యారు.తొలిసారి మన గ్రామం నుండి అమెరికా వెళ్లిన ఘనత కూడా VVNR గారికే దక్కింది.తరువాతి కాలంలో ఆంధ్రప్రభ ఎడిటర్ గా పనిచేశారు.

దాదాపు 80 సంవత్సరాల క్రితం ఈ ఇద్దరు మిత్రులూ ప్రతిరోజూ సైకిలు వేసుకుని మల్లాయి చుట్టూరు మీదుగా బందరు వెళ్లి చదువుకునేవారు.అప్పట్లో మట్టి డొంక తప్ప అసలు మల్లాయి చుట్టూరు కి సరైన రోడ్డు లేదు. మధ్యలో కాలువలు వచ్చినప్పుడు సైకిలు భుజాన వేసుకుని కాలువలో దిగి అవతలి వైపు కి వెళ్లి మళ్ళీ సైకిలు తొక్కుకుంటూ వెళ్లేవారు. ఈ క్రమంలో ఒకరోజు గంజి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కొంత ప్రవాహం తగ్గాక దాటుదాం అని మిత్రులిద్దరూ ఆ ఒడ్డున నిలబడి ఉన్న సమయంలో అటుగా పాలేరుతో వచ్చిన ఓ భూస్వామి అక్కడ నిలబడిన వీరిద్దరినీ చూసి ఒరేయ్ మన నరసింహారావు (VVNR) సైకిలు మోసుకురారా అని పాలేరు కి పురమాయించాడు.ఆ పాలేరు దిగి ఆ వైపున ఉన్న సైకిలు ని మోసుకుని ఇవతలి ఒడ్డుకి చేర్చాడు. GVNR కూడా తనకి కూడా ఆ సాయం అందుతుందని ఆశించి చూస్తుండగా ఆ భూస్వామి ఆయనని పట్టించుకోకుండా నువ్వు ఇంటికి వెళ్ళు అని VVNR కి చెప్పి పొలం లోకి వెళ్ళిపోయాడు. VVNR కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. తన తర్వాత తన మిత్రుడికి కూడా ఆ సాయం అందుతుందని ఆశించాడు.అప్పుడు GVNR తానే సైకిలు మోసుకుంటూ ఈ ఒడ్డుకి చేరుకున్నాడు. మిత్రులిద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు.తన ప్రమేయం లేకపోయినా చాలా కాలం VVNR ని ఆ సంఘటన గిల్టీ గా అనిపించేలా చేసిందని చెప్పారు గొర్రెపాటి వెంకటనరసింహారావు గారు.ఈ సంఘటన విన్న తర్వాత ఆయన్ని నేను రెండు ప్రశ్నలు అడిగాను.

ఆయన మీకు సహాయం చెయ్యకపోవటానికి కారణం ? ఇంతకీ ఎవరా భూస్వామి ?

మొదటి ప్రశ్నకి సమాధానం :
మా ఇద్దరి మధ్య ఉన్న ఆర్ధిక అసమానత.VVNR ఒక భూస్వామి కొడుకు , నేనొక సామాన్య రైతు కొడుకుని. మేమెంత స్నేహంగా ఉన్నా మిగతా సమాజం మా మధ్య ఉన్న ఆర్ధిక అసమానతని వేలెత్తి చూపించింది.

రెండవ ప్రశ్నకి సమాధానం: 
ఆ పెద్దమనిషి చనిపోయి 50 ఏళ్ళు గడిచాక , ఇప్పుడు నేనున్న ఈ వయసులో అయన పేరు నేను చెప్పవచ్చునా ? తప్పు కదూ !

సంచలనాల కోసం అర్ధం లేని ఆరోపణలు గుప్పించే వ్యక్తులు తయారవుతున్న ఈ సమాజంలో 90 ఏళ్ల ఆ నిలువెత్తు వ్యక్తి సమాధానం నా చెంప చెళ్లుమనిపించింది.
అందుకే సంచలనాల కోసం, ఎక్కువ వ్యూయర్ షిప్ కోసం అర్ధం పర్ధం లేని వార్తలు , వ్యాఖ్యలు వెబ్సైట్ లో రాయకూడదని నిర్ణయించుకున్నాను. ఈ 8 సంవత్సరాల్లో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళలేదు. దానికి కారణం గొర్రెపాటి వెంకట నరసింహారావు గారి లాంటి అరుదైన వ్యక్తుల సాన్నిహిత్యమే.

This text will be replaced