అవిశ్రాంత ఉపాధ్యాయుడు మూల్పూరి Back to list

మనిషి బతికుండగా ఆ మనిషిని గురించి చెప్పటానికి మాటలు కరువవుతాయేమో. మనిషి పోయాక ఆయన జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి. చేసిన మంచిపనులన్నీ కళ్ళముందు కదులుతుంటాయి. వాళ్లతో గడిపిన ప్రతి క్షణం ఎంతో విలువైనది గా అనిపిస్తుంది. LKG నుండి 5 తరగతి వరకు నా చదువు లయోలా కాన్వెంట్ లో సాగింది. 1990 సంవత్సరం మే నెలలో వచ్చిన తుఫాను తర్వాత జూన్ లో హైస్కూల్ తెరవగానే 6 వ తరగతి లో చేరటానికి వెళ్ళినపుడు మొట్టమొదటి సారి చెన్నారావుగారిని చూశాను. ఆయన అప్పుడు ప్రధానోపాధ్యాయులు గా ఉన్నారు.నాన్న ఆయన్ని కలిసి మావాడే, కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పారు. పంచె కట్టు తో ఆకాశపు నీలం రంగు స్కూటర్ మీద ఆయన వస్తున్నారంటే స్కూల్ వసారాలన్నీ ఖాళీ అయిపోయేయి. ఎక్కడివాళ్ళు అక్కడ క్లాసుల్లోకి వెళ్ళిపోయేవారు.అప్పటికే ఆయన రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా అవార్డు పొందారు. నాకు గుర్తున్నంత వరకు నేను చేరిన తర్వాత కొద్దీ నెలలే ఆయన హెడ్మాస్టర్ గా ఉన్నారు.ఎందుకంటే ఆ సంవత్సరమే ఆయన రిటైర్మెంట్.అదే సంవత్సరం ఆయన రిటైర్ అయ్యాక అమెరికా పర్యటనకి వెళ్లారు.తుమ్మల రాధా క్రిష్నయ్య గారు ఆయన తరువాత హెడ్మాస్టర్ అయ్యారు 1991 లో అమెరికా నుండి తిరిగి వచ్చాక అక్కడ ఆయన చూసిన విశేషాలన్నీ వీడియో తీసుకుని వచ్చారు. ఇది పాతికేళ్ల నాటి సంగతి. అప్పట్లో డిజిటల్ వీడియో కెమెరాలు లేవు, సిడి లు లేవు.VHS లోనే అంతా రికార్డు చేసుకుని వచ్చారు. హైస్కూల్ లో 8 వ తరగతి కామన్ హాల్ లో ఉండేది. అన్ని క్లాసు రూముల్లోకి అదే పెద్దది. ప్రస్తుతం దీన్ని శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య ఆడిటోరియం గా పిలుస్తున్నారు. పిల్లలందరినీ ఆ హాల్లో కూర్చోబెట్టి పెద్ద కలర్ టీవీ లో ఆ క్యాసెట్ వేసి చూపించారు. అసలు కలర్ టీవీ చూడటమే గొప్ప అనుకుంటే అందులో మళ్ళీ అమెరికా చూడటం ఇంకో గొప్ప. ఆ వీడియో ప్లే అవుతుండగానే ఆ హాల్ మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చుని తన కంచు కంఠం తో కనిపించే దృశ్యాలకి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న దృశ్యం చెన్నారావు గారి దంపతులు ఒక ఆపిల్ తోటలోకి వెళ్ళటం. ఆ దృశ్యం రాగానే ఆ వీడియో ని ఆపి ఆ తోటలోకి వెళ్లి మన ఇష్టం వచ్చినన్ని పళ్ళు తినచ్చు, కానీ బయటకి తెచ్చుకోకూడదు అని చెప్పారు.అక్కడ చాలామంది ఆపిల్స్ కొరికి పారేస్తుంటే ఉసూరుమన్పించింది అన్నారు. ఆ తరువాత ఆయన ఉండే వీధిలోనే ఉన్న గొర్రెపాటి సీతారామకృష్ణ మాస్టారి దగ్గర 7 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు  ట్యూషన్ చదవటానికి వెళ్ళేవాడిని. రోజూ ఉదయం అరుగుమీద కూర్చుని పేపర్ చదువుతూ కనిపించేవారు. తర్వాత ఊర్లో అప్పుడపుడు అదే నీలం రంగు స్కూటర్ మీద వెళ్తూ కనిపించేవారు. శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు నెలకొల్పిన విద్యాట్రస్ట్ లో శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు గారు , శ్రీ మూల్పూరి చెన్నారావుగారు , శ్రీ గొర్రెపాటి చంద్రశేఖరంగారు , శ్రీ గొర్రెపాటి లీలాకృష్ణయ్య గారు కార్య నిర్వాహకులుగా ఉండేవారు.గ్రామంలో ఏ అవసరం వచ్చినా, ఏ కార్యక్రమం చెయ్యాలన్నా వీరే అన్నీ పర్యవేక్షించి నిర్వహించేవారు. గొర్రెపాటి రంగనాధబాబు గారు ట్రస్ట్ కి పునాది అయితే ఈ నలుగురు నాలుగు స్థంబాలుగా ఒదిగిపోయి ట్రస్ట్ నిర్వహించారు. గ్రామంలో ఏ అభివృద్ధి పనికైనా తానే ముందు ఉండేవారు.

 
 

2012 మార్చిలో నేను ఘంటసాలలో మా ఇంట్లో ఉన్నపుడు ఒక కాల్ వచ్చింది. బాబూ నేను చెన్నారావు మాస్టార్ని మాట్లాడుతున్నా మనం గుడ్లవల్లేరు వెళదాం వస్తావా అని అడిగారు. నేను ఆ సాయంత్రమే హైదరాబాదు వెళ్ళాలి. వస్తాను మాస్టారూ అని ఆ మధ్యాహ్నం గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారి కార్లో అందరం వెళ్ళాం. ఇంతకీ విషయం ఏంటంటే మురికి కూపంలా ఉన్న మన గ్రామ స్మశానాన్ని అందమైన పార్క్ గా తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యం. అందుకోసం అప్పటికే అలా తీర్చిదిద్దిన గుడ్లవల్లేరు స్మశానాన్ని మోడల్ గా తీసుకుని చెయ్యాలనే సంకల్పంతో ఆ ప్రయాణానికి పూనుకున్నారు.నేను ఈ కాన్సెప్ట్ చూస్తే వెబ్సైట్ లో అందరికీ అర్ధం అయ్యేలా తెలియచేస్తాననే ఉద్దేశంతో ఆయన నన్ను పిలిచారట. నాకు ఆ కార్లో ఉన్నంత సేపు ఒకటే ఆలోచన, రిటైర్ అయ్యాక 80 ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి తీసుకోకుండా ఊరుకోసం ఈయనకేంటి ఇంత తపన అని.అసలు ఈయనకే ఇలా ఉంటే , కుర్రాళ్ళం మనకెంత ఉండాలి అనేంత స్ఫూర్తిని రగిలించింది ఆ ప్రయాణం.నేను ఆ బాగుపడిన స్మశానం చూశాకే పోతా , బాగుపడ్డ స్మశానంలోనే నా కార్యక్రమాలు జరగాలి అన్నారు ఛలోక్తిగా. అందరం నవ్వుకున్నాం.తరువాత దాతల సహకారంతో రుద్రభూమిగా , శాంతివనం పార్క్ గా మన స్మశానం రూపుదిద్దుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

 2012 మార్చ్ లొ గుడ్లవల్లెరు స్మశానవాటిక లొ మెము 

ఊర్లో రోడ్లు వేయిద్దాం అనగానే తన ఇంటిముందు రోడ్డుకి 6 లక్షలు వెచ్చించి ఆఘమేఘాల మీద సిమెంటు రోడ్డు వేయించారు. 85 ఏళ్ల వయసు ఆయనకి. ముగ్గురు పిల్లలు స్థిరపడ్డారు, మనవళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. చీకు చింతా లేని జీవితం. పడక్కుర్చీ కి పరిమితమై జ్ఞాపకాలతో సేదదీరాల్సిన వయసులో స్వఛ్చ ఘంటసాల అంటూ పొద్దున్నే లేచి మోకాళ్ళ నెప్పులకి బెల్ట్ పట్టుకుని కుర్రాళ్లతో సమానంగా ఊర్లో రోడ్లు ఊడ్చే పెద్దాయన ఎక్కడన్నా ఉన్నారా ? దక్షిణ బావి దగ్గర శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి విగ్రహం నెలకొల్పటంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ విగ్రహావిష్కరణ రోజు చిన్న పిల్లాడిలా సంబరపడిపోయారు.మనఘంటసాల ట్రస్ట్ నెలకొల్పాలని ఆయన్ని గౌరవ అధ్యక్షులుగా ఉండమని అడగ్గానే సంతోషంగా అంగీకరించి తనవంతు పాత్రని పోషించారు. 2 నెలల క్రితం ప్రారంభించిన గ్రామ ప్రాచీన వారసత్వ చిహ్నాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తన ఆఖరి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఉపాధ్యాయులుగా , ప్రధానోపాధ్యాయులుగా 35 సంవత్సరాలు ఆయన పని చేసిన జీవితం ఒక ఎత్తు. పదవీ విరమణ తర్వాత 25 ఏళ్ల పాటు గ్రామానికి ఆయన చేసిన సేవ మరో ఎత్తు. ఒక రకంగా ఉపాధ్యాయులుగా ఉన్నపుడే ఆయన విశ్రాంత జీవనం గడిపారేమో. రిటైర్ అయ్యాక ఈ పాతికేళ్లలో గ్రామాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా శ్రమించారు.ఎంతో మంది యువకులకి మార్గదర్శకులయ్యారు. అందుకే ఆయన అవిశ్రాంత ఉపాధ్యాయుడు. 

 

ఆవు గట్టున మేస్తుంటే దూడ చేలో మేస్తుందా అన్నట్లు ఆయన పిల్లలు కేవలం ఆయనలో విద్యావేత్తకి, ఆస్తికి మాత్రమే వారసులు కాదు. ఆయనలో ఉన్న దాతృత్వ గుణానికి కూడా.ముగ్గురు పిల్లల్ని విద్యావంతులుగా తీర్చి దిద్దటంతో పాటు సమాజానికి ఉపయోగపడే అత్యున్నత పౌరులుగా తీర్చిదిద్దటంలో అయన సఫలీకృతులయ్యారు. 1981 లో అమెరికాకి వెళ్లిన ఆయన కుమారుడు శ్రీ మూల్పూరి వెంకట్రావు గారు అభినవ కర్ణుడు గా పేరొందారు. ఇండియాలో ఉన్న పలు స్వచ్చంద సంస్థలకి ఏటా లక్షల రూపాయల విరాళాల్ని అందిస్తున్నారు.గ్రామాభివృద్దిలోనూ కీలక పాత్ర పోషించారు.

 

85 ఏళ్ల వయసులో కూడా పుట్టిన గ్రామం కోసం చివరికంటా అహరహం శ్రమించిన వ్యక్తి శ్రీ మూల్పూరి. ఇలాంటి వారికి జన్మ నివ్వటం వల్ల ఘంటసాల గొప్పదైనదా ? ఘంటసాల మట్టిలో ఉన్న గొప్పదనం వల్ల ఇలాంటి అరుదైన వ్యక్తులు ఈ గడ్డమీద జన్మించారా అంటే సమాధానం కష్టమే.

 అక్టోబర్ 20 , 2016 వ తేదీన శ్రీ మూల్పూరి చెన్నారావు గారు దివికేగిన సందర్భంగా అశ్రునయనాలతో.. 

Dated : 22.10.2016

This text will be replaced