​​ముగిసిన శకంBack to list

 

 ​​ముగిసిన శకం 

 ఏరా మనవడా ఎప్పుడొచ్చావ్, ఏరా అల్లుడూ ఏమిటి పిల్లల కబుర్లు , ఇకపై ఊరు వెళ్ళినపుడు ఇలాంటి పలకరింపులు మనకి వినిపించవు. రోడ్డు మీదకి రాగానే కనిపించే ఆ మందుల షాపు ఇక తెరుచుకోదు. అవును,  50 ఏళ్లుగా మన గ్రామస్తుల జీవనంలో పెనవేసుకుపోయిన గోపాలకృష్ణా మెడికల్ ఎంపోరియం ప్రస్థానం ముగిసింది. గ్రామంలో 50 ఏళ్ల క్రితం స్థాపించిన తోలి మందుల షాపు ఇక చరిత్రలోకి వెళ్ళిపోయింది. పిల్లల్ని , పెద్దల్ని ఆప్యాయంగా పలకరించే ఆ ధవళ వస్త్రధారి ఇక కనపడడు. పేదోడి డాక్టర్ , పెద్దోడి కాంపౌండర్  శ్రీ వేమూరి గోపాలకృష్ణ శకం ముగిసింది. అందరూ ఆప్యాయంగా మందులషాపు గోపాలకృష్ణ గారూ అని పిలుచుకునే ఆ నిండైన మనిషి ఇక మనకి లేరు.

 
 
 
నేను జూన్ లో సెలవలకి ఇండియా వెళ్ళిన పుడే ఆయనకి అస్వస్థతగా ఉందని తెలిసి చూడటానికి వెళ్ళాను. అప్పటికే ఆయన మంచం మీద ఉన్నారు. రూపంలో మార్పు కూడా స్పష్టంగా కనిపించింది. ఆయన ఆఖరి దశలో ఉన్నారని అప్పటికే నాకు అర్ధం అయ్యింది.ఆ వార్తతో పాటు ఆయన ఫోటో ని కూడా వెబ్సైట్ లో పెడదామనుకుని కూడా ఆ ఆలోచనని విరమించుకున్నాను. పచ్చటి ఆ వర్చస్సు , నిండైన విగ్రహంతో మన గుండెల్లో ముద్రించుకుపోయిన ఆ రూపానికి చివరిదశలో ఆయన రూపానికి ఎక్కడా పోలిక లేదు. అందరికీ గుర్తుండే ఆయన రూపాన్ని అలాగే మన మనస్సులో ఉండాలనే ఆయన అస్వస్థతగా ఉన్నపుడు ఫోటో కూడా తీయలేదు. అదే సమయంలో ఆయన యువకుడుగా ఉన్నప్పటి రోజుల్లో ఉన్న ఫోటో తీసుకున్నాను. 
 
 
గతంలో ఆయన గురించి నేను రాసిన ఆర్టికల్  విలక్షణ క్షణాలు 2 ఏళ్ల క్రితం ఊరు వెళ్ళినపుడు  ప్రింట్ తీసి ఇచ్చాను. దానికి కింద ఆయన మీద అభిమానంతో మన గ్రామస్తులు రాసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. అది చదువుకుని ఆయనలో ఆయనే సంతోష పడ్డారు తప్ప కనీసం రెండో మనిషికి కూడా దానిని గర్వంగా చూపించుకోలేదు. కనీసం ఆయన షాపులో రోజూ కూర్చునే వాళ్ళకి కాని ఆయన బంధువులకి కూడా ఆ ఆర్టికల్ ని చూపించలేదు. ఆయన అస్వస్థత కి గురయ్యాక ఆయన బంధువులు ఆ షాపుని ఖాళీ చేసే క్రమంలో ఆ ఆర్టికల్ కాగితాలు కనిపించాయి. అది చదివిన వాళ్ళు ఆయన్ని అడిగారట , నీ గురించి ఇంత బాగా రాస్తే కనీసం మాకు ఒక మాట అయినా చెప్పలేదే అని. ఆ ప్రశ్నకి కూడా ఆయన చిరునవ్వే సమాధానం అయింది. ఆయన వ్యక్తిత్వాన్ని వర్ణించేటప్పుడు నిగర్వి , వివాద రహితుడు లాంటి పదాలు చాలా మామూలుగా అనిపిస్తాయి. దానికి మించిన వ్యక్తిత్వమేదో ఆయనలో ఉంది. నాకు ఊహ తెలిసాక 25 ఏళ్లుగా ఆయన్ని చూస్తున్నా , అన్ని రకాల మనుషులు ఆయన దగ్గర కి వెళతారు. రాజకీయ చర్చలకి, రచ్చబండ వాదోప వాదాలకి , సాయంకాలం కాలక్షేపానికి అన్నిటికీ చుండూరి అప్పారావు గారి మిద్దెలో 40 ఏళ్ళపాటు సాగిన ఆ మందుల దుకాణమే అందరికీ అడ్డా. జలుబొచ్చినా , దగ్గొచ్చినా , చిన్నపాటి జ్వరం వచ్చినా ముందు గుర్తొచ్చేది గోపాల కృష్ణ తాతే. ఎలాంటి సమస్యకైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా రెండు సార్లే మందులు ఇచ్చేవారు. మూడోసారి కూడా తగ్గకపోతే ఇక నేను మందులు ఇవ్వను, డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోమని చెప్పేవారు. అందుకే ఇన్నేళ్ళలో ఒక్కటంటే ఒక్కరికి కూడా ఆయన మందుల వల్ల కీడు జరిగింది లేదు. 
 
1968 లో తన చదువును పూర్తి చేసుకుని వచ్చిన గోపాలకృష్ణ గారు , అప్పట్లో అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నా సొంత గ్రామంలో మందుల షాపు పెట్టటానికే మొగ్గు చూపారు. తుది వరకు దానిని ఒక వ్యాపారం లా కాకుండా వ్యాపకంగానే కొనసాగించారు. అందుకే మనందరి గుండెల్లో సమున్నతంగా నిలిచిపోయారు.
 
Dated : 18.12.2014
 
 

 

This text will be replaced