విడిపోయిన జ్ఞాపకాలు Back to list

విడిపోయిన జ్ఞాపకాలు 

ఎన్నో భావోద్వేగాల మధ్య రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారికి రాజకీయ నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు తప్ప సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం తెలియకపోవచ్చు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు జరిగిన ప్రాణ నష్టం 68 ఏళ్ల తరువాత ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసును కలచి వేసే ఉదంతం అది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి.

150 రూపాయలు తో టికెట్ కొని జేబులో 200, చేతిలో 50 కేజీల బియ్యం బస్తా తో వెంకటరమణా ట్రావెల్స్ బస్సు ఎక్కి 1999 సెప్టెంబర్ 24 న భవిష్యత్తు మీద కోటి ఆశలతో అడుగుపెట్టిన నాకు బోలెడంత భరోసా ఇచ్చి అక్కున చేర్చుకుంది భాగ్యనగరి. ఏదో అవ్వాలని, ఏదో చెయ్యాలని తపన తో వచ్చిన నాకు బస్సు దిగగానే ఇక ఏమీ పర్లేదు బిడ్డా మంచిగ అవుతావ్ గిదంతా మనదే అనే భావన కలిగించింది హైదరాబాద్.

అప్పుడు ECIL దగ్గర కమలా నగర్ లో మకాం. నెలకి 480 రూపాయల అద్దె. అగ్గిపెట్టెంత రూములో ముగ్గురం ఉండేవాళ్ళం. వంట అందులోనే. ఎప్పుడైనా బద్ధకం వేస్తె దగ్గరే సాయి మెస్సు లో ప్లేట్ భోజనం 15 రూపాయలు. ఫుల్ అయితే 18 రూపాయలు. నెలకి 1000 రూపాయల జీతంతో ప్రారంభమైన ప్రయాణం రోజుకి 1000 సంపాదించే వరకు హైదరాబాదులోనే సాగింది. మధ్యలో 6 సంవత్సరాల చదువు హైదరాబాదులోనే. 23 జిల్లాల నుండి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఒకే చోట చదువుకున్నాము. విచిత్రం ఏమిటంటే ఏ ప్రాంతం వాడితో మాట్లాడేటప్పుడు ఆ ప్రాంతపు యాస నాకు తెలీకుండానే వచ్చేసేది.ఇంజినీరింగ్ చదివింది ముస్లిం మైనారిటీ కాలేజిలో అయినా ఏరోజూ ఆ బేధం తెలియలేదు. ప్రతి సంవత్సరం కనీసం 5, 6 ఇఫ్తార్ విందులు ఉండేవి. ఓల్డ్ సిటీ లో మిత్రుల ఇళ్ళకి ఇఫ్తార్ కి వెళ్లినపుడల్లా ఆ ఇంటి మర్యాదలు, ఆదరణ అద్భుతం. పాయ, నహారి , హైదరాబాద్ బిర్యాని సుష్టుగా తిన్నాక సేమ్యా ఖీర్ తో ఆ విందు ముగిసేది.

సికిందరాబాద్ బ్లూ సీ కేఫ్ లో ఇరానీ ఛాయ్ 3 రూపాయలు, ఉస్మానియా బిస్కట్ 50 పైసలు. 5 రూపాయలు ఇస్తే ఒక ఛాయ్ నాలుగు బిస్కట్స్ వచ్చేవి. స్నేహితులతో కలిసి మారేడ్ పల్లి నుండి సికిందరాబాద్ దాకా నడిచి వెళ్ళేవాళ్ళం. బద్దకిస్తే 38 నంబర్ బస్సు ఎలాగూ ఉండేది. ఇక బిర్యాని తినాలంటే బావర్చి నే. నలుగురం కలిసి వెళ్తే ఫ్యామిలీ పాక్, ఆరుగురం వెళ్తే జంబో పాక్. ఆర్టీసి క్రాస్ రోడ్లో ఆ బిర్యాని తినేసి మళ్లీ 1 నంబర్ బస్సు ఎక్కి సికిందరాబాద్ వచ్చేసే వాళ్ళం. నెలకి 60 రూపాయలు బస్సు పాస్ కడితే కనపడ్డ బస్సు నల్లా ఎక్కి ఫుట్ బోర్డు లో వేలాడిన రోజులు మర్చిపోకముందే ఇప్పుడు ఆంద్రోడికి బస్సు పాస్ ఇవ్వనంటోంది హైదరాబాద్.

తొలిసారి విదేశానికి వెళ్ళేటప్పుడు విమానం బేగం పేటలో ఎక్కాను. అందరిని వదిలి వెళ్తున్నాననే బాధ కంటే హైదరాబాదు ని మిస్ అవుతున్నాననే బాధతోనే నా హృదయం బరువెక్కింది. 21 ఏళ్ల కుర్రవాడు తొలి సారి విమానమేక్కబోతున్న అనుభవానికి, ఉత్సుకతకి ఉత్సాహానికి సాక్షిగా నిలిచింది బేగంపేట విమానాశ్రయం.

ఖాళీగా తిరిగే రోజుల్లో ఎక్కడ ఏ సినిమా కార్యక్రమం ఉందా అని పేపర్ చూసుకోవటం సాయంత్రానికల్లా అక్కడ వాలిపోయి సినిమా వాళ్ళని చూడటమే పని. హైదరాబాదులో ఉన్న అన్ని థియేటర్స్ లో సినిమా చూడాలనేది గోల్ అలా మూడు సంవత్సరాలలో 115 థియేటర్స్ లో సినిమాలు చూసిన రికార్డు నాదే. సినిమా రిలీజ్ అయితే, అప్పటిదాకా నేను చూడని ధియేటర్ లో ఆ మూవీ ఎక్కడుందో చూసుకోవటం మార్నింగ్ షో కి వెళ్ళిపోయేవాళ్ళం.

అర్ధరూపాయి, పావలా అనే పదాలు మర్చిపోయి ఆటాన చారానా అంటూ అక్కడి మాండలికంతో మమేకమయ్యాం. బాబాయ్ అనే పదం మరిచి కాకా అంటూ కలిసిపోయాం. గీనితో గిదే లొల్లిరా మామా అంటూ గొడవ అనే పదాన్నే మర్చిపోయాను. ఐ లవ్ హైదరాబాద్ అంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా గర్వంగా చెప్పుకున్నాం. అబిడ్స్ లో ఉన్న విశాలాంధ్ర పుస్తకాలయంలో నేను చదవని తెలంగాణా పోరాట పుస్తకం లేదు.

ఎన్ని దేశాలు తిరిగినా నా శరీరం మాత్రమే అక్కడుండేది మనసు మాత్రం ఎప్పుడో హైదరాబాదులో పారేసుకున్నాను. నా సంపాదనతో కొనుకున్న తోలి ఇల్లు హైదరాబాదులోనే ఉంది. నా తోలి ఉద్యోగం, తొలి విమాన ప్రయాణం, తొలి సంపాదన ని ఖర్చు పెట్టిన ఇరానీ కేఫ్ అన్నీ తెలంగాణా లోనే ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ఆంధ్రోడు అనే పదం మీడియా లో రాజకీయ నాయకుల నోటి వెంట తప్ప, నా మిత్రుల నోటివెంట రాకపోవటం...

Date : 30.08.2014

 

This text will be replaced