నాలుగేళ్ళ ప్రయాణంBack to list

 
నాలుగేళ్ళ ప్రయాణం

వెబ్ సైట్ ప్రారంభించి నేటికి నాలుగేళ్ళు గడిచాయి. ఇది ఇంత కాలం మనగలుగుతుందని, ఇంతమంది అభిమానాన్ని చూరగొంటుందని నేనూ అనుకోలేదు. 2013 సంవత్సరాన్ని ఒక సారి సింహావలోకనం చేసుకుంటే, వార్తా విశేషాలన్నీ ఎప్పటికప్పుడు అందించినా ఉద్యోగరీత్యా దేశాలు మారటం వల్ల కధనాలు మరియు ఎడిటర్ వాయిస్ క్రమం తప్పకుండా రాయలేకపోయాను. ఈ సంవత్సరం మైలు రాయిగా చెప్పుకోతగ్గ అంశాల్లో నా పారిస్ ప్రయాణం, అక్కడున్న మన ఊరి శిల్పాలని చూడగలగటం, వాటిని ఈ వెబ్ సైట్ ద్వారా అందరికీ అందచేయటం. బహుశా మన గ్రామం నుండి వెళ్లి చూసింది నేనే అనుకుంటున్నాను. 1960 ప్రాంతాల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోవటం కాని, వెలుగులోకి తెచ్చే ప్రయత్నం కాని ఎవరూ చెయ్యలేదు. శ్రీ గొర్రెపాటి రామకృష్ణ గారు ఈ విషయాన్ని స్థానిక వార్తా పత్రికలకి అందింఛి ఈ విషయానికి మరెంతో ప్రాముఖ్యత ని తీసుకు వచ్చారు. ఎంతో మంది ఈ విషయంలో నన్ను ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నా ధన్య వాదాలు.
 
ఎంతో ఉత్సుకతని రేకెత్తించిన పంచాయితీ ఎన్నికల ఫలితాలని లైవ్ గా అందించటం, అభ్యర్ధుల వివరాలని ఎప్పటికప్పుడు ప్రకటించటం ద్వారా ప్రవాసులందరికి మరింత చేరువ అయ్యాము. ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిని కలిగించిన వార్తల్లో పంచాయితీ ఎన్నికల అంశం ఒకటి. త్వరలో వందేళ్ళకి చేరువ అవుతున్న మన పంచాయితీ గురించి వివరాలు అందించటం మా అదృష్టమనే చెప్పాలి. ఇక ఈ వెబ్ సైట్ గురించి అత్యధిక ప్రజాదరణ గల ఈనాడు ఆదివారం పుస్తకంలో కధనం రావటంతో, మన గ్రామం ఆంధ్ర దేశంలో ఉన్న ఎంతో మందికి చేరువ అయ్యింది. ఆ వారం రోజుల్లో దాదాపు 10000 మంది పైగా మన వెబ్ సైట్ ని సందర్శించారు. మరెంతో మంది తాము కూడా తమ గ్రామాలకి వెబ్ సైట్ రూపొందించాలని నన్ను సలహాదారుగా ఉండమని కోరారు. అసలు నేను ఇండియా లోనే లేనని , అయినా నాకున్న భాధ్యతల వల్ల సాయపడలేనని సున్నితంగా తిరస్కరించాను.
 
రుద్రభూమి అభివృద్ధి కి దాతల నుండి వచ్చిన స్పందన అమోఘం, ఈ మహా యజ్ఞంలో ఈ వెబ్ సైట్ ద్వారా నేను కూడా భాగం అయినందుకు చాలా సంతోషం అనిపించింది. 
ముత్యాలమ్మ ముఖద్వారానికి ఊహించిన దానికంటే 100 రెట్లు స్పందన లభించింది. విరాళాలు వెల్లువెత్తాయి. అంచనాలని మించి ఈ నిర్మాణం జరిగింది. ఇందులో కూడా పరోక్ష భాగస్వామ్యం ఉన్నందుకు గర్వంగా ఉంది. 
 
 
నాతో నేరుగా ఎవరూ అనకపోయినా ఈ వెబ్ సైట్ నిర్వహణ గురించి చాలా మందిలో ఎన్నో సందేహాలు ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. అందుకే దీని ఆదాయ వ్యయాలన్నీ పారదర్శకం గానే ఉంచాను. గత రెండు సంవత్సరాల నుండి ఎవరి దగ్గరా విరాళాలు తీసుకోలేదు. కొంతమంది మధ్యలో ముందుకు వచ్చినా, నేనే సున్నితంగా తిరస్కరించటం జరిగింది. ఇక పై ఎటువంటి విరాళాలు స్వీకరించబడవు. ఇప్పటిదాకా అయిన నిర్వహణ వ్యయం వివరాలు ఈ లింక్ లో చూడవచ్చు.    వెబ్ సైట్ ఆదాయవ్యయాలు

గ్రామ ఉప సర్పంచ్ గా గొర్రెపాటి సురేష్ ఎన్నికవటంతో వెబ్ సైట్ కూడా కొత్త ఊపిరి వచ్చినట్లైంది. పాలనా సమాచారంతో పాటు గ్రామాభివృద్ది ప్రణాళికలు కూడా ఎప్పటికప్పుడు త్వరిత గతిన మాకు చేరిపోతున్నాయి. ఆయన టెక్నాలజీ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు తనని అప్ డేట్ చేసుకోవటంతో సామాజిక మాధ్యమం మరియు ఈ మెయిల్స్ ద్వారా ఎప్పటికపుడు సమాచారాన్ని అందిస్తున్నారు. ఆయన ఉప సర్పంచ్ గా గెలవటం తోనే ఈ వెబ్ సైట్ మరో 5 సంవత్సరాలు మనగలదని అనిపించింది. 

ఈ సంవత్సరం నేను ప్రారంభించిన మరో శీర్షిక నా ఐరోపా యాత్ర. నా ప్రయాణంలో నాకెదురైన అనుభవాలని, ఆలోచనలని మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ ఐరోపా యాత్ర. సమయాభావం వల్ల ఈ శీర్షిక కూడా సరిగా కొనసాగించ లేకపోతున్నాను. త్వరలోనే దీనిని పూర్తి చేయటం జరుగుతుంది.
 

ఇక సంవత్సరం ఎక్కువమంది చదివిన ఆర్టికల్ కమ్మవారంతా చౌదర్లేనా???
 
ఎక్కువమంది చూసిన వీడియో పారిస్ లో ఘంటసాల శిల్పాలు.
 
 
వార్తల్లో ఎక్కువమంది చదివింది పంచాయితీ ఎన్నికల ఫలితాలు.ఎప్పటిలాగే వీక్షకుల సంఖ్యలో ఇండియా తర్వాత అమెరికాదే అగ్రస్థానం. తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా ఉన్నాయి.

మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 

 

Dated : 13.01.2014
 

This text will be replaced