రోడ్డు మీది - పేరు మీదిBack to list

 
రోడ్డు మీది - పేరు మీది

ఈ మధ్య ఒకే తరహా ఆలోచనలు కలిగిన మూడు అనుభవాలు నాకు ఎదురయ్యాయి. ఎలాగూ తెలంగాణా విడిపోయింది, కానీ మన వాళ్ళకి మాత్రం హైదరాబాదు మీద మమ కారం మాత్రం పోవట్లేదు. మిగతా తెలంగాణా జిల్లాల మీద ప్రేమ ఉన్నా లేకపోయినా హైదరాబాదు మీద మాత్రం ఎనలేని భావోద్వేగాలు పెనవేసుకుని ఉన్నాయి. వాళ్ళు పొమ్మంటున్నా మనకి మాత్రం ఎందుకో దానిని వదులుకోవటం ఇష్టం లేదు. మానసిక పరమైన అనుభంధం ఒకటైతే మళ్ళీ కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే అయ్యే ఖర్చు కొత్తగా ఏర్పడే రాష్ట్రం మీద పడుతుందని ఆర్ధిక నిపుణులు, మేధావుల ఆందోళన మరో కారణం. ఇటీవల మన గ్రామానికి చెందిన ఒకాయన మాట్లాడుతూ ఇంకా ఎందుకు ఈ హైదరాబాదుని పట్టుకు వేలాడటం, ఏ ఒంగోలు, గుంటూరు, విజయవాడలలో కొత్త రాజధాని నిర్మించుకోవటం ఎంత సేపు మనకి, వనరులు లేవా ? చదువుకున్న వాళ్ళు లేరా ? పెట్టుబడి దారులు లేరా ?  సచివాలయానికి మీ తాత పేరు పెడతాం ఒక 10 కోట్లు ఇవ్వమంటే ఇచ్చే ప్రవాసాంధ్రులు బోలెడు మంది ఉన్నారు మనకి అన్నారు. ఇదో కొత్త ఆలోచన, ఇప్పుడిప్పుడే  హైదరాబాదు మీద ఒక్కో మెట్టూ దిగుతున్న మన వాళ్ళకి ఇంకా ఈ ఆలోచన రాలేదేంటి చెప్మా అనుకున్నాను. అసెంబ్లీ కి అమ్మమ్మ పేరు పెడితే 50 కోట్లు ఇచ్చే వ్యాపారవేత్తలు బోలెడు మంది ఉన్నారు. అందులో తప్పేముంది అనిపించింది. 1991 లో దేశం ఆర్ధిక సంక్షోభంలో పడినప్పుడు దానిని గాడిలో పెట్టటానికి పివి నరసింహారావు అనుసరించిన సంస్కరణల విధానం కూడా ఇదే. విదేశీ పెట్టుబడులని దేశీయ మార్కెట్లో అనుమతించటం. అది లేకపోతే మనం Dynora, Uptron, EC TV లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనం చూస్తున్న LG,Samsung,Sony గ్రహోపకరణాలు ఆ ఆర్ధిక సంస్కరణలు,విదేశీ పెట్టుబడుల పుణ్యమే. కాకపోతే అవన్నీ విదేశీయులు పెట్టిన పెట్టుబడులు, వాళ్ళు మన వాళ్ళకి కల్పించిన ఉపాధి అవకాశాలు. మరి ఈ 22 ఏళ్లలో ఎన్నో మార్పులు, మన వాళ్ళు విదేశాలలో ఆర్ధికంగా ఎంతో బలపడ్డారు, అక్కడి వాళ్ళకే సవాళ్ళు విసురుతున్నారు. ఎవరిమీదా ఆధార పడకుండా మన వాళ్ళే మనల్ని ఆదుకునే స్థితిలో ఉన్నారు. ఈ లెక్కన రాజధానిని నిర్మించుకోవటం ఎంత సులువు !

మరో తెలంగాణా నాయకుడు టి.వి చర్చల్లో మాట్లాడుతూ ఇరు కమ్యూనిస్టు పార్టీల కేంద్ర కార్యాలయాలు తెలంగాణాలో ఉన్నా వాటి భవనాల పేర్లు మాత్రం ఆంధ్రోల్లవే అని విమర్శించాడు. ఇంతకీ ఏమిటా పేర్లు ? పుచ్చలపల్లి సుందరయ్య భవన్, మాకినేని బసవపున్నయ్య భవన్. ఆహా  ఎంతైనా కామ్రేడ్లు (కమ్మ రెడ్లు) కదా. అవే పేర్లు ఉంటాయి మరి. కాని ఉన్న ఆస్తినంతా పార్టీ కోసం ధారపోసి పార్లమెంటుకి కూడా సైకిలు మీద వెళ్ళిన ఆ మహనీయుల గత చరిత్ర తెలియని ఈ కుహనా రాజకీయ నాయకుడి అవివేకానికి జాలి పడ్డాను. వారి త్యాగాలముందు భవనాలకి వారి పేర్లు పెట్టటం అనేది అతి చిన్న విషయం.
 
 
ఈ మధ్యే పంచాయితీ ఎన్నికలు జరిగి  మన గ్రామానికి కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నియ్యారు. ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న పెద్ద సవాలు పంచాయితీ ఆదాయం మరియు ఆదాయ వనరులు పెంచుకోవటం. రోడ్లు లేవు, వీధి దీపాలు అసలే లేవు. మొత్తం మీద కష్టపడి 300 వీధి దీపాలు వెలిగించారు. మరి రోడ్లు ? అంత డబ్బు పంచాయితీ దగ్గర లేదు. అందరూ సరిగ్గా శిస్తులు కట్టినా ఆ డబ్బు నెలవారీ నిర్వహణ కి , ఖర్చులకి తప్ప రోడ్లు వేసేంత ఆదాయమైతె కాదు. ఈ మధ్య ఉపసర్పంచ్ గొర్రెపాటి సురేష్ మాట్లాడుతూ ఒక వినూత్నమైన ఆలోచన చెప్పారు. అంతర్గత రహదారులు ఎవరు వేయిస్తే ఆ రోడ్డుకి వారు సూచించిన పేర్లు పెడదాం అని. ఐడియా సూపర్ కదా అనిపించింది. ఇప్పటిదాకా మన గ్రామంలో భవనాలకి , సంస్థలకి, స్కూల్ భవనాలకి మాత్రమే దాతల పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. కొన్ని భవనాలకి వారు చేసిన సేవలకి గుర్తుగా గ్రామస్తుల ఏకాభిప్రాయంతో పెట్టిన పేర్లు కొన్ని ఉన్నాయి. దోనేపూడి సీతారామయ్య భవన్, గొట్టిపాటి బ్రహ్మ్మయ్య ఆడిటోరియం ఇలాంటివే. ఇక రోడ్లకి పేర్లు పెట్టటం అనేది కొత్త ఆలోచన. అభివృద్ధి కోసం నిస్వార్ధంగా వితరణ నిచ్చే దాతల గొప్ప మనసుల ముందు వారి తాతల పేర్లు పెట్టటం అనేది లెక్కలో లేని విషయం. ఈ అంశం మీద ఎవరైనా ఈకలు పీకితే అది వారి సంస్కారానికే వదిలేయటం మంచింది. ఇప్పుడున్నదంతా మనవళ్ళు , మనవరాళ్ళ హవా. తాత , అమ్మమ్మ , నాయనమ్మల మీద ఈ తరం మనవళ్ళు , మనవరాళ్ళు కురిపించిన ప్రేమ, అభిమానం , కృతజ్ఞతల గుర్తులు గ్రామంలో అడుగడుగునా మనకి ఎదురవుతాయి. లక్షలు విరాళం ఇచ్చి కనీసం తన పేరు కూడా ఎక్కడా ఉచ్చరించవద్దు అని, వేసిన శిలా ఫలకాన్ని కూడా తీయించేసిన అయినపూడి వెంకట్రామయ్య లాంటి అరుదైన వ్యక్తులు కూడా మన గ్రామం లోనే ఉన్నారు. 90 శాతం మంది తమ తల్లి దండ్రుల పేరిట కంటే తాతల పేరు మీదే విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు కడుతున్న రుద్రభూమి,ఆల్రెడీ కట్టేసిన కళ్యాణ మండపం, హైస్కూల్ భవనాలు, బోర్డింగ్ స్కూళ్ళు, జలధీశ్వరాలయమ్, ఇవన్నిట్లో చాలా మంది ఎన్నారైలు, వ్యాపారవేత్తలు వాళ్ళ పూర్వీకుల పేర్ల మీద ఇచ్చిన వితరణలే కన్పిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ, హైస్కూల్ ముందు 10 సంవత్సరాల క్రితం కొత్తగా ఒక గంట స్థంభం కట్టారు. ఏదో పనిమీద అటు వెళ్తూ లోపలకి వెళ్లి చూస్తే ఆ స్థంభం పైన ఇలా ఉంది "మాతా మహులు, వెంకట్రామయ్య జ్ఞాపకార్ధం అయినపూడి విజయ కుమార్" మాతామహులు అనేది నేను మొదటి సారి చూసిన పదం. అమ్మ తండ్రిని మాతా మహులు అంటారని అప్పుడే తెలిసింది నాకు.
 
 
పామర్రు కి చెందిన నా సహాధ్యాయి ఒకరోజు నేను ఊర్లో ఉండగా జలదీశ్వరాలయం చూడటానికి వచ్చాడు. ఈ గుళ్ళో దాతలు ఇచ్చిన డబ్బులకన్నా శిలా ఫలకాల మీద పేర్లే ఎక్కువ ఉన్నాయిగా అన్నాడు. ఇదే విషయం నేను గొర్రెపాటి రామకృష్ణ గారితో అంటే ఆయనొక చక్కటి సమాధానం చెప్పారు. పేర్లు అనేవి ఇచ్చిన వారి గొప్ప కోసమో లేక వాళ్ళు వెయ్యమంటే వేసినవి కాదు. ఈ పేర్లన్నీ చూసి మరికొందరు స్ఫూర్తి పొంది వారు కూడా సహాయ పడతారనే ఉద్దేశ్యమే తప్ప మరోటి లేదు అని. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ల విషయంలో కూడా ఇదే పధ్ధతి అవలంబిస్తే మన గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వమే అవసరం లేదు. మరిన్ని గ్రామాలకి మనమే స్ఫూర్తిగా నిలుస్తాం. దాతల విరాళాలని సక్రమంగా వినియోగించే నిస్వార్ధ సేవకులకు గ్రామంలో కొదవే లేదు. వాళ్ళు ఉండబట్టే ప్రస్తుత అభివృద్దిని మనం చూడగలిగాం. కొత్త హంగులకోసం, నూతన నామకరణ మహోత్సవాలకి మన రోడ్లన్నీ ఎదురు చూస్తున్నాయి. ఇక మీదే ఆలస్యం మరి. 
 
 
Dated : 28.08.2013
 

This text will be replaced