డాక్టర్ యార్లగడ్డ యుధిష్టరనీడుBack to list

 

డాక్టర్ యార్లగడ్డ యుధిష్టరనీడు 

ప్రముఖ వైద్యులు, మన రాష్ట్రంలో తోలి హార్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ గా రికార్డు నెలకొల్పిన డాక్టర్ యార్లగడ్డ యుధిష్టర నీడు 17.01.2013 న కన్నుమూశారు. అయన వయస్సు 83 సంవత్సరాలు.భార్య నిర్మలా దేవి రెండు సంవత్సరాల క్రితమే కాలం చేసారు. ఈయనకి ముగ్గురు కుమార్తెలు,ఒక కుమారుడు.
 
 
12.07.1930 న యార్లగడ్డ అంకినీడు,వెంకట రత్నమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించారు.తండ్రి అంకినీడు లాయర్. చల్లపల్లి రాజా గారికి బంధువులు. మనగ్రామానికి చెందిన కొండపల్లి చిట్టియ్య  గారి రెండవ కుమార్తె ని వివాహమాడటం ద్వారా ఈయన మన గ్రామం లో స్థిరపడ్డారు.గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారికి తోడల్లుడు.(చిట్టియ్య గారి మొదటి కుమార్తె ని బ్రహ్మ్మయ్య గారు వివాహం చేసుకున్నారు) భారతం లో ధర్మరాజు కి మారు పేరయిన  యుధిష్టర నామాన్ని కొడుక్కి పెట్టుకున్నా, అదే భారతాన్ని వ్యతిరేకించేవారు అంకినీడు.గీరతం పేరుతో  భారతాన్ని ఆంగ్లం లో వ్యంగ్య రచన చేయటానికి కూడా పూనుకొన్నారు.కాని తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించారు. యుధిష్టర నీడు గారికి ఇద్దరు తోబుట్టువులు. అక్క యశోధరా దేవి,తమ్ముడు రాజబాబు.అక్క స్ఫూర్తి తోనే తానూ డాక్టర్ కావాలని, చేస్తున్న ఉద్యోగం మానేసి మద్రాసు కాలేజిలో మెడిసిన్ చదివారు.1976 లో తొలిసారి హార్ట్ సర్జరీ చేయటం ద్వారా రాష్ట్రంలో పతాక శీర్షికల కెక్కారు. తదనంతర కాలం లో ఈయన చొరవతోనే అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు 25 లక్షల విలువైన హృదయ సంభందిత పరికరాలని ప్రభుత్వ ఆసుపత్రి లో మంజూరు చేసారు. 1980 వ దశకం లో హైదరాబాదు గాంధి హాస్పిటల్ సూపర్నెంట్ గా విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో మాత్రమే అవినీతి రహితమైన ఆసుపత్రి గా గాంధీ హాస్పిటల్ నిలిచింది. ఉద్యోగులు ఆసుపత్రిని సరిగా శుభ్రం చేయటం లేదని, తానే ఆ పని చేసి వారికి కనువిప్పు కలిగించారు. మరుసటి రోజున ఆ ఘటన ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలలో రావటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పదవీ విరమణ అనంతరం 1990 లో 6 నెలలపాటు గ్రామంలో తన సేవలని అందించారు.ప్రభుత్వ వైద్యుని గా సేవలందిస్తున్న రోజుల్లో నీతి,నిజాయితీలకి మారుపేరుగా నిలిచారు.ప్రైవేటు ప్రాక్టీసు అనేది చెయ్యకుండా,ఇంటికి వచ్చిన రోగులకి సైతం ప్రభుత్వ డాక్టర్ గానే తన సేవలని అందించారు.గ్రామం విషయానికి వస్తే అప్పటికి కేవలం 50 శాతమే పూర్తయిన మంచినీటి పధకాన్ని గ్రామం మొత్తానికి విస్తరించటానికి కారకులు యుధిష్టర నీడు గారు. అప్పట్లో ప్రభుత్వ విభాగం లో ఉన్న ఓ అధికారి ఆయనకి పేషంట్. ఆయనకి స్వస్థత చేకూరిన తర్వాత డాక్టర్ గారికి కృతజ్ఞతాభావం తో ఏదైనా చెయ్యాలనుకునపుడు ఆయన కోరిన కోరిక గ్రామంలో మంచినీటి సౌకర్యం విస్తరణ. అడిగిందే తడవుగా ఆ అధికారి ఆఘమేఘాలమీద నిధులు మంజూరు చేసి ఆ పని పూర్తి చేశారు.గాంధీ హాస్పిటల్ లో పనిచేస్తున్నపుడు రోడా మిస్త్రీ అనే ఒక మహిళా మంత్రిని సాధారణ రోగిలాగా లైన్ లో రమ్మని చెప్పిన ధీశాలి. ఆ సంఘటన తో అహం అడ్డొచ్చిన సదరు మంత్రి ఆయన్ని కర్నూల్ కి ట్రాన్స్ ఫర్ చేయించారు.అయితే తాను చేసిన తప్పేమిటో చెప్పాలంటూ అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కి ఉత్తరం రాయటం తో ఒత్తిడి మేరకి ఆయన బదిలీని నిలిపివేశారు. పేషంట్ల కి రక్తం అవసరమైన పలు సందర్భాల్లో ఆయనే స్వయం గా రక్తదానం చేసిన సందర్భాలు కోకొల్లలు.అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా ఆయన్ని గౌరవించి రోటరీ క్లబ్ ఆయన్ని బంగారు పతకంతో సత్కరించింది. తాను నవ్వకుండా ఎదుటివాళ్ళని నవ్వించగల చతురత ఆయన సొంతం. చిన్నతనం నుండీ ఆయనతో అనుభంధం పెనవేసుకున్న వేమూరి విశ్వేశ్వరరావు గారు పలు సందర్భాల్లో ఆయన వ్యక్తిత్వం గురించి, తమ మధ్య జరిగిన అపురూప సంఘటనలని నెమరు వేసుకునేవారు. ఆయన కోరిక మీదటే 2 సంవత్సరాల క్రితం విజయా కాన్వెంటు కి అతిధిగా గొర్రెపాటి రంగనాధబాబు గారు స్వయం గా ఆయన్ని తీసుకు వచ్చారు.ఇదే ఆయన మన గ్రామాన్ని సందర్శించిన ఆఖరు సందర్భం. పదవీ విరమణ అనంతరం కొన్నాళ్ళు గ్రామం లో ఉన్న తరువాత విశాఖపట్నం లో ఉన్న రీజెన్సీ సిరామిక్స్ లో డాక్టర్ గా సేవలందించాలని ఆ సంస్థ కోరటం తో కొన్ని సంవత్సరాలు అక్కడ పని చేశారు.ఆ కాలంలోనే అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. తాను ఇంకొక గంటలో మరణిస్తాను అని తన వాళ్ళకి తానే చెప్పి,ఇంకేమన్నా ఉంటె మాట్లాడుకోండి అన్న ఆ వ్యక్తి సరిగ్గా గంట తర్వాత ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు.ఒక డాక్టర్ గా తన మరణాన్ని తానే చెప్పగలిగిన వైద్య శాలి డాక్టర్ యుధిష్టర నీడు గారు. హైస్కూల్ లో పలు సౌకర్యాల కోసం తన తండ్రి పేరిట నిధులు ఇచ్చారు.గత 10 సంవత్సరాలుగా ఈయన పేరు మీద హైస్కూల్ లో మెరిట్ విద్యార్ధులకి ఒక అవార్డు ఇవ్వటం జరుగుతోంది. ఇటీవల కాలం లో వీరి పేరిట జలధీశ్వరాలయం లో వీరి కుమారుడు శాలివాహన చక్రవర్తి ఒక వాహనశాలని నిర్మించారు.
 
 
ఈ రాష్ట్రం లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తొలి డాక్టర్ మన గ్రామానికి చెందిన వ్యక్తి అని ఇప్పటిదాకా మన ఎవరికీ తెలియదు. ఆయన మరణానంతరం ప్రముఖ దినపత్రిక హిందూ లో ఆ విషయాన్ని ప్రచురించారు. పెద్ద కర్మ ఈ నెల 27 న విశాఖపట్నం లో ఆయన స్వగృహం లో జరగనుంది.
 

ఆయన కుమారుడు చక్రవర్తి నెంబర్ : +919840052237
 
Dated : 19.01.2013
 
 

 

This text will be replaced