తరాంతరంBack to list

తరాంతరం

చాలా సందర్భాల్లో మనకంటే పెద్దవాళ్ళ దగ్గర తరచూ కొన్ని మాటలు వింటుంటాం.మా కాలంలో అయితేనా ఇలా ఉండేవాళ్ళం కాదు.అప్పుడు ఇన్ని తెలివితేటలు ఎక్కడ ఏడ్చాయి మాకు.ఆ పిచ్చి రోజుల్లో అదే గొప్ప. ఒకప్పుడు ఇలాంటి మాటలు అనేవాళ్ళకి అవి వినేవాళ్ళకి మధ్య వయసు వ్యత్యాసం 20 సంవత్సరాలు ఉండేది.అంటే ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య అంత కాల దూరం అన్నమాట. ఇప్పుడు కూడా అలాంటి మాటలు వినబడుతున్నాయి,కాని ఆ అనేవాళ్ళకి అవి వినేవాళ్ళకి మధ్య వ్యత్యాసం కేవలం మూడు  సంవత్సరాలు.కాలం ఎంత వేగంగా మారిపోతోంది అనేదానికి ఉదాహరణలెన్నో మన దైనందిన జీవితం సునిశితంగా గమనిస్తే మనకి అవగతమవుతాయి.ఒకప్పుడు తండ్రికి కి కొడుక్కి మధ్య ఉండే తరాంతరాలు,ఇప్పుడు అన్నకి తమ్ముడికి మధ్యనే కనిపిస్తున్నాయి. పాతికేళ్ళు నిండని వాళ్ళు కూడా 20 ఏళ్ల కుర్రవాడిని చూసి జనరేషన్ గ్యాప్ అని నిట్టూరుస్తున్నారు. కొన్ని ఇప్పుడు అతి తెలివితేటలుగా అనిపించినా కొంతకాలానికి వాటినే తెలివితేటలు అనుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. చిన్నప్పుడు మనకి తర్కాన్ని,నీతిని భోధించిన పంచతంత్ర కధలు, ఈ కాలం యువత అడిగే లాజిక్ ముందు ఒక్కసారి ఆలోచనలోకి నేట్టేస్తున్నాయి.సామాజిక సంభంధాల వెబ్సైట్ లు వచ్చాక ప్రత్యక్ష సంభంధాలు తగ్గిపోయి ఇద్దరి వ్యక్తుల మధ్య భావ వ్యక్తీకరణ అనేది మాటల్ని మర్చిపోయి పొడి పొడి అక్షరాల్లో కుదించుకుపోయిందని చాలా మంది బాధపడిపోతున్నారు. కాని సరిగ్గా ఆ మాధ్యమాన్ని వినియోగించుకుంటే మారుతున్న కాలాన్ని, ఆలోచనలని, ఒడిసిపట్టుకోవటం ఎంత తేలికో అర్ధం అవుతుంది.అనాదిగా మనం వింటున్న సామెతలకి ఇచ్చే కొనసాగింపులు ఒక్కోసారి ఆ సామెత తప్పేమో అని ఆలోచించేలా చేస్తాయి.మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి.కొన్ని మాత్రం అవును నిజమే కదా అనిపిస్తాయి.

ఇదంతా యువతరం ఆలోచనల్లో రూపుదిద్దుకునేవే. ప్రపంచం మనల్ని వదిలేసి ముందుకు పరిగెత్తుతుందేమో అనే భయం ఒకప్పుడు నలభై ఏళ్ళు దాటాకే మనిషి మదిలోకి వచ్చేది.కాని ఇప్పుడు పాతికేళ్ళ కే ఆ అభద్రతా భావం వెంటాడుతోంది.మనల్ని మనం గిల్లుకుని అప్ డేట్ అవుతున్నామా ఈ కాలంతో? అని రోజూ చూసుకోవాల్సిన పరిస్ధితి.ఎదుటివాడి అతి తెలివితేటల నుంచి కూడా మన తెలివితేటల్ని పెంచుకోవచ్చు.కాకపొతే వాటిని ఆస్వాదిస్తూ అందులో తర్కాన్ని గమనిస్తే మనం ఎప్పుడూ విజేతలమే.

 

Dated : 22.12.2012

 

 

This text will be replaced