నిర్జనవారధి - IBack to list

 

 
నిర్జనవారధి - I
 
నాకు కొంచెం పుస్తకాల పిచ్చి ఎక్కువే. ఆత్మ కధలైతే ఆపకుండా చదివేస్తాను. ఆ ఆత్మ కధలు ఉద్యమాల నేపధ్యం అయితే అది నాకు మృష్టాన్న భోజనమే. ఈ మధ్య ఇంటర్నెట్లో ఈ - బుక్స్ రావటంతో నా పని మరింత సులువైంది. ప్రస్తుతం మావోయిస్టులు అనబడుతున్న వాళ్ళు ఒకప్పుడు నక్సలైట్లు గా పిలవబడేవారు. మన గ్రామంలో మేము 8,9 తరగతి చదివే రోజుల్లో హైస్కూల్ లో చదువుకునే విద్యార్ధులంతా పొద్దున, సాయంత్రం ప్రైవేటుకి వెళ్ళేవారు. సీతారామక్రిష్ణ గారు , శాస్త్రులు గారు ఫేమస్ ట్యూషన్ మాస్టర్లు. నక్సలైట్ ట్యూషన్ అని ఒకటి ఉండేది. అంటే ఆ ట్యూషన్ చెప్పే మాస్టారు ఒకప్పుడు నక్సలైట్ గా పనిచేసాడని చెప్పుకునేవారు. అలా ఆ పదం మొదటిసారి విన్నాను. అప్పట్లో T.V చానెల్స్ లేవు కాబట్టి న్యూస్ పేపర్స్ లోనే "నక్సలైట్ల పంజా" అని "పీపుల్స్ వార్ దాడి" అని తరచూ చదువుతూ ఉండేవాడిని. తరువాత పీపుల్స్ వార్ రూపకర్త కొండపల్లి సీతారామయ్య గురించి, ఆయన ప్రారంభించిన నక్సల్బరి ఉద్యమ నేపధ్యం గురించి తెలుసుకున్నాక మరింత ఆశ్చర్యం కలిగింది. సహజంగానే ఆ ఇంటి పేరు గలిగిన వాళ్ళు మన గ్రామంలో ఉండటంతో ఆయన్ని మన ప్రాంతానికే చెందిన కమ్మ సామాజిక వర్గానికి వ్యక్తిగా అపోహ పడ్డాను. తరువాత కొద్దికాలానికి మన గ్రామం లోనే అదే ఇంటిపేరుగలాయన దగ్గర ఏదో చర్చల సంధర్భంలో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలుసుకున్నాను. తెలంగాణాలో రెడ్ల మీద, దొరల మీద, సాయుధ పోరాటం సాగించటానికి రూపుదిద్దుకున్న ఓ ఉద్యమ సిద్ధాంత కర్త, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కావటం వింత కాక మరేమిటి.
 
 
నాకు తెలిసిన కధ అంతవరకే అప్పటికి. తరువాత చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వారి వ్రద్దాశ్రమం లో కొండపల్లి సీతారామయ్య గారి భార్య నివసిస్తుంది అని ఎక్కడో చదివినట్లు గుర్తు. కానీ ఆవిడ గురించి అంతకుమించి మరేమీ తెలియదు. ఉద్యమంలోనో లేక సహజంగానో సీతారామయ్య నిష్క్రమణంతో ఆవిడ అక్కడ ఉంటుందేమో అనే భావనలోనే ఉన్నాను. పార్టీ కోసం, ఉద్యమాల కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న త్యాగధనులున్న కమ్యూనిష్టు పార్టీకి చెందిన భార్యాభర్తలు కావటంతో వీరు కూడా అదే త్యాగాలతో, వారసులు లేక ఆవిడ శేష జీవితాన్ని అలా గడుపుతోందేమో అనుకున్నాను. ఒక వారం క్రితం ABN చానెల్ లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం వస్తోంది. ఆ పుస్తకం పేరు నిర్జన వారధి. తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న CPM మహిళా నేత మల్లు స్వరాజ్యం ఆవేశంగా ప్రసంగిస్తూ ఈ పుస్తకం చదువుతున్నంత సేపు కొండపల్లి సీతారామయ్యని తుపాకి మడమ తిప్పి కొట్టాలనిపించింది అన్నారు. చూస్తున్న నాకు అసలు ఏమి అర్ధం కాలేదు. అప్పటిదాకా సీతారామయ్య గురించి మంచి గాని చెడుకాని ఎక్కడా చదవలేదు వినలేదు. పైగా ఈ పుస్తకం వారి సతీమణి రాసిన ఆత్మ కధ. అప్పటికే ఆ పుస్తకం చదవాలన్న కోరిక మొదలైతే, ఆ కోరికకి ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని జోడించాయి. కొన్నాళ్లుగా నాకు పుస్తక సాన్నిహిత్యాన్ని అందిస్తున్న www.kinige.com లోకి చొరబడ్డాను. అప్పటికే ఆ పుస్తకం అక్కడ అందుబాటులో ఉంది. కినిగే వ్యవస్థాపకులు చావా కిరణ్, సోమశేఖర్ గార్లకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంటూ పుస్తకం చదవటం ప్రారంభించాను. మూడు తరాలకు వారధి అయినా ఒంటరిగా మిగిలిపోయిన కోటేశ్వరమ్మగారి స్వీయకథ చదువుతుంటే విషాదం పెళ్ళుకువచ్చేమాట నిజమే అయినా, ఆమె మీద కల్గేది జాలి, సానుభూతి మాత్రమే కాదు, ఆమె సాహసప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత, ఆత్మాభిమానాల పట్ల ఆరాధనాభావం. కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజజీవితంలో ఇంత విషాదమూ, ఇంత ధైర్యమూ ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు.
 
                                  కోటేశ్వరమ్మ కృష్ణా జిల్లా పామర్రులో 1920లో పుట్టారు. నాలుగైదేళ్ళ వయస్సులో మేనమామతో పెళ్ళైంది. పెళ్ళైన రెండేళ్ళలోపునే భర్త మరణించాడు. ఏడేళ్ళ వయసులో వితంతువు. తర్వాత చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొనటం, సంప్రదాయాలకు, ఊళ్లోవారి మనోభావాలకు వ్యతిరేకంగా పునర్వివాహం. కమ్యూనిస్టు భావజాలంతో ఉత్తేజితుడై, దీక్షగా కార్యకర్తగా పనిచేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో మమేకమై తాను కూడా పార్టీ కార్యకర్తగా, సాంస్కృతిక ప్రదర్శకురాలిగా ఎదగటం, జైలుపాలవడం, పార్టీ నిషేధంలో ఉన్నప్పుడు, బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరీ, నాగపూర్, రాయచూర్, గోంధియాలలో భర్తకూ, పిల్లలకూ దూరంగా అజ్ఞాతంగా రహస్య జీవనం సాగిస్తూ పార్టీకి సహాయపడటం, నిషేధం తర్వాత పార్టీ కార్యకర్తగా ఊరూరూ తిరగడం.

ఇంతా చేశాక, ఏదో కారణంతో సీతారామయ్య ఆమెను విడచి, వేరే ఊరు (వరంగల్) వెళ్ళి అక్కడ వేరే ఆమెతో ఉండటం ప్రారంభించాడు. ఫిల్లలిద్దర్నీ తనదగ్గరే ఉంచుకున్నాడు. హైస్కూల్‌చదువు కూడా లేని ముప్పై ఐదేళ్ళ కోటేశ్వరమ్మకు ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. నిషేధకాలంలో కమ్యూనిస్టుపార్టీ అవసరాలకోసం అమ్మిన నగల విలువను పార్టీ ఆమెకు తిరిగి ఇవ్వబోతే, సీతారామయ్య ఆమెను తీసుకోనివ్వలేదు. ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో తన కాళ్ళపై తాను నిలబడడానికి నిశ్చయించుకొని, ఆ వయసులో ఆమె హైదరాబాదు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదవడానికి చేరింది. ప్రభుత్వం వారిచ్చిన స్టైపెండ్ ఫీజులకు సరిపోతే, రేడియో నాటకాలలోనూ, కార్యక్రమాలలోనూ పాల్గొంటూ, కథలు వ్రాస్తూ సంపాదించుకున్న కొద్ది డబ్బు మాత్రం స్వంత ఖర్చులకు సరి పెట్టుకునేవారు. పరీక్షలు వ్రాసి మెట్రిక్ పాసయ్యారు. ఇంకా చదవటానికి వీలుకాక, కాకినాడ గవర్నమెంట్ పాలీటెక్నిక్ కాలేజ్ గరల్స్ హాస్టల్లో మేట్రన్ ఉద్యోగంలో చేరారు. కాకినాడలో సాహిత్య సభలలో పాల్గొంటూ రచనావ్యాసంగం చేయటం మొదలుబెట్టారు.వరంగల్ మెడికల్ కాలేజ్‌లో చేరిన కుమార్తె కరుణ, ఆమె సహాధ్యాయి కావూరి రమేష్ బాబు వివాహం చేసుకున్నారు. కోటేశ్వరమ్మగారి సమ్మతితోనే ఈ వివాహం జరిగినా, వరంగల్‌లో జరిగిన ఆ వివాహానికి ఆమెకు ఆహ్వానం రాలేదు. ఆమె వెళ్ళలేదు.
 
 
కొండపల్లి సీతారామయ్య నక్సలైటు ఉద్యమానికి నాయకుడయ్యాడు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్న కుమారుడు చందు (కొండపల్లి చంద్రశేఖర్ ఆజాద్) విప్లవోద్యమంలో చేరాడు. గుత్తికొండ బిలంలో చారుమజుందార్‌తో సమావేశానికి హాజరైనవారిలో కె.జి.సత్యమూర్తితో పాటు చందు కూడా ఉన్నాడు. తండ్రిని వ్యక్తిగా గౌరవించకపోయినా, ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు గౌరవించాడు చందు. పార్వతీపురం కుట్రకేసులో కొంతకాలం జైల్లో ఉన్న చందు ఒకరోజున మాయమయ్యాడు. కొన్నేళ్ళ తర్వాత ఎవరో పోలీసులు వచ్చి చందు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆ కబుర్లో నిజమెంతో ఆవిడకు తెలీదు. కుమారుడి శవాన్ని కూడా కోటేశ్వరమ్మ చూడలేకపోయింది. కుట్రకేసులో బెయిల్లో ఉన్నప్పుడు విజయవాడలోతమతో గడపిన ఒక్క సంవత్సరమే ఆమె “చందు నుంచి అందుకున్న సంతోష సంపద”. కరుణ, రమేష్‌బాబు ఢిల్లీలో ఉద్యోగంతోపాటు తాము స్థాపించిన ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా తెలుగువారికి సహాయం, తెలుగు సాహిత్యానికి సేవ కూడా చేస్తూ ఉండేవారు. గురజాడమీద మంచి సావెనీర్ ప్రచురించిన డాక్టర్ రమేష్ బాబు, గిడుగు రామ్మూర్తిపై ఇంకో సావెనీరుకు వివరాలు సేకరించటానికి తిరుగుతూ విజయవాడ వచ్చి వడదెబ్బతో ఆకస్మికంగా మరణించాడు. ఆ మానసిక విఘాతాన్నుంచి కోరుకోలేకపోయిన కుమార్తె డాక్టర్ కరుణ కొన్నేళ్ళ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. “పేదరికంలో ఉన్న రోగులను ఆదుకుంటూ సంఘమిత్రగా జీవిస్తుందనుకున్న కరుణ, చెడును వేలుబెట్టి చూపుతూ తర్జని కథలు రాస్తూ బ్రతుకుతుందనుకున్న కరుణ, తండ్రిలేని తన పిల్లలకు తల్లిని కూడా లేకుండా చేసి వెళ్ళిపోయింది”.చిన్నప్పట్నుంచీ కోటేశ్వరమ్మకి బాసటగా నిలచిన తల్లి అంజమ్మ కూడా కరుణ కన్నా ముందే మరణించారు. కోటేశ్వరమ్మ ఒంటరిగా మిగిలింది. ఈలోపు సీతారామయ్య నిర్మించిన పీపుల్స్‌వార్ పార్టీ ఆయననే బయటకు నెట్టింది. ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది. 36 ఏళ్ల క్రితం ఒక రాత్రి తనని విడిచి వెళ్ళిపోయిన సీతారామయ్య తాను అవసాన దశలో ఉన్నపుడు భార్యని చూడాలని ఉండదని కబురు చేశాడు. బంధువెవరో వచ్చి, “సీతారామయ్యగార్కి నిన్ను చూడాలని ఉందట. తీసుకువెడతాను, వస్తావా” అని అడిగితే, “ఆయనకు చూడాలని ఉంటే.. నాకు ఆయన్ని చూడాలని ఉండొద్దా?.. లేదుగాబట్టి రాలేను” అని జవాబిచ్చింది కోటేశ్వరమ్మ.
 
నా అనుభూతిని పంచుకోవటానికి ఈ చోటు చాలదు, తరువాయి భాగం వచ్చేవారం.
 
Dated : 06.10.2012
 

 

This text will be replaced