మాసిపోతున్న జ్ఞాపకాలుBack to list

 

మాసిపోతున్న జ్ఞాపకాలు

 

‘‘రాజు మరణించే ఒక తార రాలిపోయే.. కవి మరణించే ఒక తార గగణమెక్కే... రాజు జీవించే రాతి విగ్రహములందు.. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’’ చిన్నపుడేపుడో చదువుకున్న గుర్రం జాషువా రాసిన పద్యం. ఇలా రాసిన కవి కూడా తదనంతర కాలంలో టాంక్ బండ్ మీద రాతి విగ్రహం రూపంలోనే కొలువుదీరాడు. పాపం ఆయనకి రాసినపుడు తెలియదు, ముందు తరాల వారికి తన విగ్రహాన్ని చూపిస్తే తప్ప తానెవరో తెలియదు అని. అప్పుడు కవి ప్రాముఖ్యం అలాంటిది.ఇప్పుడు రాజులే కాదు కవులు, మేధావులు , ఉద్యమ కారులు, ఆధునిక సమాజ స్థాపనకి నడుము కట్టిన దార్శనికులు, విగ్రహాల రూపంలో తప్ప ప్రజల నాలుకల మీద నిలిచి ఉంటారనుకోవటం మన భ్రమ. నేను సికిందరాబాదు లో చదువుకునే రోజుల్లో ఓ చల్లని సాయంకాలం టాంక్ బండ్ మీద నాకెదురైన అనుభవం ఇది. టాంక్ బండ్ మొదట్లోనే బస్సు దిగి మిత్రులతో కలిసి చివరికంటా నడవటం అలవాటు. ఓ రోజు ఒక పదేళ్ళ పిల్ల వాడిని వెంటబెట్టుకుని ఓ తండ్రి టాంక్ బండ్ పై ఒక్కో విగ్రహాన్ని చూపిస్తూ వారి గురించి వివరిస్తూ వెళుతున్నాడు. 36 విగ్రహాల గురించి చెప్పటం పూర్తయ్యాక ఆ తండ్రి హాయిగా నిట్టూర్చాడు. ఏదో సంతృప్తి ఆ కళ్ళలో. ఆ విగ్రహాలే లేకపోతే రేపు పెద్దయ్యాక ఆ మహనీయుల త్యాగాల విలువ, మన అనుభవిస్తున్న ఈ అభివృద్ధి ఫలాలు ఎవరి పుణ్యమో తెలియని అవగాహనా లేమితో తన కొడుకు ఉండకూడదన్నది ఆ తండ్రి ఆశయం కాబోలు. కానీ ఆ ఆశయానికి వెన్నుదన్నుగా నిలిచింది ఆ విగ్రహాలే. మన గ్రామం లో చాలామంది రాష్ట్ర,జాతీయ నాయకుల విగ్రహాలున్నాయి.స్మారక స్తూపాలు ఉన్నాయి. అందరూ మహానుభావులే అందరికీ వందనాలు.
ఈ రాష్ట్రానికి తొలి శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి మన గ్రామస్తుడని ఇప్పటి వాళ్లకి తెలుసా? రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షుడుగా పనిచేశారని తెలుసా? జాతీయోద్యమం లో బ్రిటిష్ వాళ్ళకి నల్ల జెండాలు చూపించి అరెస్ట్ అయ్యారని తెలుసా? బందరులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి  పెట్టిన పేరు మన ఊరి వ్యక్తిదని తెలుసా? మహాత్మా గాంధీని మన గ్రామానికి తీసుకువచ్చి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి మన గ్రామస్తుడని తెలుసా? అలాంటి వ్యక్తి స్థూపం లో ఫోటో మాసిపోయి ఏళ్ళు గడుస్తున్న పట్టించుకోలేని స్థితి మనది. మరణించిన మహనీయులని వారి వారసులు ఉంటే తప్ప మామూలు జనం పట్టించుకోని స్థితికి మనం ఎప్పుడో చేరుకున్నాం.
గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారికి మన గ్రామం లో పుట్టిన ప్రతి ఒక్కరూ వారసులే. పార్టీలకి అతీతం గా మనందరం స్మరించుకోవాల్సిన అరుదైన వ్యక్తి మన గొట్టిపాటి. దురదృష్ట వశాత్తు వ్యక్తుల్ని పార్టీలు భుజాన వేసుకోవటం వల్ల వారి ప్రతిష్ట మసకబారుతోంది అనేది నా అభిప్రాయం. మన ఊరికి సంభంధం లేకపోయినా జాతీయ స్థాయి నాయకులని మనం గౌరవించుకుంటాం, విగ్రహాలు పెడతాం, వాటిని పరిరక్షిస్తాం. దానికేమన్నా అయితే ఆందోళనలు ఆవేశాలతో తెగబడతాం. అభిమానం మంచిదే, జాతీయ భావన మంచిదే. కానీ మన కీర్తిని ఇనుమడింప చేసిన మన గ్రామ ముద్దుబిడ్డల పట్ల ఎందుకు అలా ఉండలేకపోతున్నాం. స్మారక స్థూపం శిధిలమైనా , ఫోటోలు మాసిపోయి ఏళ్ళు గడుస్తున్నా ఆ దారంటే రోజూ నడుస్తున్నా ఎందుకు పట్టించుకోము? జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మన వాళ్ల గురించి మనపిల్లలకి రేపు ఏం  చెపుతాం.ఏం చూపిస్తాం. వారికి పార్టీల రంగు పులిమేసి మనవాడు కాదు అనుకున్నామంటే అంత కన్నా అమాయకత్వం మరొకటి లేదు. వారసులు శ్రద్ధ తీసుకోవటం వల్ల ఒక్క కిసాన్ వెంకట సుబ్బయ్య గారి విగ్రహం మాత్రమే మన గ్రామం లో సరైన ఆలనా పాలన కి నోచుకుంది, గౌరవాన్ని పొందింది. వారు లేకపోతే ఆయన కూడా ఇలాగే మరుగున పడిపోయేవారు.
బ్రహ్మ్మయ్య గారితో పాటు పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య , దోనేపూడి సీతారామయ్య ఈ నిర్లక్ష్యానికి గురైన ప్రముఖులు. పార్టీలకతీతంగా మన గ్రామ ప్రతిష్ట ని దిగంతాలకి వ్యాపింప చేసిన వారికి మనం కాదా వారసులం? మనకి లేదా భాద్యత? ఏమిటయ్యా ఎప్పుడూ ఈ నేతులు తాగిన మన తాతల కధలు చెప్పుకోవటమేనా..ఇంకేమీ చరిత్ర లేదా అని విసుక్కుంటున్న వాళ్లకి అప్పుడు సమాధానం చెప్పలేకపోయినా ఈ ఆర్టికల్ సమాధానం చెపుతుందని నమ్ముతున్నాను. తాతలు లేనిదే మనం లేము. మన అస్తిత్వం లేదు. ఇప్పుడు వాళ్ల అస్తిత్వానికే మనం సమాధి కట్టేస్తున్నాం. మేలుకుందాం, మన వారసులకి మన మూలాల్ని తెలియజేద్దాం.మనం అనుభవిస్తున్న వారి కృషీ ఫలాలకి మనం ఇచ్చే ప్రతిఫలం వారి జ్ఞాపకాల్ని కాపాడుకోవటం...ఇదంతా చదివాక మీకు నేను కాంగ్రెస్ వాది ననే అనుమానం రావచ్చు.

బాటమ్ లైన్ : నేను కాంగ్రెస్ వాదిని కాదు.
 
Dated : 18.08.2012
 

 

This text will be replaced