నందన కరువుకి 180 ఏళ్ళుBack to list

నందన కరువుకి 180 ఏళ్ళు

ప్రతి సంవత్సరం ఉగాది రాగానే వేపచెట్ల వెంట వేపపువ్వు కోసం పరిగెత్తే వాళ్ళం.ఆ పచ్చడి తిన్నాక కానీ ఇంకేది తినకూడదు అని,అది అయ్యేదాకా ఏమి తినకుండా ఉండేవాళ్ళం.స్కూల్లో తెలుగు మాస్టారు తెలుగు నెలల గురించి తెలుగు సంవత్సరాల గురించి వల్లె వేయిస్తుంటే,ఒకరి కంటే ఒకరు పెద్ద గొంతుతో అరిచేవాళ్ళమే కానీ వాటి అర్ధం, పరమార్ధం, బోధపడే వయసు అది కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు.అసలు తెలుగే కనుమరుగైంది ఏ మధ్య స్కూల్స్ లో.ఇక తెలుగు సంవత్సరాల గురించి పిల్లలకేం తెలుస్తుంది.శాటిలైట్ చానెల్స్ వచ్చాక ఉగాది రోజున ఏ చానెల్ పెట్టినా పంచాంగ శ్రవణం వినిపించేది.అసలు ఎందుకు ఈ సంవత్సరాలకి ఇలాంటి పేర్లు ఉంటాయ అని ఆలోచన అప్పుడు మొదలైంది. చిన్నప్పుడు మాస్టారు చెప్పిన సంవత్సరాల పేర్లు జ్ఞాపకాల పొరల్లోనుంచి చీల్చుకుని బయటకి రావటం మొదలయ్యాయి.తెలుగు సంవత్సరాలు 60 , తెలుగు నెలలు పన్నెండు ఉంటాయి అని ఇప్పటి తరం లో  చాలామందికి తెలీదు.పాతికేళ్ళు వచ్చేదాకా నాకూడా తెలియదు అనుకోండి.ఈ మధ్య అమెరికా లో వచ్చే తుఫాన్లకి హరికేన్ అని కత్రినా అని రకరకాల పేర్లు పెట్టటం చూసి మన వాళ్ళు కూడా అదే సంప్రదాయాన్ని మొదలు పెట్టారు.కానీ ఆ పేర్లు ఎవరు పెడుతున్నారో దానికి ప్రామాణికత ఏమిటో నాకు అర్ధం కాలేదు.అమెరికా ని చూసి మన వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని దిగుమతి చేసుకున్నారంటే మనం పప్పులో కాలేసినట్లే.కొన్ని వందల ఏళ్ల క్రితమే తెలుగు వారు ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.అది కూడా సరైన ప్రామాణికత తో.ఇది నందన నామ సంవత్సరం అని తెలియగానే ఏదో గుర్తు వచ్చినట్లు అయ్యి పాత పుస్తకాల్ని ఒకసారి తిరగేశాను.నందన కరువు అని ఎక్కడో చదివినట్లు గుర్తు.ఏదైనా  సంవత్సరం కరువు కాటకాలు వస్తే వాటిని ఆ సంవత్సరపు పేర్లతో పిలవటం అనే సాంప్రదాయం కొన్ని వందల ఏళ్ల కిందటే మన వాళ్ళు మొదలు పెట్టారు.

1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు భీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు . అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.

తెలుగు సంవత్సరాలు ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి మళ్లీ చక్ర భ్రమణం పొందుతాయి.ఆ ప్రకారం చూసుకుంటే నందన కరువు కి ఈ ఉగాదితో 180 ఏళ్ళు నిండుతాయి.ఆ తరువాత 1878 లో ధాతనామ సంవత్సరం లో వచ్చిన కరువు ని దాత కరువు అని,1722 లో వచ్చిన వరదలకి చిత్రభాను సంవత్సరపు వరదలు అని నామకరణం చేశారు.

తెలుగు సంవత్సరాలు 

1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాధి
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్థివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోథి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృత్తు
37. శోభకృత్తు
38. క్రోథి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృత్తు
46. పరీధావి
47. ప్రమాదిచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాళయుక్తి
53. సిద్ధార్థి
54. రౌద్రి
55. దుర్ముఖి
56. దుందుభి,
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
 
Dated : 23.03.2012
 

This text will be replaced