శ్రీ దోనేపూడి సీతారామయ్యBack to list

మన ఊరి ప్రముఖులు

శ్రీ దోనేపూడి సీతారామయ్య

 కొంతమంది వ్యక్తులు తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ముద్ర వేస్తుంటారు. తాము ఎంచుకున్న రంగం లో మైలు రాయిలా నిలిచిపోయే పనులతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. మన గ్రామ పంచాయితీ విషయానికి వస్తే చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం,పంచాయితీ ఏర్పడి 94 సంవత్సరాలు. ఆ కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తే దోనేపూడి సీతారామయ్య గారికి ముందు మరియు ఆయన తర్వాత అని ప్రస్తావించాలి. తన హయాంలో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ఇన్నేళ్ళయినా మనం అనుభవిస్తున్నామంటే అది ఆయన దూరదృష్టికి, చేస్తున్న పని పట్ల, సమాజం పట్ల, ఆయనకున్న భాధ్యతకి నిదర్శనం.

అప్పటి గవర్నర్ తో శ్రీ దోనేపూడి సీతారామయ్య (మధ్య వ్యక్తి), శ్రీ పండిత వెంకట సుబ్బయ్య.

10.09.1959 నుండి 01.09.1964 వరకు సర్పంచ్ గా భాధ్యతలు నిర్వహించిన కాలం లో ఆయన చేపట్టిన పనులు గ్రామాభివృద్దికి పూలబాటలు వేసాయి. అంతర్గత రహదారులు,బురద మట్టి తో కయ్యలుగా ఉండే డొంకలని మెటల్ రోడ్లుగా మార్చిన ఘనత ఆయనదే.1960 లో ఆయన సర్పంచ్ గా ఉన్నపుడే మన గ్రామానికి కరెంట్ వచ్చింది. ఆనతి కాలంలోనే పంచాయితీ నిధులతో చీకటి గుయ్యారాలుగా ఉండే రోడ్లని వీధి దీపాలతో వెలిగించారు. అదే సంవత్సరంలో గ్రామంలో ప్రవేశించిన టెలిగ్రాం సౌకర్యం,1962 లో వచ్చిన టెలిఫోన్ సౌకర్యం, అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న సాంకేతిక విప్లవాన్ని ప్రజలకు మరింత చేరువ చేసాయి. అప్పటిదాకా గ్రామ ప్రముఖులుగా, రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి నేతలుగా వెలుగొందుతున్న గొట్టిపాటి బ్రహ్మ్మయ్య, కిసాన్ వెంకట సుబ్బయ్య, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గార్ల సరసన సమున్నత స్థానాన్ని పొందారు. వయసురీత్యా,అనుభవంరీత్యా, వారికి, సీతారామయ్య గారికి, చాలా అంతరం ఉన్నా, 60 వ దశకం వచ్చేనాటికి జాతీయోద్యమాలు, రైతు పోరాటాలు తగ్గుముఖం పట్టడంతో, అభివృద్ధి వైపు ప్రజలంతా చూస్తున్న రోజులవి. సరిగ్గా ఆ సమయంలోనే దోనేపూడి సీతారామయ్య గారు ఆ దిశగా అడుగులు వేశారు. చిలకలపూడి డ్రాపు నిర్మాణం కూడా ఆయన చొరవ తోనే జరిగింది. భీమనది పై చిలకపూడి దగ్గర నిర్మించిన ఈ డ్రాపు కింద కొన్ని వందల ఎకరాలు సాగు అవుతోంది. ఆయన అందించిన సేవలకి గుర్తుగా పంచాయితీ భవనానికి దోనేపూడి సీతారామయ్య భవన్ అని పేరు పెట్టి తర్వాతి తరం ఆయనకి సమున్నత గౌరవాన్ని కల్పించింది.

సర్పంచ్ గా పదవీ కాలం పూర్తయ్యాక కూడా గుండేరు పై వంతెన నిర్మాణానికి పూనుకొని తానే కాంట్రాక్టర్ గా ఉండి చల్లపల్లి కి మన గ్రామానికి మధ్య రాకపోకల్ని సుగమనం చేశారు. ఇప్పటికీ మన అదే వంతెనని వినియోగిస్తున్నాం. ఇన్నేళ్ళు గడుస్తున్నా,వంతెన శిధిలావస్థకి చేరినా, పునర్నిర్మాణానికి పూనుకోలేని దుస్థితి మనది. సీతారామయ్య గారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మన గ్రామానికే చెందిన వేమూరి చలమయ్య గారి సతీమణి. బుల్లెట్ బాలాజీ గా అందరికీ పరిచయం అయిన వేమూరి బాలాజీ వీరి కుమారుడే. రెండవ కుమార్తె మాజీ సర్పంచ్ వేమూరి పండుబాబు గారికి అత్తగారు. గ్రామ చరిత్ర లో ఒక సువర్ణ అధ్యాయాన్ని అధిరోహించిన వ్యక్తి శ్రీ దోనేపూడి సీతారామయ్య.

 

Dated : 11.03.2012

 

This text will be replaced