శ్రీ వేమూరి వెంకట నరసింహారావు Back to list

 

మన ఊరి ప్రముఖులు

 శ్రీ వేమూరి వెంకట నరసింహారావు 

గ్రామంలో గత 200 సంవత్సరాల్లో జరిగిన విశేషాలు,ముఖ్యమైన తేదీలు సేకరిస్తున్నపుడు అసలు మొట్టమొదటి సారి మన గ్రామం నుంచి అమెరికా వెళ్ళింది ఎవరు అనే సందేహం ఎదురైంది. ఆ వ్యక్తి పేరు విన్నాక చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకుముందేప్పుడు వినని పేరు,అసలు ఊహించని వ్యక్తి అవ్వటంతో మరింత లోతుగా అధ్యయనం చేస్తే మరిన్ని ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆయనే శ్రీ వేమూరి వెంకటనరసింహారావు.

ఈయనకి మన గ్రామంలో రెండు రికార్డులు ఉన్నాయి. ఇపుడైతే మన గ్రామంలో యువకులంతా అమెరికా వెళ్లటం సర్వసాధారణ విషయమే కాని,తొట్ట తొలిసారిగా మన గ్రామం నుంచి అమెరికా వెళ్లిన వ్యక్తి శ్రీ వేమూరి నరసింహారావు గారు.ఘంటసాలలో ఆంగ్లవిద్య లో తొలి పట్టబద్రుడు (First graduate in English medium)ఈయనే.ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ గా 1950 మరియు 1960 దశకాల్లో పత్రికారంగానికి ఎనలేని సేవ చేశారు.1956 లో భూస్వామ్య సంస్కరణల ఆవశ్యకత ను గురించి ఆంధ్రప్రభలో రాసిన వ్యాసం ఎంతో మందిని ఆలోచింపచేసింది.అదే పత్రికలో ఆర్ధిక విజ్ఞానం గురించి 1957లో రాసిన వ్యాసం ఆయన కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.అందులో ఆయన చర్చించిన విషయాలు విమర్శకులను సైతం మెప్పించాయి.

"గౌరీశంకర్అనే కలం పేరుతో ఈయన రాసిన "శిఖరాలు"అనే శీర్షిక సుమారు 5సంవత్సరాలపాటు తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురితమై పాఠకుల మన్ననలు పొందింది.ఎటువంటి క్లిష్టమైన విషయమైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల నేర్పు నరసింహారావు  గారి సొంతం.1950దశకంలో ఆంధ్రపత్రికా ప్రతినిధుల తరపున ఆయన తొలిసారిగా అమెరికాలో పర్యటించారు.ఆ విధంగా మనగ్రామం నుండి తొలిసారి అమెరికా వెళ్ళిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.ఆంధ్రపత్రిక ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి  ప్రియ శిష్యుడుగా ,ఆంధ్రప్రభ ఎడిటర్ శంభుప్రసాద్ గారికి అత్యంత ఆప్తుడుగా వెన్నంటి ఉన్నారు.మద్రాస్ లో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావుతో ఆత్మీయ అనుభంధం ఉండేది.జై ఆంధ్ర ఉద్యమ కర్త కాకానివెంకటరత్నం,అప్పటితరం నాయకులు అయ్యదేవర కాళేశ్వరరావు, ఎన్ జి రంగా,లాంటి ఉద్దండులతో సాన్నిహిత్యం నెరిపారు. ఉద్యమాలని పత్రిక ద్వారా తన కధనాల ద్వారా ప్రజల్లోకి తీసికెళ్ళి వారిని చైతన్య పరచటంలో తనవంతు భాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు.మన గ్రామానికే చెందిన విశ్రాంత ఉపాద్యాయులు శ్రీ గొర్రెపాటి నరసింహారావు గారు ఆయనకి సహాధ్యాయి,ఆప్తమిత్రుడు.వీరి విద్యాభ్యాసం అంతా కలిసే సాగింది.

 

 

ఒకరు VVNR అయితే మరొకరు GVNR అని గర్వంగా చెప్పుకునేవారు.గొర్రెపాటి నరసింహారావు గారిని కలిసినప్పుడల్లా తన మిత్రుడి జ్ఞాపకాలు పంచునేవారు.మిత్రుడు దూరమై ఇన్నేళ్ళు గడచినా ఆ జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకున్న తీరు వారి మధ్య ఉన్న స్నేహానికి ఆత్మీయ అనుభందానికి నిర్వచనంలా కనిపించేది.గొర్రెపాటి నరసింహారావు గారు ప్రచురించే తన పుస్తకాల్లో మొదటిపేజి,నా మిత్రుడు వేమూరి వెంకటనరసింహారావుకి అంకితం అని మొదలవుతుంది.ఇది తన మిత్రుడికి  తాను అర్పించే నివాళిగా ఆయన భావిస్తారు.

 

గొర్రెపాటి నరసింహారావు గారు

 


శ్రీ వేమూరి నరసింహారావు గారు 20.05.1976 ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్ళిపోయారు. 



తన పిల్లలకి పేర్లు పెట్టటంలోనూ నరసింహారావు గారి అభిరుచి గ్రామం మీద ఆయనకీ ఉన్న అభిమానానికి తార్కాణంగా కనిపిస్తుంది.మన ఊర్లో ప్రసిద్దిగాంచిన రెండు దేవాలయాల పేర్లే వారికి పెట్టారు.కూతురికి మాత్రం అభ్యుదయవాదిగా స్వరాజ్యం అని నామకరణం చేశారు.


కుమారులు

 

 వేమూరి సుబ్రమణ్యేశ్వరరావు

(ప్రముఖ రైతు, శ్రీ కోటముత్యాలమ్మ దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త)   

 

వేమూరి విశ్వేశ్వర రావు

(విశ్రాంత ఉపాధ్యాయులు,ప్రస్తుతం విజయా కాన్వెంట్ వైస్ ప్రిన్సిపాల్) 


కుమార్తె

 

గొర్రెపాటి స్వరాజ్యం

(మాజీ ఉప సర్పంచ్)

 

అల్లుడు

 

గొర్రెపాటి వెంకట రత్నం

 

Dated : 26.02.2012

 

 

 

 

 

This text will be replaced