చిట్టియ్య గారి పాలవ్యాన్Back to list

చిట్టియ్య గారి పాలవ్యాన్

1996 వరకు మన ఊర్లో ప్రభుత్వ పాలకేంద్రానిదే హవా,అప్పటికి ఇంకా ప్రైవేటు డైరీలు లేవు. ఆ తర్వాత హార్లిక్స్ కొరకు పాలు అని ఓ కొత్త పాలకేంద్రం వెలసింది. ఇప్పుడు ఇంకా రెండు మూడు వచ్చాయనుకోండి. సరే ఇదంతా పాల కేంద్రాల విషయం. పదేళ్ళ క్రితం వరకు పొద్దున్నే ఏడుగంటలకి, సాయంత్రం ఏడుగంటలకి,1969 మోడల్ బెంజి లారీ తనదైన స్టైల్ లో హారన్ కొట్టుకుంటూ ఊర్లో ప్రవేశించేది. జనాలెవరూ తమ మెదడుకి పెద్ద మేత పెట్టకుండానే ఆ కూత దేనిదో ఇట్టే కనిపెట్టేసేవారు. కొంచెం లేట్ గా పాలు పట్టుకెళ్ళే  రైతులంతా ఆ హారన్ వినగానే పాల కేంద్రానికి వడి వడిగా పరిగెత్తే వాళ్ళు. అది చిట్టియ్య గారి పాలవ్యాన్. కొత్త మాజేరు నుంచి మొదలై లక్ష్మీపురం, రామానగరం,దేవరకోట మీదుగా మన గ్రామం వచ్చి పాలక్యానులు వేసుకుని కొడాలి మీదుగా మధ్య లో ఊర్లు అన్నీ కలుపుకుంటూ పామర్రులోని విజయ పాల ఫాక్టరీ కి పాలని చేర్చటం దాని విధి. దాదాపు నాకు ఊహ తెలిసేనాటికే చిట్టియ్య గారి పాల వ్యాన్ చాలా ఫేమస్. బస్సులు ఆటోలు పెద్దగా లేని రోజుల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకునే పాసింజర్ వాహనం. దీని హారన్ ఎంత సుపరిచితమో చిట్టియ్య గారి నోటి వెంట వచ్చే తిట్లు కూడా జనాలకి, పాలకేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకి అంతే సుపరిచితం. కానీ అవి ఎవర్నీ నొప్పించే విధంగా ఉండేవి కావు. జనాలంతా అత్యంత అప్యాయంగా ఆయన మాటల్ని అందుకుని నవ్వుకునేవారు. అందరికి ఆయన బాబాయి,మామయ్య వరసే. అల్లంత దూరాన పాలకేంద్రం ఉండగానే వెయ్ రా వెయ్ రా త్వరగా అంటూ క్లీనర్ ని ఆయన అందుకునే తిట్ల దండకం, వినేవారికి శ్రవణానందభరితం.

 
( పైన మీరు చూస్తున్నది 1998 లో మొవ్వ గ్రామంలో రోడ్డు మీద ఆగిన పాలవ్యానుని ఆకతాయితనంగా నా స్వహస్తాలతో తీసిన ఫోటో. పదమూడేళ్ళ తర్వాత ఇలా ఒక వెబ్ సైట్ లో అవసరం వస్తుందని కానీ, ఇలా రాస్తాను అని కానీ ఆ రోజున నాకు తెలియదు. అన్నిటితో పాటే ఈ ఫోటో కూడా డెవలప్ చేయించి పెట్టాను.కాల మహిమ అంటే ఇదేనేమో.)
పొద్దున్నే ఫాక్టరీకి పాలు చేర్చిన తర్వాత పాలవ్యాను పామర్రు నుంచి తిరిగి మన గ్రామానికి బయలుదేరేది. మన వైపు ఉన్న చిన్న చిన్న గ్రామాల వర్తకులు పామర్రులో టోకుగా కూరగాయలు కొని తమ గ్రామాల్లో చిల్లరగా షాపుల్లో అమ్మేవాళ్ళు. అలా పామర్రులో కొన్న కూరగాయలు అన్నీ ఖాళీ అయిన పాలవ్యానులో వేసుకుని దారిలో ఉన్న అన్నీ గ్రామాల్లో దించుకుంటూ మధ్యాహ్నం రెండింటికి మన ఊరు చేరుకునేది. దీనికి వర్తకులు చెల్లించే రవాణా పైకం నామ మాత్రం. ఎందుకంటే ఒక్కొక్కరే సొంతగా వాటిని బస్సు లోనో ప్రత్యేకంగా వాహనం లో నో వేసుకురావాలంటే ఆ ఖర్చు తడిసి మోపెడయ్యేది. అందుకే కొత్త మాజేరు నుంచి కూచిపూడి వరకు ఉన్న వర్తకులందరికి ఆ వ్యాన్ ఒక ఆశా దీపం. కాలక్రమం లో ఆ వ్యాపకం నుంచి చిట్టియ్యగారు తప్పుకున్నాక భాధపడిన వారు ఎందరో. చిట్టియ్య గారిది మన ఊరే. ఈ తరం వారికి ఈ పాల వ్యాన్ తెలీకపోవచ్చు కానీ 2002 వరకు గ్రామస్తులందరికీ ఇరవై ఏళ్ల పాటు పొద్దున్న,సాయంత్రం వచ్చే ఈ లారీ ఓ మరువలేని  జ్ఞాపకం. ఓ వయసుడిగిన పెద్దాయన నడుపుతున్నాడే ఏమన్నా అవుతుందేమో అనే భయం ఎక్కేవాళ్ళకి, అందులో తమ సామానులు వేసే వాళ్లకి అసలు ఉండేది కాదు. వయసు అరవై దాటినా ఆ చెయ్యి వణికేది కాదు. గేర్ వేస్తె బండి పంచకల్యాణిలా పరిగేట్టేది. ఆ డ్రైవింగ్ మాత్రం పర్ ఫెక్ట్. వంతుల వారీగా వారి అబ్బాయి గోపాలరావు మరియు చిట్టియ్య గారు ఈ వాహన సారధులు. డ్రైవర్ అనే వాడు లేకుండా తమ సొంత వాహనాన్ని తామే నిర్వహించేవారు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఈ వాహన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. నేను మొవ్వ లో ఇంటర్ చదివేటప్పుడు రోజూ కాలేజికి ఇదే వాహనంలో వెళ్ళేవాడిని. చిన్నప్పుడు పక్క ఊర్లో ఉన్న తాత వాళ్ళింటికి వెళ్ళాలంటే ఇదే ఛాయిస్. తదనంతర పరిణామాలు ఏవైనా ఇప్పుడు ఆ వ్యాన్ కనుమరుగైంది.
 
 
ఇప్పుడు చిట్టియ్య గారు ఏం చేస్తున్నారు అని కదా మీ సందేహం? తిరిగే కాలు,తిట్టే నోరు, స్టీరింగ్ తిప్పే చెయ్యి ఊరికే ఉండలేవు. అందుకే ప్రస్తుతం మన ఊర్లో పిల్లలందరినీ స్కూల్ కి తీసికెళ్ళే విద్యారధ సారధ్యం చేపట్టారు. ఇప్పుడు చల్లపల్లి పబ్లిక్ స్కూల్ కి వెళ్ళే పిల్లలందరికీ అయన తాతయ్య. పిల్లల్ని స్కూల్ కి పంపే తల్లిదండ్రులకి బోలెడంత గుండె ధైర్యం. విచిత్రం ఏంటంటే డెబ్భయ్ ఏళ్ల పెద్దాయన నడిపే వాహనం లో పిల్లలు వెళ్తున్నారనే భయం ఇసుమంతైనా మన వాళ్లకి ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ చేతికి వణుకు లేదు. డ్రైవింగ్ సామర్ధ్యం చెక్కు చెదరలేదు. తమ పిల్లలని అత్యంత భద్రంగా చేరుస్తాడనేనంత మనసు నిమ్మళం తల్లి దండ్రులకి. రోజూ బస్సు ఎక్కే పిల్లల్ని అమ్మా, నాన్నా అంటూ ఆప్యాయంగా ముద్దులాడే చిట్టి తాత అంటే పిల్లలదరికీ ఎంతో ఇష్టం. ముప్పై ఏళ్ల నుంచి మన గ్రామం లో ఆయన మీద జనాలు పెంచుకున్న నమ్మకం, అభిమానం చెక్కు చెదరలేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?....
 
 
Dated : 17.02.2012
 

 

This text will be replaced