ఇద్దరు ఆత్మీయులు, ఒక నివాళిBack to list

 నేను ఎడిటర్ వాయిస్ వీక్లీ రాస్తున్నానని మిత్రుడు మా టీం మెంబర్ అయిన నవీన్ గొర్రెపాటి ఫోన్ చేసి, ఒరేయ్ ప్రతి వారం ఏముంటాయిరా మన ఊరి గురించి రాయటానికి, పదిహేను రోజులకి ఒకసారి రాస్తే బెటర్ ఏమో ఆలోచించు అని చెప్పాడు. ఇప్పటిదాకా నాకు ఈ వారం  ఏం రాయాలా, అనే ఆలోచించే అవసరం రాలేదు. ఒక వేళ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఊరుకున్నా. రాస్తే ప్రతీది చరిత్రే , చెప్పగలిగే వేదిక ఉంటే ప్రతి విషయమూ ఒక విశేషమే. ప్రముఖులు కొంతమంది దేశస్థాయిలో ఉంటారు, మరి కొందరు రాష్ట్ర స్థాయిలో ఉంటారు, ఇంకొందరు జిల్లాస్థాయిలో ఉంటారు. అలాగే మన గ్రామస్థాయిలో  ప్రముఖుల్ని ఈ తరం వారికి ఎందుకు పరిచయం చెయ్యకూడదు? ఈ ఆలోచనతోనే మన ఊరి ప్రముఖులు పేరిట కొంత కాలం ఈ ఎడిటర్ వాయిస్ కొనసాగిస్తే బావుంటుందేమో అనిపించింది. నేనెరిగిన వాళ్ళు, ప్రస్తుతం మన మధ్య లేని వ్యక్తులతో ఈ కధనాలని ప్రారంభించి తదుపరి వీక్షకుల సూచనల మేరకు మరింతమందిని వెలుగులోకి తీసుకు రావాలనే ఆలోచన తోనే దీనిని ప్రారంభిస్తున్నా. నాకు ఊరుని, ఊర్లోని మహనీయుల గొప్పతనాన్ని తెలియచేసిన ఇద్దరు వ్యక్తులతో దీనిని ప్రారంభించటం సబబుగా తోచింది. అసలు వాళ్ళే లేకపోతే ఈ కధనాలు రాయటానికి గాని, ఇవాళ ఇలా రాయగలిగిన స్థితిలో కానీ ఉండేవాడిని కాదేమో. నాలోని జిజ్ఞాసకి, నా జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయటం లో తోడ్పడ్డ ఆ ఇద్దరికీ ఇంతకంటే ఘనమైన నివాళి నేనివ్వలేనేమో.
 
 ఇద్దరు ఆత్మీయులు, ఒక నివాళి 
 
నా జీవితంలో అతి త్వరగా ప్రవేశించి అంతే త్వరగా నిష్క్రమించిన వ్యక్తులు వీళ్ళు. ఎదిగీ ఎదగని వయసులో ఆలోచనా విధానం అప్పుడప్పుడే పరిణతి చెందుతున్న దశలో నేనెక్కువ కాలం గడిపిన వ్యక్తి వేమూరి వెంకట కృష్ణయ్య తాత. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటినుంచి ఇంటర్మీడియట్ అయ్యే వరకు మధ్య లో ఒక్క సంవత్సరం తప్ప ప్రతిరోజూ అయన చెప్పే కబుర్లు వినకుండా పడుకున్న సందర్భాలు తక్కువ. మన పూర్వీకుల మీద, గ్రామ చరిత్ర మీద ఆయనకున్న అవగాహన అమోఘం. నేను అడిగే ప్రతి సందేహానికి అంతే ఆసక్తి గా వివరించి చెప్పేవారు. నేను చిన్నవాడినని గాని, చెప్పినా అర్ధం కాదులే అని ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు. మేము వాళ్ళ ఇంట్లోనే అద్దెకు ఉండేవాళ్ళం. ఆయనతోనూ వారి కుటుంబం తోనూ నాకున్న అనుభంధం ప్రత్యేకమైనది. స్వతహాగానే వెంకట క్రిష్ణయ్య తాత కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుడు. ప్రత్యక్ష సమావేశాలలోను, రాజకీయాలలోనూ పాల్గొనక పోయినా ఆ పార్టీ తాలూకు పెద్దలని, నేతలని తరచూ కలుస్తుండేవారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను తోడుగా వెంట తీసికెళ్ళేవారు.
 
అలా వెళ్తునప్పుడల్లా బోలెడు సందేహాలు నా బుర్ర ని తొలిచేస్తూ ఉండేవి. తిరిగి వచ్చేటప్పుడు ఆయన బుర్ర తినేస్తూ ఉండేవాడిని.అందరూ ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతుండే వాళ్ళు . నా మనవడు అని చెప్పేవాళ్ళు తప్ప ఏరోజు కూడా ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పిన సందర్భాలు లేవు. కమ్యూనిస్టు ఉద్యమం, చల్లపల్లి జమిందారీ, గ్రామం లో ని పూర్వీకుల విశేషాలు, వారి ఆహార్యం ,అలవాట్లు, మనం ఇప్పుడు మరిచిపోయిన కొన్ని వాడుక తెలుగు పదాలు, వ్యవసాయం, పశుపోషణ, ఇవన్నీ అయన సహచర్యం లో నాకు లభించిన అపురూపమైన జ్ఞాన సంపద. ఈ పరంపర నా పదిహేడో ఏట ఇంటర్మీడియట్ అయ్యేవరకు కొనసాగింది. ఆ తరువాత చదువు మానేసి వ్యవసాయం చేస్తున్న రోజులవి. ఏదో చెయ్యాలని, ఏదో అవ్వాలని ఒక నిర్దుష్టమైన ఆలోచనలేవీ పునాదులు వేసుకోని వయసది. సరిగ్గా ఈ సమయంలోనే నా జీవితంలోకి చొచ్చుకు వచ్చిన మరో వ్యక్తి దోనేపూడి రాఘవేంద్రరావు ఊరంతా పున్నయ్య గారి చిన్నబ్బాయి అని పిలుచుకుంటారు. ఓరోజు మా వీధి లో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ పెద్దాయన ఆపి ఏం బాబూ కలం పడతావా హలం పడతావా అని అడిగాడు. నాకేం సమాధానం తోచలేదు. ఆ నడక అలాగే ముత్యాలమ్మ గుడి వైపు సాగింది. గుడి ముందు రావిచెట్టు కింద కూర్చున్న నన్ను అటుగా వచ్చిన ఓ పెద్దమనిషి పలకరించాడు. అప్పటికే ఆయనతో అనుభంధం ఉన్నా, అది అప్పుడప్పుడు మా మధ్య ఉండే చలోక్తులకి పలకరింపులకి మాత్రమే పరిమితం. ఆయనకి మా తాత కి ఉన్న వయసు లేకపోయినా వరసకి తాతా అనే పిలిచేవాడిని. హలానికి, కలానికి తేడా ఏంటి తాతా అని అడిగా. ఆయన నవ్వి హలం పట్టి దున్నిన వాళ్ళే తర్వాత కలం పట్టి మన గ్రామం లో కొందరు ఉన్నత స్థితికి ఎలా వెళ్ళారో, ఆ తరువాత గ్రామానికి ఎలా ఉపయోగ పడ్డారో చెప్పి చివరగా ఆయన అన్న ఒక మాట నా మీద ఆయనకున్న ఆప్యాయత కి అద్దం పట్టింది. ఆ మాటే నా జీవితానికి ఒక దిశా నిర్దేశం అయ్యింది. ఆ వ్యక్తే పున్నయ్య గారి చిన్నబ్బాయి. ఆ బంధం కొన్నాళ్ళు అలాగే సాగింది.
 
తర్వాత 2001 లో హైదరాబాదు లో నేను చదువు కొనసాగిస్తున్నపుడు ఓరోజు విద్యుతఘాతంతో రాఘవేంద్రరావు గారు మరణించారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అది కూడా జరిగిన వారం రోజులకి. తరువాత 2005 లో జరిగిన వెంకట కృష్ణయ్య తాత నిష్క్రమణం కూడా అంతే. అప్పుడు నేను దుబాయ్ లో ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి రక్త సంభంధం లేకుండా నేనభిమానించిన, నన్ను అభిమానించిన ఆ ఇద్దరు వ్యక్తుల ఆఖరి చూపుకి నోచుకోలేకపోయాననే బాధ మాత్రం ఎప్పుడూ నన్ను తొలుస్తూనే  ఉంటుంది.అందుకే ఆ ఇద్దరి ఫోటోలు మా ఇంట్లో హాల్లోనే దర్శనమిస్తాయి.
    
కొన్ని అనుభంధాలు మన్నికైన ఊలు దారాల్లాంటివి. అతి సున్నితంగా మనల్ని పెనవేస్తాయి. మనస్సు లోపలి పొరల్ని అల్లుకున్న మన్నికైన ఊలు దారం, వీరిద్దరితో నా అనుభంధం.
 
Dated : 29.01.2012

 
వచ్చే వారం నుండి  మన ఊరి ప్రముఖులు పేరిట ప్రారంభించనున్న శీర్షిక లో  ఉప్పల  వెంకటేశ్వర్లు (వర్లు) గారి విశేషాలు.

This text will be replaced