సమైక్యత వర్ధిల్లాలిBack to list

 

సమైక్యత వర్ధిల్లాలి

మన ఊర్లో రాజకీయం చాలా విచిత్రమైనది అని చాలా మంది చెప్పటం విన్నాను తప్ప నాకు ప్రత్యక్షానుభవం లేదు. పార్టీ పరమైన విభేదాల వల్ల చాలా పనులు అవ్వలేదు.లేదా అనుకున్నంత బాగా చెయ్యలేకపోతున్నాం అని కొంతమంది పెద్దలు వాపోవటం విన్నాను. ఎదురు పడితే ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే చాలా మంది, పార్టీ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఎదుటి పార్టీ వారిపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి చూస్తుంటారు అనేది గ్రామం లో నానుడి. ఇది ఎన్నో సంవత్సరాలనుంచి కొనసాగుతున్న సంప్రదాయమట. ఘంటసాల చరిత్ర గ్రంధంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. కానీ ఏదైనా ఊరికి సంభందించిన సమిష్టి కార్యాలకి మాత్రం అని పార్టీల వారు కలిసి వస్తారని వెంకటసుబ్బయ్య గారు ఆ గ్రంధం లో ఉటంకించారు. ఏదో అందరినీ  సంతృప్తి పరచటానికి అలా చివర ముక్తాయింపు ఇచ్చారేమో అనుకున్నాను తప్ప, వాస్తవం గా అలాంటివి చూసిన దాఖలాలు తక్కువ. అసలు నా వయసుకి, అనుభవానికి చూసే అవకాశం కూడా ఎప్పుడూ రాలేదు. ఊర్లో గడిపిన రోజులు తక్కువ కావటం, ఉన్నన్ని రోజులూ అంత అవగాహన ఉండే వయసు కాకపోవటం ఒక కారణమేమో. కానీ సంక్రాంతికి జరిగిన ఎడ్లపందాల్లో ఆ సమిష్టి భాధ్యతని పార్టీలకి,వ్యక్తిగత అహానికి, అతీతం గా అందరూ కలిసి ఎంతో వైభవంగా నిర్వహించిన తీరు గ్రామంలోని పార్టీల ఐక్యత కి మనుషులలో ఉన్న సౌశీల్యత కి అద్దం పట్టింది. ఇది నా తొలి అనుభవం.

ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో పోట్లాడుకుంటున్నారు, ఇది అవకాశంగా తీసుకుని బయట వ్యక్తి వాళ్ల మీద పెత్తనం చెయ్యటానికి వచ్చాడు. కానీ ఆ అన్నదమ్ములు ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు. మేము లోపల ఎలా ఉన్నా,బయటి వాడు వస్తే ఇద్దరిది ఒకే మాట ఒకే బాణం అన్నారు. మన ఊరు రాజకీయం కూడా అంతే అని ఈ సంక్రాంతి సంబరాలు నిరూపించాయి. ఇప్పటిదాకా చరిత్రలో బయటి ఊరు వాళ్ళు వచ్చి మన ఊర్లో పెత్తనం చేసిన సందర్భాలు లేవు. అలా చెయ్యాలని చూస్తే మాత్రం ఊరంతా ఒకటే అని నిలబడతారు మన వాళ్ళు.12 న ప్రారంభామవ్వాల్సిన ఎడ్ల పందాలు వాయిదా పడటంతో అందర్లోనూ నిరుత్సాహం. అసలు ఈ వెబ్ సైట్ లో పదిహేను రోజులముందు నుంచే ప్రచారం ప్రారంభించాం. చాలామంది ఫోన్లు చేసి అసలు ఉన్నాయా లేదా అని ఆరా తీసారు. సందేహాల నడుమ 14 నుంచి మూడు రోజుల పాటు ఏదో నామ మాత్రం గా అయినా జరపాలి అని కమిటీ నిర్ణయించుకుంది. కానీ అందర్లో నిరాసక్తత, అసలు జనం వస్తారో రారో అని ఊగిసలాటల మధ్య  కొంచెం మందకొడి గానే ప్రారంభం అయిన వేడుకలు రెండో రోజుకే ఊపందుకున్నాయి. హైస్కూల్ జన సముద్రం తో నిండిపోయింది. కార్లు స్కూటర్ల తో రోడ్ మొత్తం జామ్ అయిపోయింది.

స్థానిక పెద్దలంతా కలిసి వచ్చారు. కమిటీ కి అండగా నిలబడ్డారు. ఇక విరాళాలకి, బహుమతులకి అంతు లేదు. తాము ఇవ్వటమే కాకుండా తమ మిత్రులు, సహా వ్యాపార వేత్తలనుంది ఆర్ధిక వనరుల్ని అప్పటికప్పుడు సమకూర్చారు. ఎద్దులు గంటల చప్పుడు తో గ్రౌండ్ లో వీర విహారం చేస్తుంటే, వీక్షకులు ఈలలు వేస్తూ వాటిని ఉత్సాహపరుస్తూ వాటికి మరింత ప్రోత్సాహం అందించారు. ఇక విజేతలైన ఎడ్లకి నిర్వాహకులు ముందుగా ప్రకటించిన ప్రైజ్ మనీ కంటే రెండు రెట్లు ఎక్కువ మొత్తం వీక్షకులే ప్రకటించారు.ఏదో చూద్దామని సిటి నుంచి వచ్చిన వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆ వేడుకలకి ముగ్ధులై, అప్పటికప్పుడే తమ తరపున విరాళాన్ని ప్రకటించారు. మూడు రోజులకే ముగిద్దాం అనుకున్న పోటీలు నాలుగు రోజులూ దిగ్విజయంగా కొనసాగాయి.

(ఆలోచన) + (ఆర్ధిక సహకారం) +( ఆచరణ,,నిర్వహణ) పార్టీల వారీ గా పంచుకుని,సంవత్సరానికి ఒక్కసారి సొంత ఊర్లో ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతికి మరింత శోభ తెచ్చిన స్థానిక పెద్దలకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఊరుమ్మడి కార్యక్రమానికి పార్టీ రంగుల్ని పులమటానికి  నేను  ప్రయత్నించట్లేదు. సమైక్య భావన అందర్లోనూ ఉంటే ఇక మన గ్రామ అభివృద్ధికి హద్దే ఉండదు అని చెప్పటానికి ఈ ఎడ్ల పందాలు విజయవంతం అవడమే నిదర్శనం.

 

Dated : 21.01.2012

 

This text will be replaced