అ'ద్వితీయం'Back to list

 అ'ద్వితీయం'

అప్పుడే రెండేళ్ళు గడచిపోయాయి. అధికారికంగా వెబ్ సైట్ ని ఆవిష్కరించి రెండేళ్ళే అయినా, దీనికి పునాది పడి మూడేళ్ళు. దాదాపు సంవత్సరం పాటు సమాచార సేకరణకే వెచ్చించాల్సి వచ్చింది. ఏదైనా పక్కా ప్రణాళికతో, వ్యూహంతోనే రంగంలోకి దిగాలనేది నా అభిమతం. ఈ ప్రయాణంలో నాతో నడచిన మిత్రులు, సలహా దారులు లేకపోతే ఈ ప్రయాణం అసంపూర్ణంగానే ముగిసిపోయేదేమో. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పడిన కష్టం కనిపిస్తోంది తప్ప, రూపకల్పన చేసేటప్పుడు మాత్రం ఏనాడు కష్టమనిపించలేదు. ఏదో గొప్ప ఆశయం కోసమో, ఊరుని ఉద్ధరించేయాలి అనే ఆరాటంతో ఈ సైట్ పెట్టలేదు. ఏదో హాబీ గానే చేద్దాం అని మొదలుపెడితే అది అలా పెంచుకుంటూ ఇక్కడిదాకా వచ్చింది.

                                                14.01.2010 న వెబ్ సైట్ ని ప్రారంభిస్తున్న శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు..

                                                        హాజరైన ప్రజానీకం

కానీ ఈ హాబీ వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంది. గణాధిపత్యం కోసం వినాయకుడు, కుమారస్వామి పోటీ పడితే వారి మధ్య ఒక నిభందన పెట్టారు. ఎవరైతే ముల్లోకాలలో ఉన్న నదులన్నిటి లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే పదవి అని. కుమార స్వామి చురుకైన వాడు,వాహనం నెమలి. విషయం చెప్పగానే వాయువేగంతో ఎగిరిపోయాడు. కానీ వినాయకుడు భారీకాయుడు, ఎలుక వాహనం మీద అంత వేగంగా వెళ్ళలేడు. కన్నీళ్ళతో శివపార్వతుల దగ్గరికి వెళ్లి తన పరిస్థితి గురించి చెప్పుకున్నాడు. అప్పుడా తల్లిదండ్రులు కుమారుడిని శాంత పరచి, భక్తి తో జన్మ నిచ్చిన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే  ముల్లోకాలలో ఉన్న నదులలో స్నానమాచరించిన ఫలితం  దక్కుతుందని చెప్తారు. నాది కూడా వినాయకుడి పరిస్థితే, ప్రవాసుల లాగ ఆర్ధిక సహాయం చెయ్యటానికి నేను ఎన్ ఆర్ ఐ ని కాదు. రాజకీయంగా చేయటానికి ఆ బాక్ గ్రౌండ్ లేదు. ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సమాజానికి ఎంతో కొంత సాయపడాలనే ఆలోచన ఉన్నా, ఆర్ధికంగా దానికి తగిన బలం నా దగ్గర లేదు. అందుకే అలా సాయపడే వాళ్ళందరికీ అవసరమైన వేదిక ని తయారు చెయ్యాలనే  ఆలోచనతోనే దీనిని మొదలు పెట్టాను. దీనికి నా పెట్టుబడి కేవలం నాకున్న కొద్ది సమయం మరియు కొద్దిపాటి జ్ఞానం. ఆర్ధికంగా చేయూత ని ఆ కుమారస్వాములే (Donors Page) అందించారు. కానీ వెబ్ సైట్ కి పెరుగుతున్న ఆదరణ ఒక పక్క సంతోషంగానే ఉన్నా, మరో పక్క నాకు తెలుసు నేను పులి మీద స్వారీ చేస్తున్నానని. ఇక దీనిని ఆపాలనుకున్నా ఆపలేను. ఇదొక వ్యసనం లా అయిపోయింది నాకు. ఇక ఈ సంవత్సరం మొదలు పెట్టిన కొత్త శీర్షిక ఎడిటర్ వాయిస్. నన్ను నేను గొప్పగా ఉహించుకుని, అలాగే మీకు కనిపించాలనే తాపత్రయంతో మాత్రం ఇది మొదలుపెట్టలేదు. నేనంత గొప్పవాడిని కూడా కాదు. ఈ వెబ్ సైట్ నా ఒక్కడిది కాదు. టీం అందరిది. ఏదైనా విషయాన్నిచెప్పేటప్పుడు దానికి రెండు రూపాలుంటాయి.ఒకటి వార్త,రెండు వ్యాఖ్య. వార్త ఎవరు చెప్పినా ఒకటే, కానీ వ్యాఖ్య కి మాత్రం భాద్యుడు అది చెప్పినా వ్యక్తి మాత్రమే. వెబ్ సైట్ లో వార్తలు ఉన్నాయి,వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ అన్నీ కలగలిపే ఉన్నాయి. తెలీకుండా వాటిల్లో ఎవరైనా నొచ్చుకునే అంశాలు ఉంటే దానికి భాధ్యత టీం మొత్తానిది అవుతోంది. ఆ వార్తకి, వ్యాఖ్యకి మధ్య అంతరం కోసమే ఈ ఎడిటర్ వాయిస్ మొదలు పెట్టాను తప్ప, నన్ను నేను ఫోకస్ చేసుకోటానికి మాత్రం కాదు. అందులో రాసిన ప్రతి అంశానికి నేనే భాద్యుడిని. అలా అని ఇప్పటిదాకా ఎవరూ దీన్ని విమర్శించలేదు. కానీ చెప్పాల్సిన భాధ్యత నా మీద ఉంది కనుక ఈ వార్షికోత్సవ సందర్భంలో మీతో పంచుకుంటున్నాను. ఇక ఈ సంవత్సరం వెబ్ సైట్ ని సందర్శించిన వారి సంఖ్య 15160.అరవై దేశాలనుంచి వెబ్ సైట్ ని వీక్షిస్తున్న వారిలో ఇండియా మొదటి స్థానం లో ఉంటే అమెరికాది తర్వాతి స్థానం. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఎక్కువ మంది చదివిన ఆర్టికల్ లయోలా మోడల్ కాన్వెంట్.ఈ కధనం నాకు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని మోసుకొచ్చింది. ఇది అసలు ఊహించని స్పందన. కానీ అది రాయటానికి నాకు పట్టిన సమయం కేవలం ముప్పై నిమిషాలు.వార్తల్లో ఎక్కువ మంది చదివింది బాలకృష్ణ పర్యటన. ఇక ఈ వెబ్ సైట్  ప్రయాణం ఎన్నాళ్ళో , ఎన్నేళ్లో కాలమే నిర్ణయించాలి...

 

Dated : 14.01.2012

This text will be replaced