నందమూరి జ్ఞాపకాలుBack to list


                                                                                          నందమూరి జ్ఞాపకాలు

1982 దాకా మన గ్రామంలో ఉన్నవి రెండే పార్టీలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టాక కాంగ్రెస్ వాదులు పెద్దగా మారలేదు గాని, అప్పటికే కమ్యూనిజం బలహీనపడిపోతుండటంతో దాదాపు అదే భావజాలంతో పార్టీ పెట్టిన ఎన్ టి ఆర్ వైపు కమ్యూనిస్టులంతా ఆకర్షితులయ్యారు. ఎన్ టి ఆర్ మన గ్రామానికి రెండు సార్లు వచ్చారు. మొదటిసారి పార్టీ పెట్టినపుడు ఎన్నికల ప్రచారానికి 1982 లో, రెండో సారి మంచినీళ్ళ టాంక్ ప్రారంభోత్సవానికి. మొదటిసారి వచ్చినపుడు నేను ఇంకా పుట్టలేదు. తర్వాత మా నాన్న చెప్పేవారు ఎన్ టి ఆర్ వచ్చినప్పుడు రూపాయి నోట్ల దండ వేసారు మన ఊర్లో అని. మన గ్రామంలో అప్పట్లో TDP లీడర్ శ్రీ వేమూరి నాంచారయ్య గారు. వాళ్ళింటికి కూతవేటు దూరంలోనే మా ఇల్లు. నాంచారయ్య గారింటికి వచ్చే పోయే వాళ్లతో మా తూర్పు వీధి అంతా సందడిగా ఉండేది. 1991 లో మంచి నీళ్ళ ట్యాంక్ ప్రారంభోత్సవానికి ఎన్ టి ఆర్ మన ఊరు వస్తున్నారనగానే ఊరంతా సందడి మొదలైంది. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు ఉంటాయేమో. అందరూ నాంచారయ్య గారి ఇంటి దగ్గర్నుంచి ఆ రోడ్ చివరి వరకు బారులు తీరి నిల్చున్నారు. మనమేమో చిన్న వాళ్ళం.ఎక్కడ తోసేస్తారో అని భయం. అందుకే తెలివిగా నాంచారయ్య తాత వాళ్ళింట్లోకి వెళ్ళిపోయి హాల్లో ఓ మూల నిలబడ్డా. బయట అందరికీ అభివాదం చేసుకుంటూ , పలకరిస్తూ ఇంట్లోకి వచ్చారు ఎన్ టి ఆర్. అది మండువా ఇల్లు, పెద్ద హాలు అయినా గాని జనాలంతా లోపలి వచ్చేయటంతో అంతా కిక్కిరిసి పోయింది. కాషాయ వస్త్రాలతో అపర వివేకానందుడిలా ఎన్ టి ఆర్ దర్శనం.

ఆ వయసుకి నాకంత ఆలోచించే జ్ఞానం లేదు కానీ, ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తుంది ఆయన్ని చూడగలగటం అదృష్టం అని. కుటుంబ సభ్యులని పార్టీ కార్యకర్తల్ని పరిచయం చేశారు నాంచారయ్య తాత. కాసేపటి తర్వాత ఓపెన్ టాప్ జీపులో మంచినీళ్ళ టాంక్ వరకు రాలీ కొనసాగింది. పిల్లలంతా పరుగులు పెడుతూ జీపు వెంట వెళ్ళాం. రాలీ లో అభిమానులు వేసిన దండల్ని మళ్లీ వాళ్ళ పైకే విసురుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు ఎన్ టి ఆర్. అలా దండలు అభిమానులమీదకే విసిరేయటం ఎన్ టి ఆర్  స్టైల్ అని తర్వాత తెలిసింది. చాలామంది తమ స్వహస్తాలతో తయారు చేసిన రక రకాల దండలు, పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. వీధుల్లోనుంచి జీపు వెళ్తుంటే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళంతా అబ్బురంగా చూడటం గుర్తు. వాటర్ టాంక్ ప్రారంభించాక బస్ స్టాండ్ లో ఆయన ప్రసంగించారు. ఇది జరిగి సరిగ్గా 21 సంవత్సరాలు. 1991 ఫిబ్రవరి 23 న ఎన్ టి ఆర్ మన గ్రామానికి వచ్చారు.

ఇదంతా చదివాక మీకో సందేహం రావచ్చు, ఒక చిన్న గ్రామంలో కేవలం వాటర్ టాంక్ ప్రారంభోత్సవానికి ఎన్ టి ఆర్ అంతటి వాడు రావాలా అని. నిజమే, కార్యం చిన్నదే కావచ్చు కానీ ఆ కార్యం చేపట్టిన నాంచారయ్య గారి పట్టుదలకి , ప్రతిష్టకి సంభందించిన విషయం కావటంతో ఎన్ టి ఆర్ ఆగమనం సుసాధ్యమైంది. విచిత్రం ఏంటంటే ఎన్ టి ఆర్ మన గ్రామానికి వచ్చిన రెండు సార్లూ అధికారంలో లేరు. రెండోసారి వచ్చినపుడు కేంద్రం లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే తాను సర్పంచ్ గా పదవిలో ఉన్నపుడు వాటర్ టాంక్ నిర్మాణానికి పూనుకున్న నాంచారయ్య గారు అది పూర్తయ్యే సమయానికి అధికారంలో లేరు.1988 లో సర్పంచ్ గా ఆయన పదవీ కాలం పూర్తయిన రెండు సంవత్సరాలకి వాటర్ టాంక్ ప్రారంభానికి నోచుకుంది. అందుకే నిర్వాహకుడుగా ఆయన పేరు శిలాఫలకం మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞాపకాల దొంతర కదిలించటానికి కారణం రేపు ఆవిష్కరించనున్న అన్నగారి విగ్రహం. (ఇది 07.01.2012 న రాస్తున్నా) ఎన్నో బాలారిష్టాలని అధిగమించి సంవత్సరం క్రితం నెలకొల్పబడిన అన్నగారి విగ్రహం ఆవిష్కరణ కి నోచుకోనుంది. బ్రతికున్నపుడు కేవలం రెండు సార్లు మాత్రమే మన గ్రామాన్ని పలకరించిన ఎన్ టి ఆర్, ఇక నుంచి రోజూ విగ్రహరూపంలో మనల్ని పలకరించనున్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నందమూరి నట వారసుడు బాలకృష్ణ తన తండ్రి విగ్రహావిష్కరణకి  గ్రామంలో అడుగు పెట్టనుండటంతో అందర్లోనూ నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది. బాలకృష్ణ మన గ్రామానికి ఇంతకుముందు రెండు సార్లు వచ్చారు. మండల పరిషత్ ఎన్నికల ప్రచారానికి మరియు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి. అన్నగారు  కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాత్రమే కాదు. పైకి పసుపు రంగు పులుముకున్నా తన హయాంలో ఎరుపు విధానాలే అమలు చేసి, పేదోడి చేతిలో అన్నం ముద్దగా నిలిచిపోయిన విప్లవ సూరీడు అన్న ఎన్ టి ఆర్ .....

                               ఎన్ టి ఆర్ గ్రామాన్ని సందర్శించినపుడు ఫోటోలకోసం క్లిక్ చేయండి.

నేను అడగగానే ఎంతో శ్రద్ధగా ఆనాటి ఫోటోలను సేకరించి పంపిన సోదరుడు రేష్మంత్ వేమూరి కి కృతజ్ఞతలు.

 

Dated : 07.01.2012

This text will be replaced