గూడు నిదురపోవునా ?Back to list

                                               గూడు నిదురపోవునా ?

ఈ మధ్య ఊరికి వెళ్ళినపుడు కొన్ని పాత ఫోటోల కోసం కొన్ని ఇళ్ళకి వెళ్ళాను. అది కూడా రాత్రి ఏడు గంటల ప్రాంతంలో. అవన్నీ చిన్నపుడు నేను చూసిన ఇళ్ళు, అలాగే అందులో మనుషులు కూడా. కానీ అప్పుడున్న సందడి కానీ అంతమంది మనుషులు కానీ ఇప్పుడు లేవు. ఒకప్పటి మేడలన్నీ చిన్న పెంకుటిళ్ళుగా మారిపోయాయి. బిక్కు బిక్కు మంటూ ఒకళ్ళో,ఇద్దరో మనుషులు. ఇంటి చుట్టూ చీకటి. బయట నుండి నాలుగు సార్లు పిలిస్తే తప్ప బయటికి రాని పరిస్థితి. నా మనసు ఒక్క పదేళ్ళు వెనక్కెళ్ళింది. ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు, కొట్టం నిండా పశువులు, సాయంకాలం పాలకేంద్రానికి పాలు పట్టుకెలుతూ పాలేళ్ళు. కానీ కొన్ని వీధులు ఇప్పుడు చూస్తే ఖాళీ అయిన గూడు, పాడుబడిన పశువుల చావిళ్ళు. పాలేరు అనే వ్యవస్థే పూర్తిగా కనుమరుగైన దృశ్యం. మనుషులే లేని ఇళ్ళు. పిల్లలంతా ఎక్కడో సెటిల్ అయ్యారు. బిక్కు బిక్కు మంటూ గడిపే ముసలి ప్రాణాలు, పలకరించటానికి పక్కింట్లో కూడా ఎవరూ లేని స్థితి.

 ఈ మధ్య EMPTY NEST SYNDROME అని ఒక కధనం చదివాను. పిల్లలు తమని వదిలి వెళ్ళాక ఖాళీ అయిన ఇంట్లో ఆ తల్లిదండ్రులు లోనయ్యే మానసిక వ్యధ ఈ సిండ్రోమ్. ఇప్పుడు మన గ్రామం లో ఎక్కువమంది అనుభవిస్తున్న వ్యాధి ఇదే. తమకు తెలీకుండానే గుండెలో గూడుకట్టుకుపోయిన ఈ అంతుపట్టని జబ్బు ఏమిటో తెలీకుండా మౌనంగానే బతుకీడుస్తున్న నడి వయసు జీవితాలు కొన్ని. ముదిమి మీద పడ్డా, భాగస్వామి దూరమైనా , ఒంటరితనం వేయి వైపుల నుంచి దాడి చేస్తున్నాఆ నిశిచీకట్లోనే వెళ్ళదీస్తున్న జీవితాలు మరి కొన్ని. పిల్లలు తమతో వచ్చేయమన్నా తాము బతికిన కలల గూడుని వదల్లేక,అప్పటిదాకా సర్వస్వతంత్రంగా బ్రతికిన తమ ఆత్మాభినం అనే మొండితనమే ఊపిరిగా జీవిస్తున్న జీవితాలెన్నో.రోజూ పిల్లల నుంచి వచ్చే ఫోన్ పలకరింపు కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేస్తున్నారు.పక్షి గూడు కడుతుంది,గుడ్లు పెడుతుంది,వెచ్చగా పొదుగుతుంది. పిల్లలకి ఎలా తినాలో నేర్పుతుంది.ఎలా కూయాలో చెప్తుంది.ఎలా ఎగరాలో బోధిస్తుంది.నేర్పాల్సినవన్ని నేర్పాక పిల్లలు ఎగిరిపోతాయి.ఆ తర్వాత పిల్లల జీవితం పిల్లలది.మళ్లీ వాటికి పిల్లలు పుడతాయి,ఇదో చక్రం,నిరంతరం తరం తరం. ఇంతకుముందు కంటే 1990 తర్వాత గ్రామం నుంచి పట్టణాలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది.పెరగటం అనే కంటే పూర్తి గా వలస వెళ్ళిపోతున్నారు అనటం కరేక్టేమో.ఇంతకుముందు కేవలం కాస్త ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో పిల్లలు మాత్రమే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు.కానీ చదువు మీద అందరికీ అవగాహన పెరిగాక ప్రతి కుటుంబం లో పిల్లలు చదువు కోసం వెళ్ళటం తర్వాత ఉద్యోగ రీత్యా అక్కడే స్థిరపడిపోవటం.అది విదేశాల్లో కావచ్చు ,మన దేశంలో అయినా కావచ్చు. వెళ్తున్నపుడు బరువైన వీడ్కోళ్ళు ఉంటాయి. పక్షికి ఎగరటం అవసరం, మనిషికి ఎదగటం అవసరం.ఎదగాలంటే ఎగరాలి. ఈ ఎడబాటు మన తల్లిదండ్రులకి తప్పలేదు.మనకి తప్పదు. మన పిల్లలు తప్పించుకోలేరు. రాముడిని యాగ సంరక్షణ కి పంపమని విశ్వామిత్రుడు అడిగినపుడు దశరధుడు పసి వాళ్ళని అంతదూరం పంపను అంటాడు. వాశిష్టాది ఋషులు ధైర్యం చెప్పాకే రామలక్ష్మణుల ప్రయాణానికి ఆమోదం తెలుపుతాడు.ఇది కూడా అలాంటి భయమే. కానీ రాముడిని ఆ రోజు పంపకపోతే అహల్య కి శాప విమోచనం కలిగించేవాడు కాదు. విశ్వామిత్రుడు నుంచి దివ్యాస్త్రాలు పొందగలిగేవాడు కాదు.మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన మమకారమే నిచ్చెనలా మనకి తోడ్పడింది. ముళ్ళ కంచెలా అడ్డుపడలేదు. అదే కనుక జరిగి ఉంటే ఊరికి దూరంగా ఉండి, వారు మనకు నేర్పినట్టే మన పిల్లలకి మరింత అందమైన గూడుని నిర్మించుకునే వాళ్ళం కాదేమో...ఒంటరి తనం తో ఉన్నా తమ కంటే అందమైన భవిష్యత్తుని నిర్మించుకుంటున్న పిల్లల్ని చూసి వారు పడే ఆనందమే ఆ ఒంటరితనానికి నీడలా తోడుంటుంది...

 

Dated : 01.01.2012

This text will be replaced