మంచినీళ్ళ పర్యంతం Back to list

మంచినీళ్ళ పర్యంతం

మీరు గమనించారో లేదో గాని, మన ఊర్లో ఒక విశేషం ఉంది. ఊరి మధ్యలో ఉన్న నూతులలోను పంపులలోనూ వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి. నీళ్ళు కావాలంటే ఊరి బయట ఉన్న పంపులలోనో బావుల్లోనో మాత్రమే పడతాయి. బహుశా పూర్వం మనది ఓడరేవు అవటం, సముద్రం ప్రస్తుతం ఉన్న జలదీశ్వరాలయం వరకు ఉండేది అని చరిత్ర చెప్పటం కూడా దీనికి కారణమేమో. నా చిన్నపుడు తాగేనీళ్ళ కోసం అందరూ కావిడి భుజాన వేసుకుని ఊరికి బయట పెద్దగూడెం దగ్గరున్న చేతిపంపు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వేపపుల్ల నోట్లో పెట్టుకుని వీధిలో కనపడే ప్రతి వాళ్ళని పలకరించుకుంటూ, ఛలోక్తులు విసురుకుంటూ సాగిపోయేవాళ్ళు. ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరి దినచర్యలో ఇదొక భాగం. పంపు దగ్గర చాంతాడంత క్యూ ఉండేది.ఒకరి తర్వాత ఒకళ్ళు నీళ్ళు పట్టుకుని గంట తర్వాత నిమ్మళం గా ఇల్లు చేరేవాళ్ళు.1991 వరకు, ఆ తర్వాత కొన్ని రోజులు కూడా ఈ తంతు కొనసాగింది.అప్పుడు శ్రీకారం చుట్టుకున్నదే మంచినీళ్ళ టాంక్.

ఇలా గ్రామస్తులు పడుతున్న అవస్థలు చూడలేక అప్పటికే మాజీ సర్పంచ్ అయిపోయిన శ్రీ వేమూరి నాంచారయ్య గారు ఈ నిర్మాణానికి నడుము కట్టారు. చివరి వరకు ఎన్నో ప్రయాసలకోర్చి తానే కాంట్రాక్టర్ గా మారి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.తొలి దశ లో కేవలం ముఖ్యమైన వీధుల్లో మాత్రమే కుళాయిలు ఏర్పాటు అయ్యాయి.కావిళ్ళు వేసుకెళ్ళే తాతయ్యల స్థానం లోకి ఆడవాళ్ళు బిందెలతో రంగంలోకి దిగారు. కుళాయిల దగ్గర అమ్మలక్కల పోట్లాటలు మొదలయ్యాయి. వాళ్ళ పుణ్యమా అని ఇంట్లో మగవాళ్ళు కూడా ఆ గొడవల్లోకి తల దూర్చక తప్పలేదు. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట, కుళాయిల దగ్గర సందడే సందడి. ఇంట్లో బావుల్ని వాడటం మానేశారు. అన్నిటికీ ఇవే నీళ్ళు. అప్పటిదాకా స్నానానికి ఉప్పు నీళ్ళు వాడటానికి అలవాటు పడ్డ జనం, కాస్త కలర్ మారతామేమో అని మంచి నీళ్ళు వాడటం మొదలు పెట్టారు. కలర్ మారే సంగతి దేవుడెరుగు, ఎప్పుడో సాయంత్రం ఐదింటికి వచ్చే నీళ్ళ కోసం మధ్యాహ్నం రెండింటికే బిందెల క్యూలు ఉండేవి. కానీ ఆడవాళ్ళంతా ఈ నీళ్ళ గొడవలో పడి మంచి మంచి డైలీ సీరియల్స్ మిస్ అయిపోతున్నామే అని బాధ పడేవాళ్ళు. సీరియల్ చూసిన వాళ్ళు అయిపోయిన కధ చెప్తుంటే అందులో దుష్టపాత్రల్ని గురించి తమదైన శైలిలో ఏకిపారేస్తూ నిండిన బిందెల్ని చంకనేసుకుని మిగిలిన సీరియల్స్ ని చూడటానికి వెళ్ళేవాళ్ళు. తర్వాత తర్వాత గ్రామంలో అన్నీ వీధులకి మంచి నీళ్ళ సౌకర్యం విస్తరించింది. ఇప్పుడు ప్రతి ఇంటికి మంచినీళ్ళ టాంక్ నుంచి వచ్చే కనెక్షన్ ఉంది. బిందెల పోరాటాలు తగ్గిపోయాయి. డైలీ సీరియల్స్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడచ్చు. తొలినాళ్లలో ఆలంకమ్మ చెరువునే మంచి నీటి చెరువుగా మార్చి,అందులోని నీళ్ళనే ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేసి సరఫరా చేసే వాళ్ళు. మధ్యలో ఆలంకమ్మ చెరువు అంత పరిశుభ్రంగా లేకపోవటంతో దేవరకోట నుంచి పైపులు వేసి సరఫరా చేశారు. ఆ పిచ్చి రోజుల్లో అవే మంచి నీళ్ళు మరి.

ఇప్పుడు అందరిలోనూ ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. పట్టణాలకే పరిమితమైన మినరల్ వాటర్ మన గ్రామానికి కూడా వచ్చేసింది. తక్కువ ధరలోనే అందరికి మంచి నీరు అందించాలి, ఆరోగ్యం కల్పించాలి అనే సదుద్దేశంతో నాంది ఫౌండేషన్ లాంటి ధార్మిక సంస్థలు ముందుకొచ్చాయి. పది లీటర్ల డబ్బా కేవలం రెండు రూపాయలకే అందించటం మొదలైంది. మళ్లీ తాతయ్యలకి పని వచ్చింది. కాకపోతే అప్పుడు తాతయ్యలంతా కాలి నడకన కావిడి బిందెలు. ఇప్పుడు తాతయ్యలంతా  సైకిళ్ళకి, మోటార్ బైక్ లకి కట్టుకుని వెళ్ళే ప్లాస్టిక్ టిన్నులు.ఇంట్లో ఉన్న కుళాయి నీళ్ళు వాడుకోటానికి సరిపోతున్నాయి.ఇంట్లో ఉన్న నూతులు పాడుబడ్డాయి.జనం ఉప్పునీళ్ళు మర్చిపోయి చాలాకాలం అయ్యింది. అందరి నీటి అవసరాలు, వీధి పోరాటాలు సుఖాంతం. ఇప్పుడు ఊరంతా మంచినీళ్ళ పర్యంతం...........

 

Date : 18.12.2011

This text will be replaced