గుండేరు గుండెచప్పుడు Back to list

గుండేరు గుండెచప్పుడు

 

ఎందరిని ఏ దరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా నావ అంటాడో సినీ కవి. నావలే కాదు మనల్ని దరికి చేర్చే వారధులు కూడా ఒంటరివే. ఏదైనా పొరపాటు జరిగిపోయి అయ్యో ఇప్పుడేం చెయ్యాలి అని ఎవరైనా అడిగితే మన నోటి వెంట వచ్చేవి రెండు మాటలు.తూరుపు తిరిగి దణ్ణం పెట్టు,ఎక్కడన్నా ఏట్లో దూకు.కానీ మన ఊర్లో మాత్రం కొంచెం మసాలా జోడించి గుండేట్లో దూకు అంటారు. ఇది చిన్నపుడు చాలాసార్లు చాలామంది అంటుండగా విన్నమాట. మన గ్రామస్తుల జీవితంలో మనం పెరిగిన పరిసరాల్లో గుండేరు ఒక విడదీయలేని భాగం. రైతులకి అవసరమైన నీటిని అందించే వనరులలో గుండేరుదే అగ్రస్థానం. కొన్ని వేల సార్లు ఆ వంతెన మీదుగా ప్రయాణించి ఉంటాం. కానీ ఎప్పుడైనా దాని మూలాల గురించి అలోచించి ఉంటామా? కొంత మంది పెద్దవాళ్ళు అప్పటి కబుర్లు చెప్తునపుడు ఆ రహదారి ప్రస్తావనకి వస్తే నడుము లోతు నీళ్ళలో దిగి ఆవలి ఒడ్డుకు వెళ్ళేవాళ్ళం అని చెప్పటం విన్నా.లేదా పడవ ఎక్కి అవతలి ఒడ్డుకి చేరేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. అదేమిటి వంతెన లేదా అని అమాయకంగా అడిగితే చెప్పారు,ఆ వంతెన విశేషాలు.45 సంవత్సరాలకి పూర్వం అక్కడ వంతెన లేదు.
 
 
ఇప్పుడంటే రయ్ మని  బైక్ మీదో ఆటోలోనో రోజుకి పది సార్లు చక్కర్లు కొట్టేస్తున్నాం.ఇంతకుముందు చల్లపల్లి వెళ్ళాలంటే పడవలో గుండేరు దాటాల్సిందే. అది లేకపోతే పంచె పైకి కట్టి నీళ్ళలో దిగి వెళ్ళాల్సిందే. ఊహించటానికే భలే ఉంది కదా. ఇప్పుడు దేవరకోట మనగ్రామం లో అంతర్భాగం.కానీ ఒకప్పుడు దేవరకోట వెళ్ళాలంటే బురద కయ్యల్లో అడుగు అడుగు తడబడుతూ వెళ్ళాల్సిందే.ఈ వంతెన నిర్మాణానికి పూనుకున్న వ్యక్తి దోనేపూడి సీతారామయ్య గారు.1965 - 70 ప్రాంతాల్లో తనే స్వయం గా పర్యవేక్షించి ఈ నిర్మాణాన్ని పంచాయితీ నిధులతో పూర్తి చేశారు. అసలు ఈ వంతెనే లేకపోతే గ్రామస్తులు తమ అవసరాలకి చల్లపల్లి వెళ్ళాలంటే చుట్టూ పది కిలో మీటర్లు తిరిగి వెళ్ళాల్సిందే. చల్లపల్లి లో చదువుకున్న ప్రతి విద్యార్ధి ఈ వంతెన దాటిన వాళ్ళే. షుగర్ ఫాక్టరీకి వెళ్ళే ప్రతి చెరుకుబండి ఈ వంతెన ఒడిలో సేదదీరాల్సిందే. అవతల ఊర్లో ఉన్న చెల్లిని పలకరించే అన్నకి,కూతుర్ని ఇచ్చిన తండ్రికి,తన ఆత్మీయుల్ని పలకరించటానికి వెళ్ళే ప్రతి వ్యక్తికీ, తను అడ్డంగా పడుకుని దారినిచ్చిన గుండేరు వారధి గుండె చప్పుడు మనం ఎప్పుడూ విని ఉండం. కానీ ఈ మధ్య గుండేరు పైనుంచి వెళ్తుంటే మన గుండె చప్పుడు మాత్రం శృతి పెరిగి మరీ వినిపిస్తోంది. అది ఎప్పుడు పడిపోతుందా అని.
 
ఎప్పుడు వంతెన పడిపోయిందనే మాట వింటామో అని గ్రామస్తుల గుండెల్లో గుబులు. ఏ చెరుకు బండి ఉన్న పళంగా గుండేరులో పడిపోతుందో అని రైతన్నల మస్తిష్కం నిండా కలవరపెట్టే ఆలోచనలు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యం. కాసేపు వంతెన పై ఆగి గుండేరు ప్రవాహాన్ని చూద్దాం అనుకుంటే మృత్యువు ఒడిలో కూర్చుని కేరింతలు కొట్టటానికి మనమేమీ పసివాళ్ళం కాదుగా అనే భావన.
విధ్యార్ధులను చదువుల ఒడికి, రైతుల ధాన్యాన్ని ఇంటి లోగిళ్లకి, చిరు వ్యాపారుల సరకులను కిరాణా వాకిళ్ళకి, బంధు మిత్రులను మరింత దగ్గరి తీరాలకి చేర్చిన సారధి ఈ గుండేరు వారధి.నేడు అస్తిత్వాన్ని, తన వారసత్వాన్ని, నిలుపుకోలేక తాను నేల చేరే వేళ కోసం ఎదురు చూస్తూ ఉంది.అది నేల చేరేలోపు నింగి నుంచి ఏ నాయకుడైనా వచ్చి తన ప్రయాణాన్ని ఆపుతాడేమో అని చిన్న ఆశ మాత్రం అందరి మదిలో అలాగే ఉంది....

 

 Date : 10.12.2011

This text will be replaced