శ్రీ ఆంజనేయంBack to list

శ్రీ ఆంజనేయం

ఈ మధ్య ఎక్కువగా దేవాలయాల గురించే కధనాలు, వార్తలు వెబ్ సైట్ లో వస్తున్నాయని కొంతమంది మిత్రులు, (కంప్లైంట్ కాదు కానీ) వారు గమనించిన అంశం నా దృష్టికి తీసుకొచ్చారు. వారలా అనటంలో ఔచిత్యం ఉంది. ప్రతి వారం రాయటానికి కూర్చుంటే అన్నీ ఇలాంటి అంశాలే నా మది లో మెదులుతున్నాయి. నేను బొత్తిగా నాస్తికుడిని అని వాళ్ళ నమ్మకం. కానీ సామాజిక భాధ్యత తో మొదలు పెట్టిన ఈ వెబ్ సైట్ లో వ్యక్తిగత అభిప్రాయాలకి, స్వోత్కర్ష కి తావు లేదు. ప్రజాభిప్రాయాలు,వారు ఆసక్తి చూపిస్తున్న అంశాలను వెలుగు లోకి తీసుకు రావటం మా భాధ్యత. గత వారం చెప్పినట్లు వేణుగోపాల స్వామి ఆలయం లోకి మొదటి సారి ఈ వెబ్ సైట్ కి అవసరమైన ఫోటో తీసుకోవటానికి వెళ్ళినపుడు నేను చూసిన మరో ఆలయం ఆంజనేయస్వామిది. నిజం చెప్పాలంటే అది ఆంజనేయ స్వామి గుడి అని నాకు తెలియదు. అప్పటిదాకా సత్రం సెంటర్ దాటాక ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానమే మన ఉరిలో ఉన్న గుడి అనుకున్నాను. అది ఇటీవల నిర్మించినదే. కానీ ఈ గుడి దాదాపు 130 సంవత్సరాల నాటిది. వేణుగోపాలస్వామి గుడి లాగే చాలా కాలం నుంచి మరుగున పడ్డ దేవాలయాల్లో ఇదీ ఒకటి. దీనిని కట్టించినది గెల్లి చెలమయ్య ,గెల్లి వెంకట్రామయ్య అనే మన గ్రామానికే చెందిన వైశ్యులు. ఇలా ప్రతి దేవాలయం గురించి ప్రస్తావించినపుడు ఏదో ఒక కుటుంబాన్నో లేక సామాజిక వర్గాన్నో ప్రస్తావించాల్సి వస్తోంది. వీక్షకులకి ఇది నచ్చటం లేదని తెలుసు,కొంతమంది నేరుగానే నన్ను ప్రశ్నించారు. దేవుడికి సామాజిక వర్గాలతోను లేక ఇంటి పేర్లతోనో ప్రస్తావించటం ఏమిటి అని. కానీ ఇది తప్పని పరిస్థితి. కొన్ని వందల సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఆ సంస్కృతిని మార్చటం నా వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు కొత్తగా మార్చినా మన వాళ్ళెవరూ వాటిని గుర్తు పట్టలేరు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు, దేవాలయాలు వాటిని కట్టించిన వారి పేర్లతోనే పాపులర్ అయ్యాయి. జనాలకి కూడా అలా చెప్తేనే  తొందరగా గుర్తుపడతారు. హైదరాబాదులో నాంపల్లి వెళ్లి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ అని అడగండి,ఒక్కళ్ళకి కూడా తెలీదు. అదే బిర్లా టెంపుల్ అని అడగండి చిన్న పిల్లవాడు కూడా దారి చూపిస్తాడు. అలా అని ఆ గుడిలో ఉండేది బిర్లా కాదు కదా. బిర్లా వల్ల దేవుడికి పేరు వచ్చిందా లేక వెంకటేశ్వరుడి వల్ల బిర్లా కి పేరు వచ్చిందా? చెప్పటం కష్టం. అలాగే మన గ్రామంలో కూడా కొన్ని దేవాలయాలకు ధర్మకర్తలు గాని రాజపోషకులు గాని ఆయా కులానికి చెందిన వాళ్ళో, ఇంటి పేర్లకి సంబంధించిన వాళ్ళో ఉంటారు. కానీ దేవుడి దగ్గర అందరూ సమానమే అనే ధర్మాన్ని ఆ గుడికి దానం చేస్తున్నదాతలు, దేవాలయ కమిటీలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు.దానికి నిదర్శనమే వైశ్యుల ధర్మకర్తృత్వంలో పునరుజ్జీవనం పొందిన ఆంజనేయస్వామి దేవాలయం.

ఇటీవలే లక్షల రూపాయల వ్యయం తో పలువురి దాతల వితరణ తో దీనిని పునరుద్ధరించారు.నూతన ధ్వజ స్తంభం మరియు ముఖమండపంతో దేవాలయం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.గ్రామం లో ని వైశ్యులంతా  ఒక కమిటీ గా ఏర్పడి విరాళాలు పోగు చేసి గుడి ని పునరుద్ధరించారు.సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా పలువురు ప్రవాసాంధ్రులు భూరి విరాళాన్ని అందించారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన, అప్పుడప్పుడే ఉద్యోగాల్లో చేరిన పలువురు యువకులు తమ మొదటి నెల జీతాన్ని స్వామి కి విరాళం గా ఇచ్చారు.ఈ స్ఫూర్తి తో మరిన్ని దేవాలయాలు జీవకళ ని సంతరించుకుంటాయని ఆశిద్దాం.ఒకప్పుడు మన గ్రామం లో 110 దేవాలయాలు 110 బావులు ఉండేవట.కాల క్రమేణా అన్నీ  కాలగర్భం లో కలిసిపోయాయి.ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లే రేపు మన పిల్లలు కూడా ఇప్పుడున్న దేవాలయాల గురించి అప్పుడు ఇక్కడొక గుడి ఉండేదట అని చెప్పుకోకుండా చెయ్యగలిగితే మనకి అదే పది వేలు......

 

Dated: 03.12.2011

 

This text will be replaced