నల్ల గుడి Back to list

నల్లగుడి 

 ఒకే వీధిలో పదిమంది డాక్టర్లు ఉన్నా,ఒక డాక్టర్ దగ్గరకే జనాలంతా క్యూ కడతారు.ఎందుకు అని అడిగితే అయన హస్త వాసి మంచిదండీ అని సమాధానం చెప్తారు. ఇది శాస్త్ర పరమైనది, మనిషి మేధస్సుకి సంభందించినది కాబట్టి ఈ వాదం లో కొంత వాస్తవాన్ని విస్మరించలేం. కానీ భగవంతుడు ఒక్కడే,ఎందెందు వెతికినా అందందే కలడు అనే వాదం కూడా శాస్త్ర పరమైనదే. కానీ మనం నమ్మం.దానికి ఉదాహరణ తిరుపతి పుణ్యక్షేత్రం.వేంకటేశ్వరుడు దేశం లో కొన్ని వేల దేవాలయాల్లో కొలువై ఉన్నాడు. కానీ అందరం తిరుపతికే వెళ్తాం.అక్కడున్న దేవుడు మాత్రమే మన కోరికలని తీరుస్తాడని నమ్ముతాం. నేను నాస్తికుడిని కాదు,అలా అని గొప్ప ఆస్తికుడిని కాదు. ఈ ప్రశ్న నా మనసులో ఎప్పట్నుంచో సుడులు తిరుగుతూ ఉంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు,మన ఊరులో చాలా దేవాలయాలున్నాయి. నా  అంచనా ప్రకారం ఈ కధనం చదివే వాళ్ళలో నూటికి 99 మంది ఒక గుడి లోకి మాత్రం ఇప్పటి వరకు వెళ్లి ఉండరు. అదే వేణుగోపాలస్వామి ఆలయం.బహుశా ఇది వేణుగోపాలస్వామి గుడి అని కూడా తెలిసి ఉండదు.

 

 ఎందుకో తెలీదు కానీ గ్రామంలో అత్యంత నిరాదరణకి గురైన దేవుడు వేణుగోపాలస్వామి మాత్రమే. పోనీ గుడి ఏమన్నా మారుమూల ఉందా అంటే అదీ కాదు. గ్రామ నడిబొడ్డున ఒక పక్క జలధీశ్వరాలయం వైభవం తో వెలిగిపోతుంటే పక్కనున్న వేణుగోపాలుడు మాత్రం చిన్నబోయిన వదనంతో దిగాలుగా ఉంటాడు. ఇది దాదాపు రెండు వందల ఏళ్ల నాటి గుడి. దీనిని కట్టించినది నంబూరి కృష్ణమూర్తి  మరియు పురుషోత్తం అనే చల్లపల్లి కి చెందిన వైశ్యులు. ఒకప్పుడు ఈ దేవుడి కల్యాణం కూడా వారి కుటుంబీకులే చేయించేవారు.ఆ కల్యాణం చేయించుట వల్లే నంబూరి వారి వంశం క్షీణించిందని అప్పట్లో ఒక ప్రచారం. అయ్యా, భక్తుల కోరికలని ఈడేర్చే భగవంతుడు తనకి కళ్యాణం చేయించే వారి వంశస్తులనే రూపుమాపుతాడా? మూర్ఖత్వానికి మూఢ నమ్మకానికి పరాకాష్ట ఇది.అందుకే దీని నల్లగుడి అని పిలవటం మొదలు పెట్టారు.తదనంతరం అదే వైశ్యుల లో ప్రముఖులైన సామా శ్రీరాములు గారు ఆ కల్యాణోత్సవ భాధ్యత ని భుజానికేత్తున్నారు. దేవుడి కళ్యాణం తో పాటు పలు గ్రామాలనుంచి వచ్చి ఇక్కడ వివాహాలు కూడా జరుపుకునేవారు. కాల క్రమేణా ధర్మ కర్తృత్వం మారుతూ వచ్చింది.ఆచార్యులు గారని మా చిన్నపుడు ఈ గుడికి ఒక పూజారి ఉండేవారు. గుడికి దక్షిణం వైపున పడిపోయే దశలో ఉన్న ఒక పెంకుటింట్లో వారి కుటుంబం నివసించేది. ఆయన ఆయుర్వేద  వైద్యం చేసేవాడని గుర్తు.1992 ప్రాంతం లో నాకు తెలిసాక ఆ గుడికి రంగులు వేసి ఉత్సవాలు చెయ్యటం గుర్తుంది. ఇక అంతే ఆ తర్వాత మళ్లీ  గుడి లో చెప్పుకోదగ్గ పూజలు కానీ ఉత్సవాలు కానీ జరిగిన దాఖలాలు లేవు. సర్వాంతర్యామి,సర్వ శక్తిమంతుడు అయిన భగవంతుడు అన్ని చోట్ల ఒకేలా పూజలందుకోలేకపోవటం విచిత్రమేమి కాదు, ఎందుకంటే మనుషుల మధ్యనే ఎన్నో అసమానతలున్న  మన హిందూదేశంలో దేవుళ్ళకి సమానత్వం ఉండాలనుకోవటం మూర్తీభవించిన అజ్ఞానం.

కొసమెరుపేమిటంటే ఇంత విశ్లేషణ రాసిన నేను ఇరవై ఏళ్ళు ఊర్లో పెరిగినా ఈ గుడి లోకి అడుగు పెట్టింది ఒక్కసారే.అది కూడా ఈ వెబ్ సైట్ కి అవసరమైన ఫోటో తీసుకోవటానికి........
 
Dated : 26.11.2011

This text will be replaced