పెద్దలకి మాత్రమేBack to list

 

పెద్దలకి మాత్రమే

ఆ మధ్య పెద్దలారా మన్నించండి కాలమ్ రాసాక చాలా మంది నన్ను అభినందించారు. పెద్దల పట్ల మనం చూపిస్తున్న నిరాదరణకి అద్దం పట్టినట్లుంది అని. కానీ నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి అంశానికి రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. కమల్ హాసన్ నటించిన విరుమాండి (తెలుగు లో పోతురాజు) సినిమా చూడండి, ఒకే కధని హీరో చెప్తున్నపుడు ఒకలాగా, విలన్ చెప్తున్నపుడు మరోలా ఉంటుంది. ఎవరికి వారికి తమ కోణం లో చూస్తే తాము చేసేది కరెక్ట్ గానే కనిపిస్తుంది.

 భిన్న దృక్పధాల నుంచి చూస్తున్నపుడు ఒకే అంశంలో భిన్నకోణాలు ఆవిష్కృతమవుతాయి. ఎంత సేపూ పెద్దలని నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల గురించే మాట్లాడతాం. నేను కూడా ఈ తరం వాడినే, అందరిలాగే వీకెండ్ సరదాలు, సినిమాలు, షికార్లు, మార్కెట్ లో న్యూ ట్రెండ్స్, వీటన్నిటికి ఏమీ అతీతుడిని కాదు. ప్రస్తుతం యువతరం అనుసరిస్తున్న ఈ ట్రెండ్స్ ని విమర్శిస్తూ తమ చాదస్తంతోనో లేక కాలానుగుణం గా వచ్చే మార్పులని ఆహ్వానించలేక ఈ తరం పద్ధతుల్లో ఇమడలేక పిల్లల మనస్తత్వాలని అర్ధం చేసుకోకుండా వారి చేత నిరాదరణ కి గురవుతున్న పెద్దలూ ఉన్నారు. మా అత్తగారికి చాదస్తం మరీ ఎక్కువండీ అంటూ ఓ కోడలు వాపోతుంది. మా తాత కి నేను జీన్స్ వేస్తేనే నచ్చదురా,మా రోజుల్లో అయితేనా అంటూ మొదలెడతాడు అని స్నేహితుడి దగ్గర చెప్తుంటాడు ఓ కాలేజి స్టూడెంట్. ఇది ఈ తరం వాళ్ళ వెర్షన్. అందుకే పెద్దలు మారాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ముందు మీ పాత కళ్ళజోడు మార్చేయండి. దానితో పాటు కుటుంబాన్ని లోకాన్ని చూసే దృక్కోణాన్ని మార్చుకోండి.ఒక తరం లో పంచెకట్టు ఫాషన్, మీ తరం వచ్చేటప్పటికి బెల్ బాటం, మా తరానికి వచ్చేటప్పటికి జీన్స్ ఫాషన్. ఒకప్పుడు కోరమీసం యువతరాన్ని ఊపేస్తే ఇప్పుడు పిల్లి గడ్డం ఈ తరాన్ని ఏలేస్తోంది. మా రోజుల్లో అయితేనా  అంటూ మొదలుపెడితే ఇప్పుడు వినే ఓపిక ఎవరికీ లేదు. ఎందుకంటే మీ రోజులు మీవే, మావి కాదు. నలభై ఏళ్ల క్రితం బెల్ బాటం, కోరమీసం తో మీరు ఫాషన్ సముద్రాన్ని ఈదినట్లే. ఇప్పటి తరం చిరుగుల జీన్స్ ట్రెండ్ లో కొట్టుకుపోతోంది. వళ్ళంతా టాటూలు వేయించు కొచ్చిన మనవరాలని సంప్రదాయాల పేరు తో బెదరగొట్ట కండి.బావుందమ్మా ఇది లేటెస్ట్ దా అని ముద్దుగా ఆశ్చర్యపొండి. ఒకప్పటి ఉద్యోగాలు వేరు వాటికి అవసరమైన వేషధారణా వేరు. వాటితో పోల్చుకుని అప్పట్లాగా ఉండటం ఇప్పుడు కుదరదు. అంతెందుకు ఒకప్పుడు మీరు తీసుకున్న నెల జీతం మీ అబ్బాయి ఒక గంట కి సంపాదిస్తున్నాడు. మరి మీలాగా అదే జీతానికి పని చెయ్యమని మీరు చెప్పగలరా? కోడలు కాఫీ ఇవ్వటం లేదని చిన్నబుచ్చుకోవటం  ఎందుకు,మీరే వేడిగా కోడలికి ఒక టీ ఇవ్వండి. మీ తరం లో ఒత్తిడి అనే పదమే ఉండేది కాదు .కానీ ఇప్పుడలా కాదు.భార్య భర్తలిద్దరూ పరిగెత్తాల్సిన పరిస్తితి.ఆ పరుగు లో తమను తామే మరిచిపోతున్నారు. వారికి ఇంటికి రాగానే కావాల్సిన ఉపశమనం అందించాల్సింది మీరే. బాల్యం లా,యవ్వనంలా,వృద్ధాప్యామూ ఒక దశ. ఆనందం గా ఆస్వాదించండి.మనసారా జీవించండి. ఇంతకాలం పరిగెత్తి అలసిపోయారు ఇక విశ్రాంతి తీసుకోండి. మీ పిల్లలు, మనవళ్ళు,మనవరాళ్ళకి వారి భాధ్యతని మాత్రమే గుర్తుచెయ్యండి. భాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం రెండూ వృధానే. మీ జ్ఞాపకాలు మీవే, వాటిని పదిలపరచుకోండి.ఈ తరం అలవాట్లని జీవన విధానాన్ని ప్రశ్నించకండి.ఓ సినిమా లో హీరో అంటాడు పాతికేళ్ళ కుర్రాడంటే నాలాగే ఉంటాడు అమ్మా నాన్న కి చెప్పకుండా సినిమాలకి వెళ్తాడు.ఫ్రెండ్స్ తో  షికార్లకి వెళతాడు.వాడలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్లు లేదంటే ఎవరైనా డాక్టర్ కి చూపించాలి అని. మీ తరం లో ఏదన్నా పెళ్లి సంబంధం వస్తే అసలు మా అబ్బాయికి వక్కపొడి అలవాటు కూడా లేదండి అని చెప్పుంటారు. కానీ ఇప్పుడు అలా చెప్పండి ఒక్క అమ్మాయి అయినా మీ అబ్బాయిని చేసుకుంటుందేమో. మరీ పప్పు సుద్దలా ఉన్నాడే అనుకుంటారు. అలాగే అసలు మా అమ్మాయి వంచిన తల ఎత్తదు అని చెప్పినా చేసుకోటానికి అబ్బాయిలేవరూ సిద్ధంగా లేరు. కాలం తో పాటు వచ్చిన మార్పులకనుగుణం గా ప్రతి మనిషి తమను తాము మలుచుకోవాలి మార్చుకోవాలి. లేదంటే ఈ పోటి ప్రపంచం లో ముందుకు వెళ్ళటం కష్టం అనే విషయాన్ని గ్రహించండి.  మీ ముందు తరం వాళ్ళు చెయ్యలేని ఎన్నో అద్భుతాలని మీరు సృష్టించారు. అలాగే మీరు సాధించలేని ఎన్నో ఆవిష్కరణల్ని ఈ తరం ఇప్పటికే సాధించింది. కుటుంబ పరిస్తితుల కారణంగా వృద్ధాశ్రమాల్లో గడపాల్సి వస్తే క్రుంగిపోకండి. కొత్త స్నేహితుల్ని కొత్త వాతావరణాన్ని ఆస్వాదించండి. సవాలక్ష మజిలీల్లో ఇది ఒకటి అనుకోండి. ఆశావాదం జీవితం మీద సరికొత్త ఆశల్ని కల్పిస్తుంది....
 

This text will be replaced