సామాన్యుడి సవారి-నేడు ఎక్కేవారేరి?Back to list

సామాన్యుడి సవారి -నేడు ఎక్కేవారేరి?

 

బస్సు చక్రం ప్రగతి కి చిహ్నం, ఇది R.T.C వారి ప్రకటనల్లో తరచూ కనిపించే, వినిపించే పదం. ఆ పదాన్ని ఆ సంస్థ  ఎందుకు వాడుతుందో నాకు తెలియదు కానీ ఆర్టీసి బస్సు చక్రం గ్రామం లో తిరిగిందంటే అది ఆ గ్రామ ప్రగతికి చిహ్నం అని మాత్రం తెలుసు. పల్లె పల్లెనా ఆర్టీసి అంటూ ఒకప్పుడు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలనే ధ్యేయంతో గ్రామణి పేరిట ఆర్టీసి పలు గ్రామాలకి సర్వీసులని ప్రారంభించింది. దాదాపు 50 ఏళ్ళకి ముందు నుంచే మన గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది. బెజవాడ వెళ్ళాలంటే పొద్దున్నే 6.30 కల్లా జనాలంతా అప్పటికే నైట్ హాల్ట్  ఉన్న బస్సు ముందు క్యూ లో నిలబడేవారు. తాము ఊర్లో ఉంటూనే పిల్లల చదువులకోసం విజయవాడలో కాపురం పెట్టిన తమ కుటుంబానికి పాలు కూరగాయలు పంపటానికి మరికొంతమంది సిద్ధంగా ఉండేవాళ్ళు.



కానీ ఘంటసాల అనే బోర్డు తో బస్సు మన ఊర్లో కి రావటం మానేసి దాదాపు ఎనిమిదేళ్ళు దాటింది. అసలు ఇప్పుడు మన ఉరికి బస్సు సౌకర్యం లేదంటే నమ్మగలరా? అసలు నేను కూడా ఈ విషయం కొన్నాళ్ళ క్రితం వరకు గమనించలేదు. ప్రజల జీవన  ప్రమాణాలు మారాయి. ప్రతి ఇంటికి టూ వీలర్, అది లేని వాళ్ళకి ఇంటి ముందే ఆటో ఎక్కే సౌకర్యం ఉంది. అది కూడా బస్సు చార్జీకే. మాబోటి వాళ్ళు ఊరికి వెళ్ళినపుడు కొడాలిలో దిగి ఒక ఫోన్ కొడితే చాలు ఏ స్నేహితుడో లేక బంధువో వచ్చి తీసికెళ్ళిపోతారు.లేదంటే ఎప్పుడూ ఆటోలు క్యూ లో ఉంటాయి. మరీ అంతగా వెయిట్ చెయ్యటం ఎందుకులే అనుకుంటే 50 రూపాయలిస్తే మన ఒక్కరినే ఆటో ఎక్కించుకుని చక్కగా ఇంటిముందు తీసికెళ్ళి దింపుతారు.1988 వరకు గ్రామంలో ప్రైవేటు బస్సులు నడిచేవి. ఘంటసాలపాలేనికి చెందిన వేమూరి కృష్ణమూర్తి,దేవరకోట కి చెందిన దోనేపూడి గోపాలరావు కొన్నాళ్ళు ఈ సర్వీసులని నడిపారు. ఒక సర్వీసుని మన గ్రామానికే చెందిన వేమూరి బాలాజీ(బుల్లెట్) కూడా నిర్వహించారు.1988 లో ప్రైవేటు బస్సులని ప్రభుత్వం నిషేదించటంతో కేవలం ఆర్టీసి మాత్రమే బస్సులను నడిపేది. బందరు కి ఒక సర్వీసు,కొడాలి నుంచి చల్లపల్లి కి మన గ్రామమ్ మీదుగా షటిల్ సర్వీసులు నడిచేవి. కాల క్రమేణా ఆటోల రాకతో బస్సులకి ఆదరణ తగ్గింది. గ్రామంలో ఉండే యువకులకి ఇదొక ఉపాధి మార్గంగా ఉపయోగపడింది. ఇబ్బడి ముబ్బడి గా ఆటోలు పుట్టుకొచ్చాయి.ఎక్కేవాళ్ళు లేకపోవటంతో ఆర్టీసి ఇక బస్సులని నడపలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు దేవరకోట నుంచి విజయవాడ వెళ్ళే బస్సు మన గ్రామం మీదుగా వెళుతుంది. ప్రస్తుతం మన ఊర్లో ఆర్టీసి బస్సు చూడాలనుకుంటే పొద్దున్నే 7 గంటలకి మాత్రమే చూడచ్చు. బస్సు స్టాండ్ కాస్తా ఆటో స్టాండ్ అయ్యింది.
 
 
  సిటిలో లాగా కాల్ సెంటర్ లేకపోయినా కాల్ చేస్తే ఇంటి ముందు వాలిపోయే  ఆటోవాలాలూ ఉన్నారు. ఇది ప్రగతి కి చిహ్నమా? లేక మారుతున్న ప్రజల అవసరాలకి అందిన వరమా? అవసరానికి సౌకర్యానికి మధ్య ఉన్న అంతరం చాల పెద్దది, కానీ సౌకర్యానికి విలాసానికి మధ్య ఉన్న గీత చాలా చిన్నది. అది అనుభవించే వాళ్ళ దృక్కోణానికి మాత్రమే సంభందించింది. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కావాలి అని ఎన్నో గ్రామాల ప్రజలు ఒకప్పుడు ఆర్టీసి కి అర్జీలు పెట్టేవాళ్ళు. రాజకీయ నాయకులకు ప్రచారాస్త్రం కూడా అదే. నేను గెలిస్తే ఊరికి బస్సు వేయిస్తాను అని చెప్పేవాళ్ళు. ఉద్యోగానికో చదువుకోసమో సిటికి వెళ్తే ఎర్రబస్సు ఎక్కొచ్చావా అనే వెటకారాలు విన్పించేవి.పాపం ఆర్టీసి వాళ్ళు కూడా దానికి బాధపడినట్లున్నారు, అందుకే బస్సులన్నీ పచ్చరంగు పులుముకున్నాయి. ఒకప్పుడు రబ్బీసు రోడ్లపై ఎర్రటి దుమ్ము రేపుకుంటూ మన గ్రామానికి వచ్చే ఎర్రబస్సు అనేది ఇప్పుడొక జ్ఞాపకం మాత్రమే..........
 
 

Dated : 13.11.2011

This text will be replaced