చారిత్రక ఆనవాళ్ళుBack to list

   చారిత్రక ఆనవాళ్ళు 

ఈ వెబ్ సైట్ మొదలు పెట్టాక చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న, చరిత్ర మీద ఇంత అవగాహన ఎలా వచ్చింది అని. గ్రామానికి సంభందించిన భౌగోళిక పరమైన అవగాహన ఈ సైట్ మొదలు పెట్టేవరకు నాకూ లేదు. సాంఘిక చరిత్ర మీద మాత్రం మంచి అవగాహన ఉండేది. దానికి కారణం ఇంతకుముందు గుడి ముందు ఉన్న గొర్రెపాటి రంగన్న,వేమూరి రామన్న కళా మందిరం. చరిత్రకి సంబంధించినంత వరకు నేను అడిగిన తొలి ప్రశ్న ఎవరా రంగన్న,ఎవరా రామన్న? అలా అడిగింది వేమూరి వెంకట కృష్ణయ్య గారిని. 1993 లో గ్రామపంచాయితీ 75 సంవత్సరాల పండుగ వజ్రోత్సవాలని అప్పటి గ్రామ సర్పంచ్ సంకా నాగబాలసుబ్రహ్మణ్యం ఆనాటి కలెక్టర్ రాజీవ్ శర్మ ముఖ్య అతిధిగా ఇదే వేదిక మీద నిర్వహించారు. నాకు తెలిసిన మొదటి సర్పంచ్ ఆయనే, ఎందుకంటే అప్పుడప్పుడే అసలు ఊర్లో బయటకి వెళ్ళటం అలవాటు అయ్యింది. అప్పటిదాకా స్కూల్,ఆటలు తప్ప బయటకి వెళ్ళటం తక్కువ. అప్పుడు నాకూ పదేళ్ళు. ఆ వేడుక చూస్తున్నపుడు ఆ రెండు పేర్లు ఎందుకో నా మది లో బలం గా నాటుకు పోయాయి.ఆ వేడుక ముగిసాక ఇంటికి వెళ్లి ఆరుబయట కూర్చున్న వెంకట కృష్ణయ్య తాత (చిన గోపాలయ్య గారి వెంకట కృష్ణయ్య అంటారు) ని అడిగా,ఎవరా రంగన్న,రామన్న అని. మేము వాళ్ళింట్లోనే అద్దెకు ఉండేవాళ్ళం. రోజూ సాయంత్రం ఆరు బయట పడుకున్నపుడు అన్ని  విషయాలు ఆసక్తి గా అడిగేవాడిని. నా ఆసక్తికి తగ్గట్లే అన్నీ వివరం గా చెప్పేవాళ్ళు. నేనన్నా,మా కుటుంబం అన్నా ఆయనకి ఎంతో ప్రేమ. ఆయన ద్వారానే ఊర్లో ఆనాటి పూర్వీకుల అలవాట్ల గురించి ఘంటసాల చరిత్ర గురించి తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పుడు ఆయన లేరు.ఇప్పటికీ నేను బాధపడే విషయం అదొక్కటే. ఇదంతా చూస్తే ఎంత సంతోషించేవారో. కనీసం ఆయన ఆఖరి చూపుకి కూడా నేను నోచుకోలేకపోయా. 2006 లో అయన చనిపోయేనాటికి నేను దుబాయి లో ఉన్నా.ఈ అవగాహన అంతా అయన చలవే, ఎక్కడున్నా అయన ఆశీస్సులు ఉంటాయని బలం గా నమ్ముతాను.

 ఇక ఆ ఆసక్తి కి కారణమైన ఆ వేదిక ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇంతకుముందు గ్రామ పంచాయితీ ఈ వేదిక పై అంతస్తు లోనే ఉండేది. దాని వెనుక పాత కాలం నాటి మేడ లో స్కూల్ ఉండేది.కింద అంతస్తు లో గ్రంధాలయం.వీటన్నిటి వెనుక జలధీశ్వరాలయం. ఇదీ ఒకనాటి గుడి పరిస్థితి .అసలు మన ఊరు వాళ్ళే దాని వెనుక ఒక గుడి ఉందని మర్చిపోయేవాళ్ళేమో.దేవాలయ పునర్వైభవం లో భాగం గా ఒక్కొక్కటి కూల్చటం మొదలు పెట్టారు. అలా పడగొట్టటం కొంతమందికి కోపం తెప్పించింది. కొంతమందికి బాధ ని కలిగించింది. అలా బాధ పడిన వాళ్ళలో నేనూ ఒకడిని. ఎందుకంటే వారసత్వ కట్టడాలు కాపాడుకోవాలని బలం గా నమ్మే వాళ్ళలో నేనూ ఒకడిని. కానీ ఇటీవల నూతన కళా మందిరాన్ని చూసాక అనిపించింది .ఇంతకుముందు కంటే ఇప్పుడే ఎంతో అందం గా ఉందని. కొసమెరుపేమిటంటే  పాత మందిరం లో జరిగిన ఆఖరి వేడుక వెబ్ సైట్ ఆవిష్కరణ. కొత్త వేదిక పై జరిగిన మొదటి వేడుక ఘంటసాల చరిత్ర పుస్తకావిష్కరణ. నాలోని ఆసక్తి కి బీజం వేసిన ఆ మందిరానికి సంబంధించిన రెండు విశేషాలు నాకు సంభందించినవే కావటం కాకతాళియమే......... 

 

Dated : 07.11.2011

This text will be replaced