ప్రజాస్వామిక నియంతృత్వం Back to list

 ప్రజాస్వామిక నియంతృత్వం 

(ఈ అంశం మన గ్రామానికి, అలాగే ఈ వెబ్ సైట్ ఉద్దేశానికి సంబంధించినది కాదు. నాకు తెలిసిన కొన్ని అంశాలని, అభిప్రాయాలని మీతో పంచుకోవాలనే ప్రయత్నమే తప్ప ఇది నా స్వోత్కర్ష గా భావించవద్దని మనవి.)
 
ఇటీవల జాతీయ అంతర్జాతీయ వార్తా సాధనాలన్నీ లిబియా దేశపు నియంత మహమ్మద్ గడాఫీ మరణాన్ని ప్రముఖం గా ప్రసారం చేశాయి. ఆ వార్త ఎవరికి ఖేదమో ఎవరికి మోదమో నాకు తెలీదు కానీ, నన్ను మాత్రం తీవ్రం గా భాదించిన సంఘటన అది. 2005 నుంచి 2007 వరకు ఉద్యోగ రీత్యా నేను దుబాయి లో ఉన్నాను. అప్పటికి అసలు బయట ప్రపంచం అంటేనే తెలీని వయసు నాది. ఆ రెండు సంవత్సరాల కాలం లో మధ్య ప్రాచ్య దేశాల రాచరికం గురించి ప్రపంచీకరణ వల్ల అనేక మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలు పొందిన ప్రయోజనాల గురించి అధ్యయనం చేసే వీలు చిక్కింది. ప్రజాస్వామ్యానికి ,రాచరికానికి మధ్య ఉన్న అంతరం అక్కడ ప్రస్ఫుటం గా కనిపించేది. అక్కడ రాజు సర్వాధికారి. అలా అని ఒంటెత్తు పోకడలు అక్కడ కనిపించవు. లౌకిక వాదం, జాతీయ వాదం, అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో లాగే అక్కడ కూడా కనిపిస్తాయి. తాగే నీరు అనేది మచ్చుకైనా కాన రాని ఆ ఇసుక ఎడారుల్లో బంగారాన్ని పండించగలమని నమ్మిన వారి ధైర్యానికి హాట్స్ ఆఫ్  అనిపించేది."The spirit of human celebration" అనేది దుబాయ్ కి ఉన్న బిరుదు. ప్రపంచం లో నే అతి ఎత్తైన కట్టడం Burz khaleefa అక్కడే ఉంది. మేము 80 వ అంతస్తు కడుతున్నపుడు చూడటానికి వెళ్ళాం. పక్కనున్న మిత్రుడ్ని అడిగాను ఇంత ఎత్తైన కట్టడాలు మన దేశం లో కట్టరు ఎందుకని. అప్పుడు వాడు నవ్వి,ఎవడైనా కడదాం అనుకుంటే పక్క వాడు కోర్ట్ లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాడు. వీడు అంత ఎత్తు కట్టడం  వల్ల భూగర్భ జలాలన్ని అంతరించి పోతున్నై అని. ఇక వాడు ఆ కేసు నుంచి బయట పడలేడు అది కట్టనూ  లేడు. ఇక్కడ ఆ సమస్య లేదు. అంతా రాజు ఇష్టం. తనకెక్కడ కావాలో అక్కడ కట్టుకుంటాడు. ప్రజలకేం కావాలో అంత కన్నా ఎక్కువే ఇస్తున్నపుడు ఇక ప్రజలు మాత్రం ఎందుకు మాట్లాడతారు. అభివృద్ధి వేగం పుంజు కోవటానికి సమిష్టి కృషి అవసరం. కానీ నిర్ణయాధికారం సమర్ధుడి చేతిలో ఉన్నపుడు ఇక ఆ అభివృద్ధి కి ఆకాశమే హద్దు ఈ బిల్డింగ్ లా  అన్నాడు. దాదాపు 10 సంవత్సరాల పాటు శ్రమించి సముద్రాన్నే ఖర్జూర చెట్టు ఆకారం లో పూడ్చి ఒక  పెద్ద నగరాన్నేలక్షల కోట్ల వ్యయం తో నిర్మించిన అధ్బుతం Palm Jumeriah దుబాయి లోనే ఉంది. 
 
కేవలం ఆకాశ హార్మ్యాలు, ఖరీదైన కార్లు, లగ్జరీ హోటల్స్ మాత్రమే అభివృద్ధి కి కొలమానం కాదు. అక్కడా పేదలున్నారు,కానీ రాజు వారికి అవసరమైన భ్రుతిని అనేక రూపాల్లో అందిస్తాడు. 35 లక్షల జనాభా ఉన్న UAE లో అక్కడి పౌరులు కేవలం 6 లక్షలు మాత్రమే. సింహభాగం భారతీయులదే దాదాపు 20 లక్షలమంది మన దేశపు పౌరులు ఆక్కడ నివసిస్తున్నారు. ఏజెంట్ ల చేతిలో మోసపోయి సరైన అవగాహన లేక ఆక్కడ జైళ్లలో మగ్గుతున్న అమాయకుల కధలనే మనం మీడియా లో చూస్తుంటాం. కానీ ఆక్కడ మన భారతీయులు పొందిన ఉన్నత స్థానాల గురించి సాధించిన విజయాల గురించి మాత్రం వినేది తక్కువే. ఇవన్నీ నాణానికి మరో వైపు. చట్టం ఎంత పటిష్టం గా ఉన్నా,దానిని ఎలా మనకి అనుకూలం గా మార్చుకోవాలో మన వాళ్ళకి తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో. మన వాళ్ళు ఏ దేశం లో ఉన్నాఅక్కడి చట్టం కూడా మన చుట్టం ఎలా అవుతుందో చూస్తూనే ఉంటారు. జైలుకి  బెయిలు ఒకే చట్టంలో రాసుకున్న రాజ్యాంగం కదా మనది. అలా అని నియంతృత్వాన్ని నేను సమర్ధించట్లేదు. ఒకప్పుడు నాగరికత తెలియని,కనీసం తినటానికి తిండి లేని ప్రజలున్న ఎన్నో అరబ్బు, ఆఫ్రికా దేశాలని, చొరవ, ధైర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఇప్పుడు నియంతలని పిలవబడుతున్న పాలకులు ఈ స్థితికి తీసుకురాగలిగారు. కొంతమంది స్వచ్చందం గా రాజరికం నుంచి తప్పుకుని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పితే, మరి కొన్ని దేశాలు మాత్రం ఇంకా రాచరికపు పాలనలో నే ఉన్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, నాగరికత కలిగిన దేశాలు 50 సంవత్సరాల్లో సాధించలేని ప్రగతిని, ఈ దేశాలన్నీ అతి కొద్దికాలం లో నే సాధించాయంటే కారణం ఇప్పుడున్న నియంతలే. తిరుగుబాటు ధోరణి ఒక్క రాచరికం లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలోనూ ఉంది. దానికి నిదర్శనం గడచిన 65 సంవత్సరాల్లో మన దేశంలో జరిగిన మధ్యంతర ఎన్నికలు, అధికార మార్పిడులు. కానీ ప్రజాస్వామ్యం లో అవన్నీ గౌరవ ప్రదం గా మెజారిటీ ప్రజల ఆమోదం తో జరుగుతాయి. కానీ ఆ మధ్య ట్యునీషియాలోను మొన్న ఈజిప్టులోను రాచరిక వ్యవస్థ ని ప్రజాస్వామ్య వ్యవస్థ గా మార్చటానికి జరిగిన పోరాటాలు హింస కి దారి తీసాయి. అన్నిటి కంటే విషాదం లిబియా లో జరిగింది. పై దేశాల్లో నియంతలని ఎవరు చంపలేదు. తల దాచుకోవటానికి మరో దేశానికి వెళ్ళే అవకాశాన్ని ప్రజలు వారికిచ్చారు. కానీ లిబియా నియంత గడాఫీ మాత్రం కనీసం 25 సంవత్సరాలైనా నిండని లిబియా యువకుల చేతుల్లో అతి నీచంగా, దారుణంగా హింసించి చంపబడిన దృశ్యాలు యుట్యూబ్ లో చూసాను. నేను దుబాయి లో  పని చేసిన సంస్థ కి లిబియా కి వాణిజ్య పరమైన సంబంధాలుండేవి లిబియా లో తయారయ్యే పలు ఉత్పత్తులకి, శీతల పానీయాలకి అవసరమైన ప్రింటింగ్, ప్యాకేజింగ్ పనులను మేము చేసేవాళ్ళం.ఈ సందర్భం లో అక్కడనుంచి వచ్చే లిబియన్స్ నుంచి పలు ఆసక్తి కరమైన అంశాలను కుతూహలం గా వినేవాడిని. అక్కడ కరెంట్ బిల్ లేదు,బ్యాంక్ లో పౌరులు తీసుకునే వ్యక్తిగత అప్పులకి వడ్డీ లేదు, సొంత ఇల్లు అనేది ప్రతి పౌరుడి హక్కు.1969 లో గడాఫీ గద్దె నెక్కే నాటికి అక్షరాస్యతా శాతం కేవలం 25 మాత్రమే ఇప్పుడు అది 83 శాతం. ఆ దేశానికి ఎక్కడా అప్పులు లేవు. పుట్టిన ప్రతి బిడ్డ కి 5000 డాలర్స్ బాంక్ లో జమ చేయబడతాయి. అన్నిటికంటే అధ్బుతం ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత నది లిబియాలోనే ఉంది.సహారా ఎడారి లో ఇక భవిషత్తు లో అ దేశానికి నీటి కొరత లేకుండా  కొన్ని వేల కిలోమీటర్ల పాటు ఒక నది నే నిర్మించిన సాహసికుడు గడాఫీ. ప్రపంచం లో ఇది ఎనిమిదో అద్భుతం గా వర్ణించాడు. కానీ ఆ ప్రయత్నం పూర్తి కాక ముందే గడాఫీ శకం అంతరించింది.
 నిజంగా నియంతలు ప్రజా కంటకులైతే, భగవంతుడి సృష్టి తో పోటీ పడి నిర్మించే ఈ నదులు,ఆకాశ హర్మ్యాలు,తమ దేశాన్ని అగ్రపధాన నిలపాలనే తపన, ప్రజలకి మెరుగైన రవాణా సౌకర్యాలు,ఇంజనీరింగ్  నైపుణ్యాలు, ఇవన్నీ చెయ్యాల్సిన అవసరమేముంది. సహజ వనరుల్ని అమ్ముకుని తాము మాత్రమే విలాస జీవితాన్ని గడపచ్చు. కానీ లిబియా లో సహజ వనరులైన చమురు నిక్షేపాలపై వచ్చే లాభం లో కొంత శాతం ప్రతి పౌరుడి  ఖాతా లోకి చేరుతుంది.తమ సామ్రాజ్య వాదానికి తలవంచని ఆఫ్రికా దేశాలన్నిటి మీద నియంతృత్వం అనే ముద్ర వేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూసిన అమెరికా, ఆ నియంతృత్వ పాలన ముగిసిన ఏ దేశంలోను ఇప్పటిదాకా శాంతిని నెలకొల్పలేకపోయింది. వేల కోట్లు తిన్న లంచగొండులు,మతోన్మాదం తో సామాన్య పౌరులను  పొట్టనపెట్టుకుంటున్న తీవ్రవాదులు,అంతర్జాతీయ నేరగాళ్ళను పట్టుకోలేని అమెరికా పెద్దన్న, తన సొంత గడ్డ పై ప్రజలకు 42 సంవత్సరాల పాటు అధిపతిగా ఉండి తమ దేశానికి ఒక రూపు రేఖలని కల్పించి ప్రపంచ పటం లో ఒక గుర్తింపుని తీసుకువచ్చిన పాలకుడిని ఇంత హేయమైన స్థితికి దిగజార్చటం మాత్రం శోచనీయం.ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాలలోనే మొదలైన ఈ అంతర్యుద్ధం ఇటీవల మధ్య ప్రాచ్య దేశాలకి పాకింది.బహ్రెయిన్ లో ఇటీవల అల్లర్లు రాజుకున్నా పాలకులు వాటిని నియంత్రించగలిగారు.కానీ భవిష్యత్తు లో గడాఫీ పొందిన చావు మరే రాజులకి రాకుండా వారే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పితే ఇన్ని రోజులుగా వారు సాధించిన వారి దేశ ప్రగతికి చిహ్నాలు గా చరిత్ర లో మిగిలిపోతారు.

 

Dated : 29.10.2011

This text will be replaced