నాన్నా, తాత పేరేంటి?Back to list

 

 నాన్నా, తాత పేరేంటి?

మీ తండ్రి పేరేంటి అనగానే ఠక్కున చెప్పేస్తాం, తాత పేరు అనగానే కొంచెం తడుముకున్నా వెంటనే చెప్తాం. మరి ముత్తాత పేరు? కష్టం కదా ! చాలా కష్టం ఇక ముందు ముందైతే తాత పేరు చెప్పటం కూడా కష్టమే. ఇటీవలే నేనొక వివాహానికి హాజరైనపుడు అప్పటిదాకా నేను చూడని వాళ్ళు, కేవలం వెబ్ సైట్ ద్వారానే నన్ను ఎరిగిన వారు కలిసినపుడు వెబ్ సైట్ లో ఉన్న పలు అంశాల గురించి చర్చించారు. వాటిలో ముఖ్యమైనది వంశ వృక్షాలు. ఓ పెద్దాయన చెప్తూ ఇటీవల పల్నాటి వంశస్తులు 11 వ శతాబ్దం నుంచి తమ వంశ వృక్షాన్ని తయారు చేసుకున్న సంగతి ప్రస్తావించారు. ఓ వంశ వృక్షాన్ని తయారు చెయ్యటంతోనే మేము ఈ వెబ్ సైట్ మొదలు పెట్టాం. ఏమో ఎవరికి తెలుసు రేపు మన పిల్లలో పిల్లలకి పిల్లలో మా తాత ఎవరు? నా ముత్తాత ఎవరు? నా మూలాలేమిటి అని అడిగితే ఏం చెప్తాం? ఇప్పటికీ మన ఉరిలో చాలామందికి తమ వంశ మూలాలేమిటి తామెవరు అనేది తెలీదు. ఇక మా తరం వాళ్ళకైతే ఇంకా ఘోరం. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మనం గుర్తించని, మనకు తెలీని చరిత్ర కారులు ఇంకా గ్రామం లో బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళ  నుంచి ఆసక్తి గా ఆనాటి  విషయాలని, పెద్దల వివరాలని తెలుసుకునే ఓపిక మనకే లేదు. కానీ మనం అడగ్గానే ఎంతో ఉద్వేగానికి లోనై ఆనాటి విశేషాలని తమ పెద్దల గొప్పతనాన్ని వారు బతికిన రోజుల్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. మనలాగా వాళ్లకి రాసుకోవటానికి  పుస్తకాలు, చదవటానికి బ్లాగులు లేవు. మనో ఫలకం మీద మెదిలే ఆ అపురూప జ్ఞాపకాలు ఎప్పుడు పంచుకుందామా అని వారి మనసులు ఉవ్విల్లూరుతుంటాయి. తమ తాతలు ముత్తాతలు పెదనాన్న లు పెద్దమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వారి మాటలు, ఇన్నేళ్ళైనా వారిని వెంటాడుతుంటాయి. కానీ మనకున్నాయా ఆ జ్ఞాపకాలు? అందరూ అంతస్తులు ఇవ్వకపోవచ్చు,ఆస్తులు పంచకపోవచ్చు. కానీ విలువలతో కూడిన చరిత్రనిచ్చారు. ఫలానా వారి మనవడిని అనో మనవరాలిని అనో చెప్పుకోటానికి మనకంటూ ఒక గుర్తింపు నిచ్చారు. వీటన్నితో పాటు ఆ కాలం లో ఉండే నిక్ నేమ్స్ (క్షమించాలి,తెలుగు లో ఏమంటారో తెలియదు) ఫలానా బంగారు సీతారామయ్య, మునసబు గారి లీలాక్రిష్ణయ్య, రామన్న గారి సుబ్బయ్య, రంగన్న గారి వెంకన్న, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కో గుర్తింపు నిచ్చింది మన పెద్దలే. ఇప్పుడు లేదు గాని ఇంతకుముందు తమ పూర్వీకుల పేర్లు యధా తధం గా తమ పిల్లలకి పెట్టుకునేవాళ్ళు. కాలం మారాక ఆ పాత పేర్లని కొంచెం మోడరన్ గా మార్చి రామసుబ్బయ్య ని రామకృష్ణ అని సుబ్బయ్య అయితే సుభాష్ అని పెట్టటం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడైతే అవి కూడా లేవు. ఇవన్నీ మనకి వాళ్ళ మీద ఉన్న మమకారానికి గుర్తులే. కళ్ళ ముందు కనిపించక పోవచ్చు భౌతికం గా దూరం అవ్వచ్చు. అంత మాత్రాన వారితో మన బంధం తీరిపోదుగా. వారి జ్ఞాపకాలకి ట్రస్టీలం మనమే. గ్రామం లో ఉన్న ఆనాటి ఫోటోలని ఇప్పుడు మనం పరిరక్షించు కోకపోతే ఇక మన వంశ మూలాలు మర్చిపోవాల్సిందే. వాటిని కాపాడుకోవటానికి  మీ పర్సనల్ బ్లాగులైనా డిజిటల్ ఆల్బమ్స్ అయినా సాయపడతాయి.

మన గ్రామంలో దొరికిన ఆనాటి పెద్దల ఫోటో 

ఈ మధ్యే ఎక్కడో చదివా, ఏంజెల్ గొంజాలెజ్ అనే స్పానిష్ రచయిత మరణించిన పూర్వీకుల స్మృతి గురించి ఓ కవిత రాసాడు.

మరణించిన వారు స్వార్ధ పరులు, మనం వెక్కి వెక్కి ఏడుస్తున్నాఒక్కసారైనా ఊరడించరు. వాళ్ళంతే, నడవటానికి కూడా బద్దకమే,భుజాన మోయించుకుంటారు. పిల్లల్లా స్నానం చేయించుకుంటారు.ఎంత దర్పమో, మనకి తెలియని సత్యాలేవో తెలిసినట్లు మనం చూడని లోకాలేవో చూసినట్లు, వెళ్ళేటప్పుడు మాట వరసకైనా చెప్పరే! మహా మొండి ఘటాలు, హెచ్చరిస్తున్నట్లో, మనల్ని నిందిస్తున్నట్లో మొహం మాడ్చుకుంటారు. తమ మాటే నెగ్గాలన్నట్లు బిర్ర బిగుసుకు పోతారు. తామే ప్రత్యేకమైనట్లు కర్రల రధమెక్కి ఊరేగుతారు. మహా మతిమరపు, ఏది గుర్తుంచుకోరు ఎవర్నీ గుర్తుంచుకోరు. మనం మాత్రం గుర్తు చేసుకోవాలి ఏడాది కి ఒకసారైనా. 

కర్మలు, సంతర్పణలు, చనిపోయిన వారి ఫోటోలు మనిషిలోని భయాన్ని పోగొడతాయి. రేపు మనం పోయినా మన పిల్లలు ఫోటోల రూపం లో అయినా మనల్ని గుర్తుపెట్టుకుంటారనే చిన్న ఆశ. మనం బాగా ఇష్టపడే వాళ్ళింటికి వెళ్ళినపుడు మన వస్తువు ఏదో ఒకటి వదిలేసి వస్తాం, ఆ సాకు తో మళ్లీ వెళ్ళచ్చు. బ్లాక్ అండ్  వైట్ ఫోటో లు, పందిరి మంచాలు, మండువా ఇళ్ళు, పడక కుర్చీలు, చేతికర్రలు, మన పూర్వీకులు మనకి వదిలిన జ్ఞాపకాలు.. 

Dated : 01.11.2011

This text will be replaced