స్నేహ సుమాంజలిBack to list

స్నేహ సుమాంజలి

ఆయనేమీ రాజకీయనాయకుడు కాదు, కేవలం తన స్నేహితులకి  స్నేహ మాధుర్యాన్ని, ఆత్మీయులకి అచంచలమైన ప్రేమానురాగాలని పంచిన ఒక సామాన్యమైన వ్యక్తి. రోడ్డు ప్రమాదం లో మధు మనకి దూరమై నేటికి పదిహేనేళ్ళు. అయినా తమ స్నేహితుడిని మర్చిపోలేని కొంతమంది యువకుల స్నేహ సౌశీల్యత కి రూపం క్రాంతి యువజన సంఘం. ఇన్ని సంవత్సరాలు గడచినా తమ స్నేహితుడి జ్ఞాపకాల్ని ఎప్పటికప్పుడు పదిలపరుస్తూ వాటికి మరిన్ని నూతన సొబగులు అద్దుతూ మంచి కార్యక్రమాలతో తమ స్నేహితుడిని అమరుడి గా నిలబెడుతున్నారు. ఈ గొప్పతనం మరణించిన ఆ వ్యక్తిదా ? లేక నిస్వార్ధం గా కేవలం స్నేహం కోసమే అతన్ని ఆరాధిస్తున్న ఆ స్నేహితులదా ? ఈ ప్రశ్నకి సమాధానం ఖచ్చితం గా అందరికీ తెలుసు. ఆ గొప్పతనం ఇద్దరిదీనూ. 1996 లో మధు మామయ్య చనిపోయేనాటికి తన వయసు 27 ఏళ్ళు, అయన స్మారక చిహ్నంగా స్నేహితులంతా కలిసి పెన్నేరమ్మ గుడి పక్కనే ఒక రుద్రాక్ష చెట్టుకు ఒక అరుగు కట్టించాలని నిర్ణయించారు. అది కడుతున్నపుడు రోజూ నేను అక్కడే ఉండేవాడిని. కట్టటం పూర్తయ్యాక అక్కడ ఒక స్లోగన్ రాద్దామని యువజన సంఘం సభ్యులంతా తెగ ఆలోచిస్తుంటే ఓ వ్యక్తి స్కూటర్ పై అటు వెళ్తూ విషయం ఏంటి అని అడిగాడు.వాళ్ళు విషయం చెప్పగానే ఏ మాత్రం తడుముకోకుండా "మరపురాని స్నేహం తో మధురానుభూతి ని పంచిన ఓ మిత్రమా నీకిది మా స్నేహ సుమాంజలి" అని చెప్పి అంతే వేగంగా వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ స్లోగన్ అరుగు మీద కనిపిస్తుంది. అలా చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి ఎవరో కాదు, ఒకప్పుడు రవితేజ టిఫిన్ సెంటర్ పెట్టి గ్రామాన్ని ఒక ఊపు ఊపిన నారాయణ. అలా కట్టించిన ఆ అరుగే మధు దిమ్మ గా పాపులర్ అయ్యింది. ఊర్లో కుర్రాళ్ళ అందరికీ అది హాట్ స్పాట్. పండగలకి, సెలవులకీ ఊరు వచ్చే యువతకి మిత్రుల్ని కలుసుకునే మీటింగ్ పాయింట్. ఎక్కడున్నావ్ రా, ఊర్లోకి వచ్చావా? సరే, మధు దిమ్మ కాడికి వచ్చెయ్యి. ఇక కబుర్లు మొదలు,రాత్రి ఒంటి గంట వరకు లోకాభిరామాయణం. మధు మిత్రులకి అది తమ స్నేహితుడి స్మారక చిహ్నం, కానీ ఈ తరానికి అది రచ్చబండ, పోసుకోలు కబుర్లకి, సరదా సన్నివేశాలకి అది కేరాఫ్ అడ్రస్.

 మధు పదిహేనవ వర్దంతి సందర్భం గా ఇప్పుడు దానికి ఒక తాటిపాక వేసారు. గ్రామ కచ్చేరి చావిడి అని ఇంతకు పూర్వం  ఉండేవి.ఆ సంస్కృతి మళ్లీ కనిపించేలా ఆ దిమ్మ ని తీర్చిదిద్దారు.రెడ్ క్రాస్ సొసైటీ తో కలిసి రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. క్రాంతి యువజన సంఘం తరపున తుమ్మల వెంకటేశ్వర రావు (బుజ్జి) తాతినేని కిషోర్,తుమ్మల రేణు,శ్రీనివాసరావు ,వేమూరి బాలాజీ,గొర్రెపాటి సురేష్  తో పాటు పలువురు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 కేవలం తాము కూర్చునే హాట్ స్పాట్ గానే భావించకుండా తమ భాద్యత గా ఈ తరం యువకులైన గొర్రెపాటి రాకేశ్, వేమూరి ప్రమోద్ తాము రక్త దానం చెయ్యటమే కాకుండా SRYSP - CHALLAPALLI College నుంచి యువకులను కూడా ఈ కార్యక్రమం లో భాగస్వాములని చేసి, మొత్తం 40 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ కి అందించారు. స్మారక చిహ్నాలంటే కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు, జాతికి మేలు చేసే ప్రజోపయోగ కేంద్రాలు అని నిరూపిస్తున్నక్రాంతి యువజన సంఘం భవిస్యత్తు లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తి గా ఆశిస్తూ...................

Dated : 15.10.2011

This text will be replaced