పెద్దలారా మన్నించండిBack to list

                                                                                 పెద్దలారా మన్నించండి

 పంజాబ్ లో బార్బర్ షాప్ పెట్టి దివాలా తీసిన వాడి మొహం నువ్వూను.. జంధ్యాల సినిమాలు చూసిన వాళ్ళందరికీ పరిచయమైన తిట్టు. కానీ అది కామెడీ....ఇప్పుడు ఆ కామెడీ నే ఒక ట్రాజడీ కి ఉపమానం గా తీసుకోవటం బాధ గానే ఉన్నా అంతకుమించి న వాక్యం నాకు దొరకలేదు. గ్రామాల్లో వృద్ధాశ్రమం కూడా అలాంటిదే అనే భావన ఉండేది నాకు. ఉపిరి సలపని ఒత్తిడి , భార్య , భర్త ఇద్దరు పిల్లలతో తీరిక లేక , పెద్దవాళ్ళని భరించలేక వారి అవసరాలని చూడలేక నగరాల్లో పెద్దవాళ్ళని ఆశ్రమాల్లో చేరుస్తుంటారు కాబట్టి ఎక్కువ ఆశ్రమాలు నగరాలలోనో లేక నగర శివార్లలో నో దర్సనమిచ్చేవి.ఆ మధ్య  అమెరికా నుంచి మూల్పూరి  రత్నశేఖర్ తాడేపల్లి ఆశ్రమం గురించి ఆసక్తిని ప్రదర్శించి ఆ వివరాల్ని కూడా పొందుపరచమని సూచించినపుడు ఆ ఆశ్రమానికి వెళ్లి అక్కడి వారితో మాట్లాడి అక్కడ మనుషుల్ని చూసాక అనిపించింది, అడుగంటి పోతున్న ఆప్యాయతలు నగర జీవనంలోనే కాదు పచ్చని పొలాలు స్వచ్చమైన మనుషులకి ఆలవాలమైన పల్లెలకి కూడా వ్యాపించాయని.

 తాడేపల్లి వృద్ధాశ్రమ ప్రాంగణం 
 
కానీ ఒక రకం గా పల్లెల కంటే పట్టణాల్లో ఉండే పెద్దలే మనవళ్ళని, మనవరాళ్ళని స్కూల్ కి తీసుకు వెళ్తూ వాళ్ళ ఆలనా పాలనా చుస్తూ కుటుంబం లో అప్యాయతలకి , అనురాగానికి నోచుకుంటున్నారేమో. ఈ మధ్య ప్రమాదం లో మృతి చెందిన ఒక వ్యక్తి తల్లిని ఆమె  సంబంధీకులంతా పశువుల కొట్టం లో వదిలేసిన సంఘటన నన్ను మరింత కలచివేసింది. పల్లెల్లో వృద్ధాశ్రమాల ఆవశ్యకత ని తెలియచేసింది. మానవత్వం ఉన్న కొంతమంది పెద్దలు ఆశ్రమానికి సమాచారం అందించటం తో ఆశ్రమ  నిర్వాహకుడైన వేమూరి రాంబాబు హుటాహుటిన ఆమెని ఆశ్రమానికి తీసుకువచ్చారు.ఇటీవల రాంబాబు గారిని కలిసినపుడు ఈ సంఘటన చెప్తూ అసలు ఆమె ఆ పశువుల కొట్టం లో ఉన్న స్థితి ని వివరిస్తుంటే చెప్తున్న ఆ గొంతు వణికింది ,వింటున్నపుడు నా కళ్ళు చెమర్చాయి.కన్న వాళ్ళే తల్లి దండ్రుల్ని ఇలా చేస్తున్న రోజుల్లో అందరికి తానై వాళ్ళ కు అండగా నిలుస్తున్న రాంబాబు గారిని చూస్తే ఆధ్యాత్మికత అనేది మాధవ సేవలో కాదు , మానవ సేవలోనే ఉందనిపించింది.నరకం అంటే సల సల కాగే నూనె లో ముంచడమో,ముళ్ళ కంచెల మీద నడిపించటమో కాదు,నిన్న మొన్నటి దాకా ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు మన ఉనికినే గుర్తించక పోవటం, ఎదురుగా ఉన్నా లేనట్లే ప్రవర్తించటం.
 
కుటుంబం కోసం జీవితం ధార పోశారు ,దశాబ్దాల పరుగులో అలసిపోయారు , ప్రపంచాన్ని చదివిన బుద్ధి జీవులు జీవితాన్ని కాచి వడపోసిన అనుభవ సంపన్నులు, నేడు వేరు తెగిన వృక్షాల్లా కూలిపొతున్నారు, నిస్సహాయులై కన్నీళ్లు పెడుతున్నారు. ఆరేడు దశాబ్దాల జీవితం, సగర్వ విజయాలు, బోలెడన్ని అనుభవాలు, జ్ఞాపకాలు ఎవరికి చెప్పుకోవాలి ? ఎవరు మాత్రం వింటారు. కొన్నిసార్లు గోడలే శ్రోతలవుతాయి, శూన్యమే సభా ప్రాంగణం అవుతుంది. వాళ్ళేమి రాచ మర్యాదలు అడగట్లేదు, విలాసాలు వైభోగాలు కోరుకోవట్లేదు మనిషిగా గుర్తిస్తే చాలంటున్నారు పొద్దున్నే కాఫీ తో పలకరింపు ..మధ్యాహ్నం భోజనం చేసారా అనే ఆరా. నీరసం గా కనిపిస్తే ఆరోగ్యం ఎలా ఉంది అనే పరామర్శ. మనకి జీవితాన్నిచ్చిన వాళ్ళకి ,మనల్ని తీర్చి దిద్దటానికి జీవితాన్ని ధారపోసిన వాళ్ళకి మనం ఆ మాత్రం చెయ్యలేమా?????

 

Dated : 17.09.2011

This text will be replaced