శుభకార్యాలలో పర్యావరణ రక్షణBack to list

శుభకార్యాలు నిర్వహించడం ఎలా?
 
ఇటీవల కాలంలో రకరకాల శుభాకార్యాలు - సరదా కలయికలు (GET-TOGETHERS), పుట్టినరోజు వేడుకలు, పెళ్ళి నిశ్చితార్ధాలు, మెహందీ వేడుకలు, సంగీత్ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, గృహప్రవేశాలు, అమ్మాయిలకు ఓణీలు, అబ్బాయిలకు పంచెలు ఇవ్వడం, పెళ్లి రజతోత్సవ వేడుకలు, షష్టిపూర్తి మహోత్సవాలు, ప్రముఖులకు సన్మానాలు, పూర్వ విద్యార్ధుల కలయికలు వగైరాలు నిర్వహించడం తరచుగా చూస్తున్నాం.
వందల, వేలమందిని ఆహ్వానించి, వారి మనస్సులు నొచ్చుకోకుండా, విసుగు చెందకుండా, వారిని సంతోషంగా ఇంటికి పంపడం కత్తి మీద సామే మరి!
 
వాహనముల నిలుపుదల :
శుభకార్యాలకు హాజరయ్యేవారిలో ఎక్కువమంది స్వంత వాహనములలో – మోటారు సైకిల్స్ లేదా కార్లలో వస్తున్నారు. కనుక వాహనాల పార్కింగ్ కు ప్రతిష్టంభన లేకుండా చూడటానికి తగిన మనుష్యులని ప్రత్యేకంగా నియమించాలి.
 
అతిధులను ఆహ్వానించడం (రిసెప్షన్) :
ఏ శుభకార్యానికైనా వెళ్ళాలంటే, మొదటగా ఒక బెరుకు ఉంటుంది. అక్కడ మనకు తెలిసిన వారుంటారో లేదో, ఏమన్నా ఇబ్బంది పడతామేమోనని...
 
అందుకని కార్యక్రమ నిర్వాహకులు (ఉదా: పెళ్ళికూతురు తల్లి, తండ్రి) వేదికపై ఉండాల్సి వచ్చినా, గేటు దగ్గర వారి బంధుమిత్రులు ఒక సమూహంగా ఉండి, వచ్చిన వారందరినీ ఆహ్వానించి, హాలులోనికి తీసుకువెళ్ళి, సరైన సీటు చూపించాలి. అప్పటికే వచ్చిన వాళ్ళలో కొత్తగా వచ్చిన వారికి తెలిసిన వారిని కలిపితే సంతోషంగా అనిపిస్తుంది.
 
ముందుగా మంచినీరు గానీ, పళ్ళరసం గానీ ఇవ్వాలి.
Host ఎక్కడ ఉన్నారో ఒక్కమాట చెబితే మంచిది. తిరిగి వెళ్ళేలోపు కలవవచ్చు అనే ధైర్యం వారికి వస్తుంది. ఎందుకంటే, వచ్చిన ప్రతి అతిధి Host కు కనిపించాలి అని కోరుకుంటారు కనుక.
Host కు వేదికపై పని లేనట్లయితే, రిసెప్షన్ లో ఉండటం ఇంకా మంచిది.
 
సమయ పాలనం:
ఏ శుభకార్యానికైనా, ప్రకటించిన సమయం ప్రకారం ఖచ్చితంగా హాజరయ్యే అతిథులు కొందరుంటారు. వారు సరైన సమయానికి వచ్చి, వధూవరులు గానీ, ఆతిథ్యమిచ్చేవారు గానీ ఆలస్యంగా వస్తే, అతిథి, అభ్యాగతుల మనస్సులు చివుక్కుమంటాయి. కనుక వధూవరులు నిర్ణీత సమయాన్ని పాటించడం అవసరం.
 
కార్యక్రమం:
వేదికపై జరిగే కార్యక్రమం క్రింద కూర్చున్నవారికి అర్థం అయ్యేటట్లుగా ఉంటే బాగుంటుంది. ఓ గంట కార్యక్రమం వేదిక మీద జరుగుతూ ఉంటే, క్రింద కూర్చున్న అతిథులు మెదలకుండా కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది.
తక్కువ సౌండ్ తో మైక్ ఏర్పాటు చేయవచ్చు.
పంతులు గారు లేదా పెద్దలు వేసే జోకులు సరదాగా ఉండవచ్చు కదా!
వధూవరులపై అక్షింతలు వేసేటప్పుడు వరుస పద్ధతి పాటించడం మంచిది. ముందుగా వధూవరుల తల్లిదండ్రులు, వృద్దులు అక్షింతలు వేసేవరకు మిగతావారు ఆగితే బాగుంటుంది.
 
వేదికకు ఒకవైపు నుండి ఎక్కి, మరోకవైపుకి దిగితే సౌకర్యంగా ఉంటుంది. వదూవరులకు రిసెప్షన్ లో అయితే, అక్షింతలు వేయించుకొనడం బాగానే ఉంటుంది. (ప్రక్కప్రక్కనే కూర్చొంటారు కనుక). జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత ఓ వెయ్యి మందికి పైగా అక్షింతలు వేసేదాకా అలానే తల వంచుకు కూర్చోవడం వలన వాళ్ళ మెడ పట్టేసిన సంఘటనలు ఉంటున్నాయి. కనుక ముఖ్యమైన పెద్దలు అక్షింతలు వేసిన తరువాత వధూవరులను ప్రక్కప్రక్కన కూర్చోబెడితే సౌకర్యంగా ఉంటుంది. అక్షింతలు వేసి వెళ్ళేటప్పుడు Host అతిథులను పలుకరించి, భోజనం చేసి వెళ్ళమని చెప్పాలి (భోజన ఏర్పాటు ఉండి ఉంటే).
 
అవసరమైన వారికి బాత్ రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలుపడానికి కొద్దిమంది బాధ్యులు అందుబాటులో ఉండాలి.
 
వధూవరులు – సెల్ ఫోన్లు:
ఇటీవల ఒక పెళ్ళిలో తాళి కట్టగానే వరునికి ఓ కాల్ వచ్చింది. పెళ్ళికి రాలేకపోయిన దగ్గర బంధువు తాళి కట్టగానే అభినందనలు చెప్పాలని ఫోన్ చేశారట. మాట్లాడినంతసేపు అక్షింతలు వేయడానికి వచ్చిన పెద్దలు అంతా స్టేజి మీద అలాగే వేచి ఉండవలసి వచ్చింది. రిసెప్షన్లో కూడా వధూవరులు అప్పుడప్పుడూ అక్షింతలు వేయించుకుంటూనే సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. ఇలా చేస్తే అక్షింతలు వేసే పెద్దలను అగౌరవపరిచినట్లే కదా!
 
భోజనాలు :
భోజనాల కోసం ఎక్కువసేపు వేచి ఉండటం అతిథులకు ఇబ్బంది. కొంతమందికి “బఫే” ఏర్పాట్లు చేసి, వృద్ధులకు, పిల్లలకు బల్లలపై భోజనాలు ఏర్పాటు చేసి, నిరీక్షణను (WAITING) తగ్గించవచ్చు. బఫేలో ప్లేటులో వడ్డించుకున్న తర్వాత, కౌంటర్ కు కాస్త దూరంగా జరిగి భోజనం చేస్తే మిగతా వారికి ఖాళీ వస్తుంది.
 
పర్యావరణ పరిరక్షణ కోసం ఈక్రింది జాగ్రత్తలు తప్పనిసరి
భోజనాల బల్లలపై కాగితం మాత్రమే పరచాలి. ప్లాస్టిక్ కాగితం వేయకూడదు. 
మంచినీళ్ళ గ్లాసులు, టీ కప్పులు స్టీల్ వి కాని, గాజువి కాని, పేపర్ తో చేసినవి కాని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు వాడకూడదు.
ప్లాస్టిక్ విస్తర్లు, తగరం విస్తర్లు, ప్లాస్టిక్ అరిటాకులు వాడకూడదు.
అరటి ఆకులు గానీ, ఆకులతో కుట్టిన విస్తర్లు గానీ వాడటం మంచిది.
బఫే భోజనానికి ప్లాస్టిక్ ప్లేటులు కాని, పింగాణి ప్లేటులు కాని, వక్క ఆకుతో చేసిన ప్లేటులు (ఇవి భూమిలో కలిసిపోతాయి) వాడుకోవాలి.
తరిగిన కూరల తుక్కును, మిగిలిపోయిన ఆహారాన్ని రోడ్డు ప్రక్కన వేయక, పంచాయతీ లేక మునిసిపాలిటీ వారు నిర్దేశించిన చోట్లనే వేయాలి. బహుమతులు ఇచ్చేందుకు ప్లాస్టిక్ సంచులకు బదులు నార, గుడ్డ సంచులను వాడాలి.
 
పరిసరాల పరిశుభ్రత :
భోజనాలు చేసే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం అవసరం. మనం భోజనాలకు కూర్చొనేటప్పటికి నేల మీద ఆహార పదార్ధాలు పడి తడిగా, రొచ్చుగా ఉంటే, మర్యాద కోసం తినడం తప్ప, నిజంగా భోంచేయాలని అనిపించదు. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మనుష్యులను నియమించి, వారిపై అజమాయిషీ చేయడానికి ప్రత్యేకంగా ఒకరిని ఉంచాలి. (మిగతా వారు ఎవరు చెప్పినా, ఆ మనుష్యులు వినరు కనుక, వారిని నియమించిన వారే అజమాయిషీ చేయడం మంచిది). చేతులు కడిగే ప్రదేశంలో తగినన్ని చెత్త బుట్టలు ఏర్పాటు చేస్తే కిళ్ళీల కాగితాలు, పేపర్ నేప్ కిన్స్ వేస్తారు. బాగా దగ్గర వాళ్ళని తప్పితే, భోజనాలు ఎలా వున్నాయి అని ఎవరినీ అడగవద్దు. బాగుంటే వారే చెప్తారు. మంచి భోజనం పెట్టగలగడం అదృష్టం. ఎంత మంచి వంట మేస్త్రిని పెట్టినా ఒక్కోసారి రుచిగా చేయలేకపోవచ్చు. వంట చెడినా అతిథులు బాధపడరు. ‘అరె పాపం, కుదరలేదు’ అని జాలి పడతారు. కానీ, రిసెప్షన్ సరిగా లేకపోతే అతిథులు చాలా బాధపడతారు. జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.
 
ఇంటికి వెళ్ళి గానీ, ఫోన్ చేసిగానీ ఆహ్వానించిన అతిథులను సంతోషపరిచి, పంపించడం host బాధ్యత.
ఈ శుభకార్యానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి పంపితే అతిథులకు సంతోషంగా ఉంటుంది.
 
డా. డి.ఆర్.కె. ప్రసాదు, M.B.B.S., D.G.O.
పద్మావతి హాస్పిటల్, చల్లపల్లి – 521 126
చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా
సెల్ నెం : 9885051179