రాబోతున్న పెనుముప్పుBack to list

మే, 2014 ‘ప్రజాసాహితి’ – మే, జూన్ నెల ‘ఉపాధ్యాయ’ పత్రికలలో ప్రచురించబడినది

రాబోతున్న పెనుముప్పు

తాము అధికారం లోనికి వచ్చిన తర్వాత ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మార్చేస్తానని వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఎన్నికల వాగ్దానం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటా పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలోనే ఉంటుందని కె.సి.ఆర్. ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు తన వైఖరి ఇటీవల ప్రకటించలేదు. రేసులో వెనుక పడకుండా ఉండడానికి రేపోమాపో ఆయన కూడా ఇదే అభిప్రాయం చెప్పవచ్చు. మిగతా పార్టీలేవీ బోధనా భాష విషయం గురించి ప్రస్తావించడం లేదు. నాకు తెలిసి సి.పి.ఐ.ఎం.ఎల్. (తరిమెల నాగిరెడ్డి గ్రూప్) మాత్రం మొదటి నుండి పరభాషా మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది.

సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య తన ఊర్లో ఇంగ్లీషు మీడియం బడిని ప్రారంభించారు. ఆయన ఇంగ్లీషు మీడియంలో చదవలేదు. తరువాత కాలంలో ఇంగ్లీషులో దిట్ట అయిన ఆయన, పేదలు ఎదగడానికి ఇంగ్లీషులో ప్రావీణ్యతే ఉపయోగపడుతుందని నమ్మి అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదవాలని వాదిస్తున్నారు. అయనలాగే ఆర్థికంగా, సామాజికంగా బాగా ఎదిగిన కొందరు ‘సేవ చేద్దాం’ అనే భావనతో తమ స్వంత ఊళ్ళల్లో ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ప్రారంభిస్తున్నారు.

3-4 సంవత్సరాల వయస్సున్న పిల్లలు తమ ఇంట్లోనూ, చుట్టుప్రక్కల వారూ మాట్లాడే భాషను సహజంగా నేర్చుకుని చక్కటి భావ వ్యక్తీకరణ చేయగలరు. అదే వారి సొంత భాష అవుతుంది. మరిన్ని కొత్త విషయాలు నేర్చుకొంటానికే గదా బడికి పిల్లల్ని పంపుతున్నాము. తెలియని కొత్త విషయాలను తెలిసిన భాష ద్వారా చెబితే అర్థం చేసుకుంటారు గానీ తెలియని ఆంగ్లభాషలో తెలియని కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటారు? పెద్దగా మేధాశక్తి అవసరం లేని అతి చిన్నదైన ఈ సూత్రం సర్వజ్ఞుల మనుకొంటున్న మన తెలివిగల నేతలకు ఎందుకు బోధపడడం లేదో!

భవిష్యత్తులో ఉద్యోగాలు దొరకాలంటే ధాటిగా ఇంగ్లీషు మాట్లాడమే ముఖ్యమైన అవసరం అని మన తెలుగు పిల్లల తల్లిదండ్రుల ప్రస్తుత అభిప్రాయం. ఈ విషయాన్ని పసికట్టిన ప్రైవేటు పాఠశాలలు ఆంగ్ల విద్యతో వ్యాపారం చేస్తున్నాయి. ఫీజులు ఎక్కువ కట్టగలిగిన వారంతా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. అలా చదివించలేని పేదలు తమ పిల్లల్ని మంచి చదువులు చదివించలేకపోతున్నామని దిగులుపడి ప్రభుత్వాన్ని వత్తిడి చేశారు. గత ప్రభుత్వం ఆ డిమాండుకు లొంగి “సక్సెస్ స్కూళ్ళ” పేరుతో 6వ తరగతి నుండి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను మొదలుపెట్టింది. సైన్సు, సోషల్, లెక్కలు సబ్జక్టులను తెలుగులో చదివి అర్థం చేసుకుని తెలుగులో రాయడం తేలిక. బట్టే పట్టనవసరం లేదు. పాఠశాలల్లోనూ, ఇంటి వద్దా ఆంగ్లభాషా వాతావరణం లేక, తగినంత సంఖ్యలో అర్హులైన బోధకులు కూడా లేక ఆచరణలో సక్సెస్ స్కూళ్ళు “ఫెయిల్యూర్ స్కూళ్ళు” అయ్యాయని ఉపాధ్యాయులే చెబుతున్నారు.

నెమ్మదిగా ఆంగ్ల మాధ్యమంలో చదివే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి ఆంగ్ల మాధ్యమంలో పదవ తరగతి పరీక్షలు రాసినవారు దాదాపు 45 శాతం పైనే వున్నారు. మరికొద్ది సంవత్సరాలలో నూరుశాతం ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకున్నా ఆశ్చర్యం లేదు.

విదేశీ భాషలో అయినా సబ్జక్టులు అర్థం చేసుకుని నైపుణ్యం పెంచుకోగలిగిన వారు 5 శాతం మాత్రమే ఉంటారు. వీరు బలమైన గిత్తలు. ఏటికెదురీద గలవాళ్ళు. ఎంత కష్టమైనా చదువుపై ఉండే ఆసక్తితో అర్థంకాక, బట్టీపట్టి పాస్ మార్కులు తెచ్చుకుని తల్లిదండ్రులను, టీచర్లను సంతోషపెట్టగలరు గానీ తమ సృజనాత్మకతను కోల్పోయి, ఏదో ఒక ఉద్యోగానికి సిద్ధపడతారు. రాను రాను మన ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగం చేసే సిబ్బందిని తయారుచేసే కర్మాగారాలుగా తయారవుతాయి. బహుళజాతి కంపెనీల రకరకాల వస్తువుల పేర్లను ఇంగ్లీషులో చదవగలిగిన వినియోగదారులను పెంచుతాయి. పరాధీన భావజాలంతో బ్రతుకులు గడుస్తుంటాయి. మన దేశం తన ఆత్మను కోల్పోయి వలస దేశంగా మారిపోతుంది.

తమ తమ సొంతభాష లోనే ప్రపంచంలోని పిల్లలంతా చదువుకుంటున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, కొరియా, జపాన్ వంటి ఏ దేశంలోనూ పిల్లలు పరభాషలో చదువుకోవడం లేదు. ప్రత్యేక అవసరం వున్నవారు తమకు కావలసిన పరభాషను నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు దక్షిణ కొరియాలో ఎల్.కె.జి. నుండి పి.హెచ్.డి. పరిశోధన పట్టా వరకూ కొరియన్ భాషలోనే చదువుతారు. మిగతా దేశాలతో వ్యాపారం చేయడానికి ఆయా దేశాలకి సంబంధించిన భాషలను (ఇంగ్లీషు, జర్మనీ, ఫ్రెంచ్, హిందీ) అవసరం అయిన వారు నేర్చుకుంటారు. పరభాషలో విద్యనభ్యసించిన దేశాలలో పరిశోధనా రంగాలలో అభివృద్ధి చాలా తక్కువ. సృజనాత్మకంగా వుండి, తమ దేశ వనరులను ఉపయోగించి, స్వావలంబనకు పాటు పడకుండా బహుళజాతి సంస్థలకు సేవ చేసే ఉద్యోగులుగా మాత్రమే తయారవుతారు. పైగా సైన్సు, సోషల్, లెక్కలు ద్వారా ఇంగ్లీషు నేర్పడం అనేది అశాస్త్రీయం. ప్రపంచంలో ఎక్కడా ఆవిధంగా జరగడం లేదు. ఋజువు కాలేదు కూడా. ఇవన్నీ కొత్త విషయాలు కానే కావు. మన నేతలకు తెలియకపోవడం కూడా కాదు. శాస్త్రీయమైన విద్య ఏమిటో ప్రజలకు చెప్పి, చైతన్యపరచడం పోయి, జనం అడుగుతున్నారనే వంకతో ఓట్ల కోసం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళను స్థాపించడం అంటే దేశాన్ని తాకట్టు పెట్టడమే.

ప్రభుత్వ టీచర్లేమో తమ పిల్లలను ప్రైవేటు ఆంగ్ల మాధ్యమ బడులలో చదివిస్తూ, బీదవారిని ప్రభుత్వ బడులలో చేరమని ప్రోత్సహిస్తున్నారు. తమ ఉద్యోగాలు పోతాయేమోనని ఏ.పి.టి.యఫ్. మినహా టీచర్ల సంఘాలన్నీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్ని ప్రభుత్వం పెట్టడాన్ని ఆహ్వానించాయి.

ఏరకంగా చూసినా ముందు ముందు మన తెలుగు పిల్లల భవిష్యత్తు అంధకారంగా కనపడుతోంది. తెలంగాణాలో వాడుకలో ఉన్న సుందరమైన తెలుగు ముందు ముందు మాయమవుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోను ఎవరైనా రెండు నిమిషాలు తెలుగులో మాట్లాడితే, “అరె మంచి తెలుగు మాట్లాడుతున్నాడే” అనుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా పిల్లలు తమ బాల్యాన్ని, సృజనాత్మకతను కోల్పోయి నిస్సారంగా పాఠశాలల్లో గడపవలసి వస్తుంది. ఇది మన దేశ స్వావలంబనను దెబ్బకొట్టడమే! పరభాష అయిన ఆంగ్లభాషే బోధనా భాష అయితే మన మూలాల్ని మనం కోల్పోయినట్లే!

“అన్య భాషీయులు ఆంగ్లాన్ని చేరుకునే వారధి వారి మాతృభాషే, దాన్ని పెద్ద వనరుగా ఉపయోగించుకుంటేనే ఆంగ్లాన్ని త్వరగా నేర్చుకోవచ్చు” అని బ్రిటిష్ కౌన్సిల్ సూచన. “అన్య భాషా మాధ్యమంలో చదవడం వలన పిల్లల నైపుణ్యాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని” యునెస్కో పరిశోధనలో తేలింది.

ఆంగ్లాన్ని భాషగా 3వ తరగతిలో ప్రవేశపెట్టి రెండవ భాషగా చేసి, శాస్త్రీయ పద్ధతులలో బోధిస్తే 10వ తరగతి పూర్తయ్యేనాటికి ప్రతి విద్యార్థికి ఆంగ్లభాషను అర్థం చేసుకోవడం, ఆంగ్లంలో సంభాషించడం నేర్పవచ్చు.

కనుక పిల్లల బాల్యాన్ని ప్రేమించే సోదరులారా! మన దేశ స్వావలంబనను కోరుకునే మిత్రులారా! పాఠశాల విద్యాబోధన తెలుగులోనే వుండాలని ఆంగ్లంలో వద్దని గొంతు కలపండి. ప్రతి పార్టీ తమ మానిఫెస్టోలో ఈ విషయం రాయాలని కోరుదాం. లేకుంటే ఈ పెనుముప్పు ఎదుర్కోవడం కష్టం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్