పదవ తరగతిలో నూరుశాతం ఫలితాలుBack to list

 ఇటీవలి వరదల్లో యంత్రాంగం ఎంత భాధ్యతాయుతంగా, ప్రభావవంతంగా పనిచేసి, కరకట్టలు తెగకుండా ఆపి, ప్రజల ఆస్తులను ప్రాణాలను రక్షించిందో మనందరమూ చూశాం. అందుకు జిల్లాయంత్రాంగానికి ప్రతి ఒక్కరూ తప్పక అభినందనలు తెలపాలి.కొద్ది రోజులు క్రితం మన ఉన్నతాధికారులు 10 వ తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక గురుకుల పాటశాలల్లోనైతే నూరుశాతం ఫలితాలే కాదు, నూరుశాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని గూడ ప్రకటించడం జరిగింది.

 
ఈ నిర్ణయం యొక్క సాధ్యాసాధ్యాలను, ఆవశ్యకతను పరిశీలించవలసిందే! పిల్లలలో చదువు మీద ఆసక్తి, అభిరుచి ఒకే స్థాయిలో ఉండడమనేది ప్రపంచంలో ఏదేశంలోనూ లేదు.
 
నూటికి 30 నుండి 40 మంది పిల్లలు మాత్రమే సాంప్రదాయపద్ధతిలో బాగా కష్టపడి చదివి, పరీక్షలన్నిటిలో ఉత్తీర్నులౌతూ రాంకులు సాధిస్తూ, ఇంజనీర్లు,డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, గొప్ప ఉద్యోగులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు, అకౌంటెంట్స్, ఉపాధ్యాయులు కావాలని ఆలోచిస్తారు.మిగిలిన 60శాతం పిల్లలకు వివిధరకాల ఆసక్తులు, అబిరుచులు ఉంటాయి.
 
·         సచిన్ టెండూల్కర్ కు క్రికెట్ పట్ల ఆసక్తి
 
·         శ్రీనివాసరామానుజంకు లెక్కలంటే గొప్ప ఆసక్తేగాని ఇంగ్లిష్ లో తప్పాడు
 
·         ఎమ్.ఎఫ్. హుస్సేన్ కు చిత్రలేఖనం ప్రాణపదం.
 
·         ఇసుకతో బొమ్మలు చేయమంటే సుధాకర్పట్నాయక్ కు ఎంతో ఇష్టం.
 
·         సాహిత్యంలో ఉన్నత శిఖరాలకు చేరిన మాలతీచందూర్ స్కూల్లో ఫైనల్ దాకే చదివింది.
 
·         వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 3వ తరగతి వరకే చదివాడట.అతని మక్కువ అంతా సంగీతం పట్లనే.
 
·         నాదస్వరమే సర్వస్వమై ప్రసిద్ధి చెందిన చల్లపల్లి మండలం లక్ష్మీపురం వాస్తవ్యుడు పిచ్చాహరికి పెద్దగా చదువు లేదు.
 
·         తెలుగు యూనివర్సిటీలో డప్పు కళలో ప్రొఫెసర్ అయి దేశ దేశాలు పర్యటించిన చిట్టూర్పుకు చెందిన కుంపటి భగవంతరావు అర్హత కేవలం ప్రాధమిక విద్యే.
 
·         జనహృదయనేత గుంటూరు బాపనయ్యకు పెద్ద చదువులు లేకుండానే రాజకీయాలలో రాణించారు.
 
·         ఎ.ఆర్/రెహమాన్ 10వ తరగతి చదివాడో, లేదో మనకనవసరం.
 
·         ఒక కుర్రాడికి తక్కిన అన్నిటినీ మించి డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం.
 
·         మరొకరికి కారు మెకానిజం అంటే చెప్పలేని ఇష్టం
 
·         కొందరికి చేతి పనులంటే అంతులేని ఆసక్తి.
 
ఇలా పెద్ద చదువులు చదవని ఎందరు సుప్రసిద్దులైనా ఉదాహరణగా చెప్పవచ్చు. పాటశాలలో ఐతే తప్పనిసరిగా ఫర్స్ట్ క్లాసులోనే ఉత్తీర్నులవ్వాలని ఉన్నతాధికారులు చెప్పడం బహుశా ఉపాధ్యాయులను అప్రమత్తం చేసి , ఉత్సాహపరచి, బాధ్యతగా చదువు చెప్పించాలనే సదుద్దేశం కావచ్చు. విద్యార్ధులలో, తల్లిదండ్రులలో చురుకుదనం పెంచి, మెరుగైన ఫలితాలను రాబతట్టాలనే ఆశయమే అయిఉంటుంది.
 
ఐతే ఉన్నతాధికారులు ఈ ఆదేశం రెండు రకాలుగా వికటించే అవకాశం ఉంది. మొదటిది ఉపాధ్యాయులలో ఒత్తిడినీ,భయాన్ని, రేకెత్తించి , అడ్డదారుల్లో అత్త్యుత్తమ ఫలితాలు సాధిచేలా ప్రేరేపించడం. రెండోది పిల్లలపై విపరీతమైన ఒత్తిడి తేచి, తిట్టి, కొట్టి చదివించే పెడ ధోరణికి పాల్పడం. దురదృష్టవసాత్తు ఇది విద్యార్ధుల ఆత్మహత్యలకు కూడా దారి తీయవచ్చు. దీన్ని మనం ఇంటర్మీడియట్ స్థాయిలో ఇప్పటికే చూస్తున్నాం.
 
దీనికి బదులుగా “పదవతరగతి వరకూ సంతృప్తి కరమైన హాజరుంటే, బడికి వచ్చి చదివితే ఏ ఒక్కవిద్యార్ధినీ తప్పించం. అందరూ స్కూలుకి రండి. నిశ్చింతగా శక్తీవంచన లేకుండ చదువుకొండి. మీ అభిరుచుల్ని వదులుకోకుండానే 10వ తరగతిలో గూడ ఉత్తీర్నులు కావటానికి ప్రయత్నించండి. బాలకార్మికులుగా పనిచేస్తే మాత్రం ఉపేక్షించం.......” అని నిర్ణయించి అమలు జరిపితే మరింత మెరుగుగా ఉంటుందేమో ఆలోచించాలి.
 
 ఈ విషయంపై విస్తృతమైన చర్చ జరపవలసిందిగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఆలోచనాపరులకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
 
జనవిజ్ఞానవేదిక – చల్లపల్లి
నవంబరు – 2009