గ్రామంలో దేవాలయాలు Back to list

 

 

1) జలధీశ్వరాలయం : మన గ్రామములోకెల్లా అతి ప్రాచీన ఆలయం ఇదే.మన గ్రామానికి అత్యంత ప్రతిష్టను తీసుకొచ్చిన ఆలయం కూడా ఇదే దీనికి ఎర్రగుడి అనికూడా పేరు ఉండేదట.పూర్వము దీనికి 300 ఎకరాల మాన్యం ఉండేది,తరువాత దానిని చల్లపల్లి జమిందారు తీసుకుని పడమటి పొలం ఏడు ఎకరాలు ఉంచారని అర్చకులు చెపుతారు.1950 నుంచి కొంతకాలం దోనేపూడి సీతారామయ్య,గొర్రెపాటి వెంకట్రామయ్య,గొర్రెపాటి బాపనయ్య ధర్మకర్తలు గా వ్యవహరించారు.వారి హయాం లోనే ప్రజల విరాళాలతో 1953 లో ధ్వజస్తంభానికి ఇత్తడితొడుగు చేయించారు.మళ్లీ ఇటీవల 2009 లో స్వాతి పత్రిక అధినేత శ్రీ వేమూరి బలరాం మరియు ప్రజల భాగస్వామ్యం తో నూతన ధ్వజస్తంభప్రతిష్ట జరిగినది.మరియు నూతనంగా నిర్మించిన గాలిగోపుర నిర్మాణానికి ప్రవాసాంధ్రుడు అయినపూడి వెంకట్రామయ్య 3 లక్షల రూపాయలు విరాళంగా అందచేశారు.

2) సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయం : ఈ గుడి ని 1813 లో గొర్రెపాటిచెంచయ్య గారి కుమారుడు కృష్ణమ్మ జలధీశ్వరాలయ ప్రాంగణంలో కట్టించారు.నాటి నుంచి నేటి వరకు మార్గశిర శుద్ధ షష్టి కి అతి వైభవముగా కళ్యాణోత్సవము లు జరుగును.మొదటిరోజు ధ్వజారోహణ,రెండవరోజు జగాజ్యోతి,మూడవరోజు కల్యాణం జరుగుతాయి.ఈ గ్రామ ఆడపడుచులంతా ఎక్కడున్నా షష్టి కిమాత్రం తప్పక హాజరవుతారు.


3) వేణుగోపాలస్వామి ఆలయం : ఎందుకో తెలియదు గాని గ్రామంలో అత్యంత నిరాదరణకు గురైన గుడి ఇది తప్ప మరోటి లేదు.దీని పూర్వీకులు చల్లపల్లి వాస్తవ్యులగు నంబూరికృష్ణమూర్తి మరియు పురుషోత్తం గార్లు.వీరే దీనిని కట్టించారు దీనిని నల్లగుడి అని కూడా పిలిచేవారు.ఈ దేవుని కల్యాణోత్సవము చేయించుట వల్ల నంబూరి వారి వంశం క్షీణించినదని ఘంటసాలపాలెం వారికి ధర్మకర్తృత్వం ఇచ్చారు.


4) ఆంజనేయస్వామి దేవాలయం : వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలోనే ఈ ఆలయం ఉంది.130 సంవత్సరాల క్రితం గ్రామవాస్తవ్యులగు గెల్లి వెంకట్రామయ్య,చెలమయ్య గారలు కట్టించారు.మరల 1905 లో ఆలయం శిధిలమైపోగా మళ్ళీ విరాళాలు పోగు చేసి పునర్నిర్మించారు.ప్రతి శివరాత్రికి దేవుని కల్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది.
ఇటీవలే దేవాలయ పునరుద్ధరణకి గొర్రెపాటి నవీన్ కుమార్ 50000/- విరాళంగా అందచేసారు.


6)అన్నపూర్ణాంబాలయం : ఈ గుడి పేరు కూడా చాలామంది విని ఉండకపోవచ్చు.వేమూరి ఘంటయ్య గారి తెగలో గోపాలుడు గారి భార్య గంగమ్మ గారు 1930 ప్రాంతంలో విశ్వేశ్వరాలయం ప్రాంగణంలో నే కట్టించారు.


7) భావనాఋషి ఆలయం :ఇటీవల కాలంలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది కాని ఇది కూడా పురాతన ఆలయమే.భావనాఋషి 18 వ శతాబ్దమునకు చెందిన సంఘసంస్కర్త.ఈయన పద్మశాలీలకి ఆరాధ్యదైవం.ఈ భావనాఋషి విగ్రహాన్ని 1915 లో ఒక పెంకుటింట్లో ప్రతిష్టించారు.తుమ్మలచర్ల గోవిందరాజులు దీని వ్యవస్థాపకులు.


8) వెన్నెమ్మ గుడి : ఇదెక్కడుందా అని ఆశ్చర్యపోకండి ప్రస్తుతం ఈ గుడి లేదు కాని ఇంతకుపూర్వం పడమటి వైపున ఈ గుడి ఉండేదనటానికి ఆధారాలున్నాయి.గ్రామ రెవెన్యూ రికార్డుల్లో వెన్నెమ్మ గుడి ప్రస్తావన ఉంది.


9) పెన్నేరమ్మగుడి : ఇది తెలియని వారుండరు ఎందుకంటే గ్రామ నడిబొడ్డున ఉన్న గుడి ఇది.ఇప్పటికి సుమారు 130 సంవత్సరాలక్రితం ఈ దేవతకి కొలువు జరుగుతుండేదట.1952 లో ఈ గుడి శిధిలం అవగా గొర్రెపాటి వెంకట్రామయ్య గారు చందాలు పోగుచేసి మరమ్మతు చేయించి మండపం కట్టించారు.దీనినే బస్ షెల్టర్ గా గ్రామస్తులు వినియోగిస్తున్నారు.


10) ముత్యాలమ్మ గుడి : ఇది కోటదిబ్బలకు వెళ్ళే దారిలో ఉంది.ఇది వేమూరి వారిలో బ్రహ్మన్న గారి తెగకు చెందినది.శ్రావణమాసం లో ఈ గుడి సంబరాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి.ఈ ముత్యాలమ్మ దేవరకోట వారి గ్రామదేవత.