ఘంటసాలలో నేను - డా.జి.వి.పూర్ణ చందుBack to list

పండిత గొర్రెపాటీ వేంకట సుబ్బయ్యగారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొనటానికి ఘంటసాల వెళ్ళటం వలన ఆ ఊరి ముచ్చట్లు చాలా పరిశీలించే అవకాశం కలిగింది. ఆ సభలో మాట్లాడుతూ నా చిన్నప్పటి ఊసు ఒకటి చెప్పాను. 1966,67 సంవత్సరాలలో మా నాన్నగారి ఉద్యోగం నిమిత్తం మేం ఘంటసాలలో ఉన్నాం. నేను ఆరోతరగతి, ఏడో తరగతి అక్కడ హైస్కూల్లో చదువుకున్నాను. 1967లో ఆ ఊరికి మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావుగారు వచ్చారు. ఆయనను ఏనుగు మీద ఊరేగించి, ఘనంగా సత్కరించారు. విశాలమైన స్థలంలో ఆయన కచ్చేరీ ఏర్పాటు చేశారు. ఎత్తైన వేదిక పైన కూర్చుని ఆయన పాడుతున్నారు. నేనుకూడా ఒకచెయ్యి ఆ వేదికమీదవేసి నుంచుని రెండో చెయ్యి చెవి మీడ ఆన్చి ఆయన పాటలు వింటున్నాను. అప్పుడు ఆయన కచ్చేరీ బృందంలో శ్రుతి వాయించేవాడికి ఏదో అత్యవసరం వచ్చినట్టుంది, నన్ను పిలిచి హార్మోనియం నొక్కుతూ కూర్చో అని చెప్పాడు. నేను అలాగే చేశాను. మర్నాడు హైస్కూల్లో ఘంటసాల కచ్చేరీలో హార్మనీ వాయించిన బుల్లోడని ఒకటే సందడి చేశారంతా! అదొక తీపి గుర్తు నాకు. నేను ఈ విషయం సభలో చెప్పాక అక్కడున్న చాలామందికి ఆనాటి ఙ్ఞాపకాలు తవ్వి నట్టయ్యింది. సభ అయిపోయాక ఒక్కక్కరూ తమ అనుభవాలు నాతో పంచుకున్నారు. ఘంటసాలవారు ఆ గ్రామాన్ని సందర్శించిన రజతోత్సవం సందర్భంగా అక్కడ ఘంటసాల కళాతోరణం పేరుతో ఒక ఆరుబయలు రంగస్థలిని నిర్మించారు. వచ్చే యేడు స్వర్ణోత్సవం రానుంది. కళాతోరణానికి ఒక వైపున ఘంటసాల వారి విగ్రహాన్ని, ఇంకో వైపున కృష్ణుడి వేషధారి యన్టీరామారావు విగ్రహాన్నీ నెలకొల్పారు.

స్వర్ణోత్సవం పురస్కరించుకుని ఆయన కచ్చేరీ చేసిన చోట ఎత్తైన ఘంటసాల విగ్రహాన్ని దాదాపు ఆరు లక్షల వ్యయంతో నిర్మించే ప్రయత్నం జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న విగ్రహాన్ని ఫోటోలో చూడవచ్చు.

స్వఛ్ఛ ఘంటసాల కార్యక్రమం నూరురోజుల పండుగ కూడా కలిసొచ్చేలాగా పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి విగ్రహావిష్కరణ సభను నిర్వహించారు. ఆ ఊళ్ళో ప్రస్తుతం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ సందరభంలో అక్కడ జరుగుతున్న ఎడ్లపందాలనూ కూడా చూడటానికి అవకాసం వచ్చింది.

సింధునగరాలలో దొరికిన ముద్రికలలో పెద్ద మూపురం ఉన్న ఎద్దు గురించి మనం చదువుకుని ఉన్నాం. తెలుగు నేలమీద ప్రసిద్ధమైఅన్ ఒంగోలు జాతి ఎద్దును చూస్తే సింధు ఎద్దు గుర్తుకొస్తుంది. భారీ శరీరం కలిగిన ఈ ఎద్దులజత ఒక పెద్ద బండరాయిని అవలీలగా లాగి పోటీలో గెలుపొందాయి. ఆ దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. తమిళులు కోర్టులో పోరాడుతున్న జల్లికట్టు (తెలుగు వాడైన మధురనాయక రాజు తిరుమలనాయకుడు స్పెయిన్ వాళ్లని చూసి ప్రారంభించిన ఆట) కన్నా ఇది ఆరోగ్యదాయకమైన అంసమే కావచ్చు. ఈ ఎడ్ల పందాలలో కోడిపందాలమాదిరి ‘పైపందెం’ జూదం ఏదీ జరిగినట్టు కనిపించలేదు. ప్రజలు బాగా వినోదించారు

ఘంటసాలవారి వంశీకులు ఘంతసాల జలధీశ్వరాలయం పక్కన నివశించేవారట. వారి స్మృతి చిహ్నంగా ఆలయం పక్కన ఒక ధర్మ సత్రాన్ని ఘంటసాల వంశికుల పేరుతో నిర్మించారు. దాని పోటోను కూడా చూదవచ్చు.

ఆ ఊళ్ళో ఇంకో ప్రత్యేకత నాకు కనిపించింది. చెరుకు గడల్ని ఎడ్లబండి మీద అడ్డంగా వేసుకుని చల్లపల్లి కెసిపి షుగరు ఫ్యక్టరీకి తరలిస్తూ ఉంటారు. తక్కిన ప్రాంతాల్లో నిలువుగా చెరకు గడలను పేరుస్తారట. అడ్డంగా వేసినందు వలన చెరకు బండి రోడ్డును ఎక్కువ ఆక్రమిస్తుంది. కానీ అడ్దంగా పేరిస్తే కనీసం అరటన్ను ఎక్కువ లోడు వేయవచ్చట. ఒఅక్ ఎడ్లబండి సీజనులో కనీసం 300 ట్రిప్పులు వేర్తుందని అంటే 150 టన్నుల అదనపు లోడుని తీసుకువెడుతుందనీ ఇది రైతుకీ, బళ్లవాళ్లక్కూడా లాభమేననీ ఆ ఊరి పెద్ద ఒకాయన చెప్పారు. కానీ, చెరకు సీజను నడిచినంతకాలం రోడ్డు మీద ఇతర వాహనాలు తిరగటానికి ఇబ్బందికదా...?

 

 

డా. జి వి పూర్ణచందు

Ayurvedic Consulting Physician 

రచయిత, పరిశోధకుడు, కాలమిష్టు

సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, సత్నాం టవర్స్, బకింగ్‘హాంపేట పోష్టాఫీస్ ఎదురుగా,

గవర్నర్ పేట, విజయవాడ-520 002. సెల్: 9440172642
e-mail:         purnachandgv@gmail.com    
                    gvpurnachand@gmail.com 
                    prapanchatelugu@gmail.com
 
My Website: http://gvpurnachand.com/
 
My Blog:      http://drgvpurnachand.blogspot.in/



తెదీ ః ౧౩.౦౧.౨౦౧౬