మా వూరు గురించి ✍️ నా మనసులో మాట💖Back to list

సాధారణముగా అందరూ అంటారు నోరు మంచిదైతే వూరు మంచిది అవుతుంది అని నేను అంటాను మనం పుట్టి పెరిగిన వూరు మంచిదైతే ప్రపంచమే అందముగా ఆహ్లాదంగా ఉంటుంది అని. మరి మా వూరు ఘంటసాల అటువంటిదే. అసలు గాయకుడు ఘంటసాల పేరు మా ఊరా లేక మా ఊరు పేరు ఆయన పెట్టుకున్నారా అనేది మీ  సందేహం కదా. ఆయన వంశ జన్మశాల మా ఊరే నండీ. ఇక్కడినుండే వారి పూర్వీకులు వలస వెళ్లారు. వారి బంధువులు ఇప్పటికీ ఘంటసాల లో ఉన్నారు. 
🎤🎻🎹🎸
మా ఊరి వారి నైపుణ్యం గురుంచి చెప్పాలంటే ముందుగా చేనేత గురించే చెప్పాలి. ఘంటసాల చేనేత వస్త్రాలు స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఎంతో ఫేమస్. ఎందరొ గొప్ప గొప్ప నాయకులకి ఖద్దరు పంచెలు నేసి ఇచ్చిన ఘనత మా వాళ్ళ సొంతం. చుట్టుపక్కల మండలాల్లోనే కాదు, రాష్ట్రమంతా ఘంటసాల చేనేత చీరలంటే నాణ్యమైనవిగా భావిస్తారు. అందుకే మా చేనేత కార్మికుల ఇళ్ళన్నీ ఎప్పుడూ కొనుగోలు దార్లతో కళ కళ లాడుతుంటాయి. 
👗👔👖👕👚
ఇంకో ముఖ్యమైన నైపుణ్యం కోలాటం , డప్పులు, తాళం భజన కళాకారులు. ఎప్పుడో దేవుడు చేసిన మనుషులు సినిమా టైం లోనే ఘంటసాల వారి కోలాటానికి ముగ్ధుడై సూపర్ స్టార్ కృష్ణ గారు ఊర్లో ఉన్న రజకుల రామాలయానికి విగ్రహాలు బహుమతిగా ఇచ్చారు.ఇప్పటికీ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకి ఘంటసాల కోలాటం వాళ్ళు వస్తున్నారంటే జనాలు వేచి చూడాల్సిందే.
🤺🏆🏅
ఇంట్లో జరుపుకునే చిన్న శుభకార్యమైనా, కళ్యాణ మండపంలో జరిగే పెళ్ళైనా, బెజవాడ లో కన్వెన్షన్ సెంటర్ అయినా, హైదరాబాదు లో స్టార్ హోటల్ అయినా మా ఊరు మ్యారేజ్ డెకరేటర్ల నైపుణ్యం ముందు చిన్నబోవాల్సిందే. తక్కువ ఖర్చుతో ఎక్కువ భారీతనాన్ని తీసుకురావటంలో ఘంటసాల మ్యారేజ్ డెకరేటర్ల ది అందెవేసిన చెయ్యి. వివాహ శుభకార్యాలలో ఘంటసాల నాయి బ్రాహ్మణుల బ్యాండ్ సెట్ మా ప్రాంతములో ఫేమస్ . 
🎷🎺🎈🎉🎊
 
ఊరుకి తూర్పున ఉన్న బౌద్ధ స్థూపం రోజూ వచ్చే టూరిష్టులతో కళకళ లాడుతుంటే , పడమట ఉన్న జలధీశ్వరాలయం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులతో సందడిగా ఉంటుంది. అన్నట్లు చెప్పటం మర్చిపోయా ప్రపంచంలో ఈ పేరుతొ ఉన్న గుడి ఇదొక్కటే , శివపార్వతులు ఏక పీఠం పై కొలువున్న ఏకైక పురాతన దేవాలయం కూడా ఇదే నండోయ్. పక్కనే షష్టి దేవుడు సుబ్బారాయుడు, కొంచెం పక్కకొస్తే వేణుగోపాలుడు. ముందేమో గ్రామ దేవత పెన్నేరమ్మ, ఊరుకి దక్షిణాన పచ్చటి పొలాల్లో కొలువైన ముత్యాలమ్మ , ఆళ్ళ వెంకమ్మ చెరువొడ్డున ఠీవీగా కూర్చున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరుడు. వీధికో రామాలయం , ప్రతి ఏడూ కన్నుల పండుగగా జరిగే సీతారామ కల్యాణం.  ఇప్పటికివే ఉన్నాయిగాని ఒకప్పుడు 101 దేవాలయాల పుణ్య క్షేత్రం మా ఘంటసాల. సర్వ మతాల , కులాల సామరస్యం . దేవాలయాలే కాదు , పలు చర్చి , మసీద్ , భౌద్ధ ఆరామాలకు నిలయం . మా ఊరులో దొరికిన బౌద్ధ శిల్పాలు పారిస్ మ్యూజియం లో ఉన్నాయి. 
💯🙏🙏🙏
వృధా గా సముద్రం లోనికి పోయే నీళ్లకు మేము చెక్ డ్యామ్ నిర్మించు కొనడం వలన ,మా వూరిలో నీళ్ళు ఏరులై పారుతునే ఉంటుంది , మేము ఎప్పుడు నీటి సమస్యను చూడలేదు. మా చుట్టూ వున్న నేల  , పొలాలు సస్యశామలమై పచ్చదనంతో  హరిత వర్ణములో ఎప్పుడూ కంటికి ,మనస్సుకు ఇంపుగా సొంపుగా ఉంటూనే వున్నాయి.ఏడాది పొడుగునా పంటలు పండే సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం మా ఘంటసాల. మా ఊరులో కరువు కాటకాలు గాని,  ప్రకృతి కన్నెర్ర చేయటం గాని చేయలేదు, మేము ఎరగము. అభ్యుదయ రైతులు, ప్రకృతి వ్యవసాయకులు, పశుపోషకులు, ఒకప్పుడు గొర్రెపొట్టేళ్ళు పందాలు అంటే మా ఊరిలోనే.
🐃🐏🐄🌵🎋🌾🌲
🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶🇮🇶
ఒక వూరి లోనే  14  మంది భారత ప్రభుత్వం గుర్తించి సత్కరించిన స్వాతంత్ర సమరయోధులు వున్నారు . వీరి లో గాంధీ గారి స్వతంత్ర ఉద్యమానికి చేయూతనిచ్చి వారి కున్న బంగారు ఆభరణాలు దానమిచ్చిన మహిళలు . ప్రభుత్వాలకి ముందే ఐదు దశాబ్దాల క్రితం జన్మభూమి అభివృద్ది మావూరి లో మొదలైనది. రాజకీయాల్లో నిజాయితీ , రాష్ట్ర జిల్లా స్థాయి లో మెలిగిన ప్రజా ప్రతినిధులకు అవినీతి మరకలు లేవు .
👳‍♂😇
చదువుల తల్లి మా ఘంటసాల. చదువు విలువనెరిగి స్వాతంత్రానికి పూర్వమే ఊరిలో హైస్కూల్ ని ఏర్పరుచుకున్న దార్శనికులు మా పూర్వీకులు. ఎంతోమంది ఈ గ్రామం లో చదువుకుని దేశ  విదేశాలలో ఎంతో  మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారంటే  మా బడులలో గురువులు నేర్పిన విద్య , వారు అందించిన జ్ఞానము . నిరుపేద నుంచి ధనికుడు వరకు ఏ స్వప్రయోజనాలు ఆశించకుండా నిరంతరం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని నమ్మి వారిని తీర్చిదిద్దడములో గురువులు, తల్లితండ్రులు, అలాగే సమాజం చేస్తున్న సాయం అనే యజ్ఞం వెల కట్టలేనిది. ముఖ్యముగా చుట్టుపక్కల గ్రామాలన్నిటిలోనూ అతి పెద్ద స్కూల్ ఘంటసాల హైస్కూల్. ఎంతమంది పిల్లలో ఆ స్కూల్ లో చదువుకుని అన్ని రంగాలలోను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు.
✍👭📚📖
మా ఊరు ప్రవాసుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా మూలాల్ని మరచిపోని మహనీయులు మా గ్రామస్తులు. వారి వదాన్యత కి గుర్తులు మా ఊరు బడిలో , గుడిలో , ఆఖరికి స్మశానంతో పాటు  గ్రామంలో అడుగడుగునా కనిపిస్తాయి. కళారాధకులు ,కళాపోషకులు ,కళాభిమానులు మా ఘంటసాల ప్రజలు. గ్రామాభివృద్దిలోనూ, మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాల్ని పెంచి పోషించటంలోనూ ప్రవాసులదే ప్రధాన పాత్ర. 
✈✈🇱🇷🇬🇧🇵🇸
ఇంకా మా ఊరు విశేషాలు , ఎప్పటికప్పుడు వార్తలు తెలియాలంటే మాకో వెబ్సైటు కూడా ఉంది మరి. www.managhantasala.net 
నేను ఎంతో  పుణ్యం చేసుకుంటే చారిత్రక గడ్డ అయిన ఘంటసాలలో పుట్టాను. జీవితములో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం , ఆత్మస్తైర్యం నా కన్నతల్లి ఘంటసాల నాకు ఇచ్చింది , ప్రపంచములో ఏ ప్రాంతం వెళ్ళిన సంస్కారముతో మెలిగే మర్యాద, గౌరవం నా ఘంటసాల నాకు నేర్పింది . పదిమందికి మనకున్న దానిలో దానం చేసే ఉదార స్వభావం నా ఘంటసాల నాకు నేర్పింది. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఘంటసాల లోనే పుట్టాలని కోరిక. .🙏🙏🙏
✍️👌గ్రామాలలో అరుదుగా వుండే 
1) Agriculture politecnic కాలేజీ ,  
2) ఆచార్య NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ వారి ARS వ్యవసాయ పరిశోధన క్షేత్రం ,   
3) భారత ప్రభుత్వ KVK కృషీ విజ్ఞాన కేంద్రం   
4) iti కాలేజి 
మా ఊరి '  ఆభరణాలు 💥☄️🌟
ఇట్లు
గొర్రెపాటి వెంకట రామకృష్ణ - కృష్ణా జిల్లా మాజీ zp వైస్ ఛైర్మన్
ఘంటసాల గ్రామస్థుడు
 
Dated :03.06.2020