నా ఘంటసాల ప్రయాణంBack to list

నా ఘంటసాల ప్రయాణం

ఎప్పుడూ కాంక్రీట్ జంగిల్ లో ఉండే మాకు అప్పుడప్పుడు పల్లెటూర్లో జరిగే పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఒక ఆటవిడుపులా అనిపిస్తుంది. కాలేజిలో నా పూర్వ విద్యార్ధి రాజేష్ వేమూరి కాల్ చేసి గురువుగారూ మీరు తప్పకుండా నా పెళ్ళికి రావాలి అనటంతో కొంత వాడి మీద ఉన్న వ్యక్తిగత అభిమానం, వాళ్ళ ఊరు చూడాలన్న ఉత్సుకత ఆ వివాహానికి పయనం కట్టించాయి. నేను నా సతీమణి మాత్రమే కాకుండా, రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకోలేక బాధపడుతున్న మా  DS ని కూడా వెంటేసుకుని హైదరాబాదు నుండి విజయవాడ దాకా మా కజిన్  కారులో బయలుదేరాం.అక్కడినుండి వాళ్ళు వేరే వివాహానికి వెళ్ళాల్సి ఉండటంతో మేము అక్కడనుంచి బస్సు లో వెళ్ళాలి.  విజయవాడ నుండి అవనిగడ్డ బస్సు ఎక్కి కూర్చున్నాక ఒక్కసారిగా జ్ఞాపకాల దొంతరలు కమ్ముకున్నాయి. ముప్పై ఏళ్ల క్రితం నా మిత్రుడు కృష్ణమూర్తి చెల్లెలు వసంత వివాహానికి పరిసేపల్లి రిక్షా లో వెళ్ళటం గుర్తుంది. బస్సు కంకిపాడు రాగానే ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొక్కజొన్న కంకులు బాగా పండే ప్రాంతం అవ్వటం వల్ల ఈ ఊరుకి కంకిపాడు అని పేరు వచ్చింది. దానికి గుర్తుగానేమో రోడ్డు పక్కన తాజా మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. సిటీ లో ఒక పొత్తు కొనే డబ్బులతో ఇక్కడ 5 కొనుక్కోవచ్చు. హైదరాబాదు లో సీతాఫల్ మండి అనే ప్రాంతానికి కూడా సీతాఫలాల వల్లే ఆ పేరు వచ్చింది. విషాద కరమైన విషయమేంటంటే ఇప్పడు ఆ ప్రాంతంలో మచ్చుకైనా ఆ ఫలాలు కనిపించవు.బస్సు కంకిపాడు ఉయ్యూరు దాటుకుని పామర్రు చేరుకుంది.ముప్పయ్యేళ్ళ క్రితం నేను చూసిన పామర్రు కి ఇప్పటికీ అసలెక్కడా పోలికే లేదు. అప్పుడొక మామూలు పల్లెటూరుగా ఉన్న పామర్రు ఇప్పుడు జనసమ్మర్ధంతో చిన్నపాటి పట్టణం గా మారిపోయింది. రోడ్డు పక్కన అమ్మే తోపుడు బళ్ళు ,ట్రాఫిక్ కి అడ్డం వచ్చే పాదచారులతో ఆ ప్రాంతం ఇప్పుడొక బిజీ జంక్షన్. 


అక్కడినుంచి పది కిలోమీటర్లు ప్రయాణించాక కూచిపూడి చేరుకున్నాం.ఖండాంతరాలు దాటిన మన కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లయిన ఆ గ్రామాన్ని చూడగానే ఒక్కసారిగా మనసు పులకరించింది. ఒకసారి ఇందిరా గాంధి కోసం డిల్లీలో కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఆ నాట్యం చేస్తున్నది అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పేదాకా ఆవిడ గుర్తుపట్టలేక పోయారట.మగవాళ్ళు ఆడవేషం వేసుకుని నాట్యం చేయటం ఈ నృత్యం లో ఒక ప్రత్యేకత. అక్కడినుంచి పదిహేను నిమిషాలు ప్రయాణించాక కొడాలి చేరుకున్నాం. దారి పొడవునా ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ మా ప్రయాణం సాగింది. 

కొడాలి నుండి ఆటో లో మరో పదిహేను నిమిషాలు ప్రయాణించాక ఘంటసాల చేరుకున్నాము. చాలామంది ఘంటసాల అనగానే గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ని గుర్తు చేసుకుంటారు. కాని ఆయనది విజయనగరం. తరువాత నేను తెలుసుకున్న ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు ఇక్కడ జన్మించకపోయినా ఆయన వంశ జన్మస్థానం ఇదేనట. వారి పూర్వీకులు ఈ గ్రామం నుంచే వలస వెళ్ళారని ఇక్కడ గ్రామస్తులు చెప్పటం విన్నాను. 1960 లో ఒకసారి ఈ గ్రామంలో కచేరీ కూడా చేసారట. ఘంటసాల ఒక చిన్న గ్రామం . పరి శుబ్రం గా కన్పించే చెరువులు, ఎక్కడా చెత్త చెదారం కనిపించని విశాలమైన  వీధులు, ప్రజారోగ్యం కోసం 20 లీటర్ల మినరల్ వాటర్ ని 2 రూపాయలకే అందించే వాటర్ ప్లాంట్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. నగరాల్లో వాటికి తీసిపోని విధంగా నిర్మించిన ఆధునిక భవంతులు ఈ గ్రామం ఎంత సంపన్నమైనదో చెప్పకనే చెప్పాయి. 

ఇప్పుడు ఈ గ్రామం లో స్థలాలు కొనుక్కుని ఇళ్ళు కట్టుకునేవారి సంఖ్య పెరిగిందని, ప్రభుత్వం ఈ గ్రామాన్ని పురాతన క్షేత్రంగా గుర్తించటంతో ఈ మధ్య సందర్శకుల సంఖ్య బాగా పెరిగిందని మమ్మల్ని తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్ చెప్పాడు. బౌద్ధ అవశేషాలు, మ్యూజియం తో పాటు ఇటీవల బహుళ ప్రాచుర్యం లోకి వచ్చిన శ్రీ బాలా పార్వతీ సమేత జలదీశ్వరాలయం ఈ గ్రామానికి తలమానికం అని, ఇంకా శ్రద్ధ పెడితే ఇది మరింత ప్రాచుర్యంలోకి రాగలదని కూడా తానే చెప్పాడు. ఒకే పీఠం పై కొలువై ఉన్న శివపార్వతులు ఈ ఆలయ ప్రత్యేకత. 



మేము విడిది చేసిన వసతి గృహం

ఈ గ్రామం నుంచి చాలామంది 30 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లి అక్కడే ఇంజినీర్లుగా,డాక్టర్లుగా,వ్యాపార వేత్తలుగా స్థిరపడిపోయారు. అలా స్థిరపడ్డ శ్రీ గొర్రెపాటి రంగనాధ్ గారి అతిధి గృహం లోనే మాకు బస ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో సినిమా హాలు ఉండేదని,దానిని కొని పడగొట్టి చెట్లు ,పూల మొక్కలతో ఆయన అభిరుచిమేరకు ఈ గెస్ట్ హవుస్ ని నిర్మించుకున్నారని మాకు సౌకర్యాలు చూసే వ్యక్తి చెప్పాడు. ఈ గ్రామస్తులు చాలా మంచివారు, మాకు అన్నివిధాలుగా నూ సహకారాన్ని అందించారు.  రాజేష్ వివాహానికి హాజరైన మిగతా పూర్వ విద్యార్ధులంతా చుట్టుపక్కల గ్రామాలకి చెందిన వారవటం తో మాకు మరిన్ని విశేషాలు చెప్తూ కాలక్షేపం చేశారు. చాలా కాలం తర్వాత ఇంతమంది పూర్వ విద్యార్ధులని కలుసుకోవటం చాలా ఆనందం వేసింది. ఈ అవకాశం కలిగించిన రాజేష్ కి కృతఙ్ఞతలు చెప్పాల్సిందే.

ఇక ఆ రాత్రి పెళ్లి అయ్యాక తిరుగు ప్రయాణం మాత్రం మరిన్ని తీపి జ్ఞాపకాలని అందించింది. ఘంటసాల నుంచి శ్రీకాకుళం మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా విజయవాడ చేరుకున్నాం. తెల్లవారుఝామున రోడ్డుకి రెండు వైపులా పచ్చని చెట్లు, అరటి, చెరుకు తోటలు, ఒక పక్క కృష్ణమ్మ, చల్లటి చిరుగాలి మధ్యన ఆటోలో సాగిన మా 52 కిలోమీటర్ల ప్రయాణం జీవితంలో మరెన్నడూ అలాంటి ప్రయాణ అనుభూతి కలగదేమో అనిపించింది. ప్రకృతి అందాలని నిండుగా ఆస్వాదిస్తూ సాగిన ఆ ప్రయాణం మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెల్లిందనే చెప్పాలి. 

Rajesh Vemuri who belongs to this place is very fond and sentimental about his birth place.తాను ఇంటర్నెట్ లో ఆ గ్రామం గురించి రాసే వ్యాసాలే ఒకరకంగా నన్ను ఆ గ్రామానికి పయనం కట్టించాయని చెప్పవచ్చు.
 
మూలం : రచయిత బ్లాగు నుండి 

రచయిత గురించి : 

ధర్మవరపు నాగార్జున గారు సికిందరాబాదు లోని Institute of Printing Technology లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ గా పనిచేస్తున్నారు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు శ్రీ డి. సీతారాం గారు వీరి తండ్రి.ఇటీవలే సీతారాం గారు కాలధర్మం చెందారు . http://archive.andhrabhoomi.net/content/di-yes
 
Dated : 22.03.2013