ఊరుకి కళ వచ్చిందిBack to list

దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇండియా కి వెళ్ళాను.ఊర్లోకి అడుగు పెట్టగానే ఒక్క క్షణం ఇది మన ఊరేనా అనే సందేహం కలిగింది. పాడుబడిన పెంకుటిళ్లు , నిర్మానుష్యంగా మారిన దొడ్లు, బిక్కు బిక్కు మంటూ గడిపే ముసలి ప్రాణాలు, లంకంత కొంపలో ఒక్కరో ఇద్దరో మనుషులు , ఆలనా పాలనా లేని రోడ్లు, పిల్లలంతా వలస వెళ్లిపోగా కళ తప్పిన గ్రామీణ జీవితం. ఐదేళ్ల క్రితం ఊర్లో పరిస్థితులు ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు ఊరు ను చుస్తే గత ఐదేళ్ళలో ఇంత మార్పా అనేలా సిమెంటు రోడ్లు , పెంకుటిళ్ల స్థానం లో ఆధునిక భవంతులు, తీర్చిద్దిద్దిన వాకిళ్లు, సిమెంటు రోడ్లు ,ప్రతి ఒక్కరిలో ఉత్సాహం, పెరిగిన జనాభా, కొత్తకళ సంతరించుకున్న గ్రామీణ జీవితం.

ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ప్రభుత్వ పధకాలు వెలుగు నింపాయి. వృధ్యాప్య పింఛన్లు , వితంతు పించన్లు , పశు పధకాలు, వ్యవసాయ పథకాల వల్ల గ్రామంలో దాదాపు 2500 మందికి ప్రయోజనం కలుగుతోంది. ఆర్ధికంగా స్థిరపడిన మధ్య తరగతి , ఎగువ మధ్య తరగతి రైతులు వ్యవసాయం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి ఎవరూ చెయ్యకపోతే పొలాలు ఎట్లా పండుతాయి ? ఈ మార్పు మిగతా దిగువ వర్గాలకి అవకాశాన్ని ఇచ్చింది. ఒకప్పుడు వ్యవసాయ కూలీలు గా ఉన్న వర్గాలన్నీ ఇప్పుడు కౌలు దారులుగా రూపాంతరం చెందారు. మరి అందరూ వ్యవసాయదారులైతే మరి కూలీల సంగతో ? అవును,పనులకి మనుషులు దొరకట్లేదనే కంప్లైంట్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ కూలీల స్థానాన్ని పెద్ద పెద్ద యంత్రాలు ఆక్రమించాయి. ఒకప్పుడు కోత కోయాలంటే 20 నుండి 30 మంది రోజంతా కష్టపడితే కానీ ఎకరం అయ్యేది కాదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం కూలి ఖర్చు కూడా ఎక్కువే. అదే మెషిన్ అయితే 2 గంటల్లో ఎకరం అయిపోతుంది, పైగా తక్కువ ఖర్చు. బీహార్ నుండి కర్ణాటక నుండి సీజన్ లో యంత్రాలు దిగిపోతున్నాయి. కోతలకి కుప్పలకి యంత్రాలే వాడుతున్నారు.

ఒకప్పుడు అరుగుల మీద చెప్పుకునే అమ్మలక్కల కబుర్ల స్థానంలో అమెరికా కబుర్లు వచ్చి చేరాయి.డాలస్ డౌన్ టౌన్ దగ్గరే మా అబ్బాయి ఉండేది. కాలిఫోర్నియా వెళ్ళినపుడు మాధవరావు గారి అబ్బాయి కలిశాడు.ఈసారి మిన్నెసోటా రమ్మని మరీ మరీ చెప్పి వెళ్లింది మా అమ్మాయి స్నేహితురాలు. అదేంటి వదినా మా అమ్మాయి ఉండేది ఇల్లినాయిస్ లోనే కదా అక్కడిదాకా వెళ్లి దాని ఇంటికి వెళ్లకుండా వచ్చారు. ఇవీ, ఊర్లో ఏ ఇద్దరు కలిసినా వినపడే మాటలు. ఉన్న పొలం అమ్మి , కడుపు కట్టుకుని చదివించిన పిల్లలు ప్రయోజకులై వాటి ఫలాల్ని అనుభవిస్తుంటే చూసి మురిసిపోయే మధ్య తరగతి తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. ఎప్పుడూ పాంట్ కూడా వెయ్యని సుబ్బయ్య, వెంకయ్యలు కొడుకునో కూతుర్నో చూడటానికి అలవోకగా అమెరికా కి వెళ్ళొచ్చేస్తున్నారు. ఆరునెలలు అమెరికాలో ఆరునెలలు ఇండియా లో ఉండే అమ్మా నాన్నలు పెరిగిపోయారు. ఎండలకు తాళలేని తాత లకి నానమ్మ లకి అమ్మమ్మలకి మనవళ్ళు,మనవరాళ్లు సకల సౌకర్యాలతో నిర్మించిన ఇళ్ళు , గోడ మీద బిగించిన ఎయిర్ కండిషనర్లు లు వీధి వీధికి కనిపిస్తున్నాయి.

ఎందుకొచ్చింది ఈ మార్పు ? తరతరాలుగా అభివృద్ధి నెరగని బడుగు,మధ్య తరగతి కుటుంబాలు గత 20 ఏళ్ల లో వొళ్లు విరుచుకున్నాయి. గ్రామం లో ఆస్తుల్ని అమ్ముకుని అయినా, తల తాకట్టు పెట్టి అయినా -ఒక్క వ్యక్తికయినా ఉద్యోగాన్ని కల్పించే మార్గంగా ప్రయాణం చేశాయి. కుటుంబ వికాసానికి హఠాత్తుగా ఏర్పడిన అవకాశాన్ని అందుకోడానికి హుటాహుటిగా ప్రయాణం చేశాయి.మార్పు అవసరాన్ని ఒరుసుకుని జీవనాన్ని పెనవేసుకుంది. ఉపాధి దాని మూలకారణం. మంచి జీవితం లక్ష్యం.అందరూ తమ తమ లక్ష్యాల దిశగా పిల్లల్ని నడిపారు.ఆ ఫలితాలు ఇప్పుడు అందాయి. ఇది కేవలం కొన్ని వర్గాలకో, కుటుంబాలకో పరిమితం కాలేదు. ఓ మెట్టు పైకేక్కిన వర్గాల పూర్వపు స్థానంలోకి అంతకంటే కింద ఉన్న వర్గాలు చేరుకున్నాయి. ఇదో నిరంతర ప్రక్రియ.

నేను గమనించిన మరికొన్ని ముఖ్య అంశాలు, పెరిగిన జన సంచారం, గ్రామంలో పెరిగిన మౌలిక సదుపాయాలు , ప్రజల్లో ఇంతకుముందు లేని ఏదో ఉత్సాహం. ఊరు ఇంతలా కళ కళ లాడటానికి కారణం జనాభా పెరుగుదల అంటే పొరపాటే .భావి తరాలన్నీ వలస పోతుంటే జనాభా ఎక్కడినుండి వస్తుందనేగా సందేహం ? ఊర్లో ఉద్యోగులు , విద్యార్థులుపెరిగారు. అద్దె ఇళ్లకోసం గాలించే ఆఫీసర్లు కనపడుతున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ళలో మన ఊర్లో నెలకొల్పిన సంస్థలు. కృషి విజ్ఞాన కేంద్రం,వ్యవసాయ పాలిటెక్నీక్ , నిర్మాణం లో ఉన్న శయన బుద్ధ ప్రాజెక్ట్. ప్రభుత్వ టీచర్లు , మండల ఉద్యోగులు ఊర్లోనే నివాసం ఉండటం.మరి ఇన్ని సౌకర్యాలు, చక్కటి సిమెంటు రోడ్లు ఉన్న ఊర్లోనే ఉండాలని ఎవరు కోరుకోరు ? ఓ పక్క చల్లపల్లి పూర్తి పట్టణ వాతావరణం లోకి మారిపోయాక , ప్రశాంతత కోసం అందరూ చూస్తోంది ఘంటసాల వైపే. దీనికి తోడు జలధీశ్వరాలయానికి కి పెరిగిన పర్యాటకుల తాకిడి మరో వైపు. చల్లపల్లి వైపు రోడ్డు విస్తరణ జరిగాక ప్రయాణం చాలా సులువుగా మారిపోయింది. గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి గ్రామంలో అడుగడుగునా కనిపిస్తుంది. పట్టుమని 10 ఇళ్ళు కూడా లేని బిరుదు గడ్డ గ్రామానికి కూడా తారు రోడ్డు, అక్కడినుండి చింతలమడ మీదుగా లక్ష్మీ పురం వరకు పొడిగింపు, తద్వారా తరువాతి చెరుకు సీజన్ లో ట్రాఫిక్ ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. అసలు కలలో నైనా ఊహించని సందులు గొందులు సిమెంట్ రోడ్లుగా మారిపోయాయి.ఊరికి నాలుగు వైపులా కనెక్టివిటీ పెరిగింది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ముఖ్యంగా మండలి బుద్ధ ప్రసాద్ గారికి గ్రామం పై ఉన్న అపేక్ష ఈ అభివృద్దికి కారణం అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక కమిట్మెంట్ లేకుండా ఐదేళ్ళలో ఇంత అభివృద్ధి అసాధ్యం. ఇంకా చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నా గత 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి.

ఇక ప్రభుత్వ భాగస్వామ్యం లేని కార్యక్రమాలకి వస్తే, గ్రామంలో పాడుబడిన దేవాలయాలన్నీ సరికొత్త రూపుని సంతరించుకున్నాయి. బాధ్యత తీసుకున్న ధర్మకర్తలు , ఔత్సాహికులు ఒకరి మీద ఒకరు పోటీగా దేవాలయాలన్నీ అభివృద్ధి చేశారు. ఇది మంచి కోసం పోటీ, అందరూ అందులో నూటికి నూరు శాతం సఫలీకృతులు అయ్యారు. ఫలితం , గ్రామం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందటం. మనిషి పుట్టే ఆసుపత్రి నుండి కట్టె కాలే రుద్రభూమి వరకు కించిత్ అసౌకర్యం లేని గ్రామం ఘంటసాల తప్ప చుట్టుపక్కల మరోటి లేదు అంటే నమ్మగలరా ?

ఈ మార్పులకి కారణం కేవలం రాష్ట్ర విభజన మాత్రమే కారణం కాదు. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో , దేశం లో వచ్చిన సంస్కరణలు తద్వారా ఏర్పడిన ఆర్ధిక వికాసం. ఈ ఆర్ధిక వికాసాన్ని అందుకోవటానికి ప్రయాణించిన ప్రజలు, అందుకు కృషి చేసిన ప్రభుత్వాలు.

ఈ పరమార్ధాన్ని గ్రహించలేని కొందరు "పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల" అంటూ 15 ఏళ్ల క్రితం పాటలు రాశారు. ఇప్పుడు "పల్లె కనువిందూ చేస్తుందో వికసించిన ఆర్ధిక సంస్కరణల్లో" అని పాడండి. ఎందుకంటే అప్పుడు జరుగుతున్న ఆర్ధిక వికాసం వైపు పయనాన్ని ప్రజలు , కొంతమంది కవులు అర్ధం చేసుకోలేకపోయారు, వాటి ఫలితాలు ఇవిగో ఇప్పుడు కనిపిస్తున్నాయి.

 

22.03.2019

This text will be replaced